Politics

లండన్‌కు జగన్. హుజూరాబాద్ దళితులకు మరో ₹500కోట్లు-తాజావార్తలు

లండన్‌కు జగన్. హుజూరాబాద్ దళితులకు మరో ₹500కోట్లు-తాజావార్తలు

* ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి లండన్, ప్యారిస్‍కు వెళ్లనున్న సీఎం జగన్, లండన్, ప్యారిస్‍లో 5 రోజుల పాటు ఉండనున్న జగన్.

* హుజూరాబాద్‌ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. దళితబంధు పైలెట్‌ ప్రాజక్టు కింద రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని హుజురాబాద్‌ సభ అనంతరం సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలయ్యాయి. వారం లోపు మరో రూ.1000 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

* రాష్ట్రంలో స్త్రీ నిధి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 60 కోట్ల రూపాయలను మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలుగా అందజేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా 2 వేల 340 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు, 7 వందల 20 కోట్ల రూపాయలు పట్టణ ప్రాంతాలలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణంగా అందజేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాదులోని ఖైరతాబాద్ లో నున్న రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నాడు స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి ద్వారా ఒక లక్ష పాడి పశువుల కొనుగోలుకు రుణ సౌకర్యం అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. శ్రీనిధి విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూరు మహిళ సహకార డైరీ, నార్ముల్ డైరీల సహకారంతో సుమారు మూడు వేల గ్రామాల రైతులతో సమన్వయం చేసుకొని పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నమని మంత్రి తెలిపారు.

* ఏపీలో పాఠశాలలు మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పాఠశాలల్లో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఆర్ఎం మున్సిపల్ స్కూలులో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు చిన్నారులు కరోనా బారిన పడ్డారు.

* తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 74,634 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 354 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,55,343కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,861కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 427 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,308 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటంలో భాగంగా దేశంలో తొలిసారి తయారుచేసిన వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారంతా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని ప్రకటించింది. కరోనా కట్టడే లక్ష్యంగా మన దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు తయారైన విషయం తెలిసిందే. ఆయా వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగస్వాములైన దాదాపు 11,300 మందికి పైగా ఈ డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను కొ-విన్‌ పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొనేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు 11,349మంది డేటాను ఐసీఎంఆర్‌ అందజేసిందని తెలిపింది.

* పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. సమీక్ష అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు వాటర్‌ ప్లస్‌ సిటీలుగా ధ్రువీకరణ లభించిందని, ఇదే స్ఫూర్తితో మిగిలిన కార్పొరేషన్లలోనూ ప్రగతి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదని.. న్యాయస్థానం ఆదేశాలతోనే విశాఖ వెళ్తామని స్పష్టం చేశారు.

* దేశవ్యాప్తంగా డిసెంబర్‌లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో పర్యటించిన ఆయన.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. ‘కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చిన్నపిల్లలకు వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది’ అని కిషన్‌రెడ్డి వివరించారు.

* కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక మండలం వల్బాపూర్‌లో మాజీమంత్రి, ఈటల రాజేందర్‌ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. రాజేందర్‌ సమక్షంలో పలువురు కార్యకర్తలు భాజపాలో చేరారు. భాజపాలో చేరుతున్న వారిని స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ ఫొటోలు తీశారు. దీంతో ఏఎస్‌ఐతో భాజపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని కోరారు. సోమవారం దిల్లీలో ఆయన మాట్లాడారు. నరసాపురంలో జగన్‌, నేను పోటీ చేస్తే ఎలా ఉంటుందని సర్వే చేశారని.. ఇందులో జగన్‌కు, తనకు మధ్య 19 శాతం వ్యత్యాసం ఉందన్నారు.

* బిహార్‌లోని భాగల్‌పుర్‌లో ఉన్న సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా ఈ ఏడాది ఇంటర్‌లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

* కులాలవారీగా జనగణనను చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ సోమవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తమ అభ్యర్థనలను ప్రధాని విన్నారని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడించారు. ‘కులాలవారీగా జనగణనపై మా డిమాండ్‌ను ప్రధాని మోదీ విన్నారు. ఆయన దాన్ని తిరస్కరించలేదు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని మా బృందం కోరింది. మా విన్నపాన్ని పరిశీలిస్తారని మేం భావిస్తున్నాం’ అని నితీశ్ వెల్లడించారు.

* అఫ్గానిస్థాన్‌లోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 26న గురువారం ఈ సమావేశం జరగనుంది. అఫ్గాన్‌లోని పరిస్థితులను, భారత్‌ అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించే అవకాశం ఉంది. అంతకుముందు అఫ్గాన్‌ పరిణామాలపై రాజకీయ పార్టీలకు వివరించాలని ప్రధాని మోదీ విదేశాంగ శాఖకు సూచించారు.

* అదిగో తాలిబన్లు వచ్చేస్తున్నారు.. ! ఇదిగో బద్రీ313 ఫోర్స్‌.. ! అమెరికా సైన్యం పరార్‌..! తోకముడిచిన సంకీర్ణ సేనలు.. ! ఇలా తాలిబన్లు చేసిన ప్రచార యుద్ధానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అదిరిపోయి.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు పలాయనం చిత్తగించారు.. అదే సమయంలో పనిలోపనిగా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ కూడా పారిపోయాడంటూ తాలిబన్లు ప్రచారం చేపట్టారు..! ఇంతలో ‘ఇప్పుడు నేనే అధ్యక్షుడిని.. దేశంలోనే ఉన్నాను’అంటూ అమ్రుల్లా ఓ ట్వీట్‌ చేశారు..!

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు.. 11:00 గంటల సమయంలో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ సమయంలో టైటన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు దిగజారడంతో సూచీలు కుంగాయి. కొద్దిసేపట్లోనే ఐటీ రంగం నుంచి లభించిన అండతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి.

* ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టులో పంజాబ్‌ నుంచే అత్యధిక మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పది ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక ఆటగాళ్ల పేర్లను మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ అంగీకారం తెలిపినట్లు పంజాబ్‌ విద్యాశాఖా మంత్రి విజయ్‌ ఇందర్‌ సింగ్లా పేర్కొన్నారు.