Business

రోడ్లు కూడా అమ్ముతామంటున్న నిర్మలా-వాణిజ్యం

రోడ్లు కూడా అమ్ముతామంటున్న నిర్మలా-వాణిజ్యం

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో బంగారం, వెండి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర కేవ‌లం రూ.7 పెరిగి రూ.46,223కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యార‌ట్ గోల్డ్ ధ‌ర రూ.46,216 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో స్త‌బ్దుగా ముగియ‌డం, డాల‌ర్ కాస్త బ‌ల‌హీనప‌డ‌టం ఇవాళ బంగారం, వెండి ధ‌ర‌లు స్థిరంగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

* నిధుల స‌మీక‌ర‌ణ కోసం మ‌రిన్ని సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. రోడ్లు, విమానాశ్ర‌యాలు, విద్యుత్, గ్యాస్‌పైప్‌లైన్‌లను విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ ( Nirmala Sitaraman ) చెప్పారు. మొత్తం రూ.6 ల‌క్ష‌ల కోట్ల నిధుల సేక‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. ఈ మేర‌కు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రోడ్‌మ్యాప్ ప్ర‌క‌టించారు.

* రిల‌యన్ జియో ఎంట్రీ.. అప్పుల ఊబి.. ఏజీఆర్ బ‌కాయిల చెల్లింపు వంటి అంశాల‌తో న‌ష్టాల్లో కూరుకున్న‌ప్రైవేట్ టెలికం ఆప‌రేట‌ర్ వొడాఫోన్ ఐడియాకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. జూన్ నెల‌లో వొడాఫోన్ ఐడియా భారీ స్థాయిలో 42.8 ల‌క్ష‌ల సబ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయింది. దీంతో వొడాఫోన్ ఐడియా క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 27.3 కోట్ల‌కు ప‌డిపోయింది. మ‌రోవైపు రిల‌య‌న్స్ ఖాతాదారులకు అద‌నంగా 54.6 ల‌క్షలు, భార‌తీ ఎయిర్‌టెల్‌కు 38.1 ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్లు జ‌త క‌లిశారని ట్రాయ్ విడుద‌ల చేసిన నివేదిక‌లో పేర్కొంది. కొత్త‌గా 54.6 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్ల చేరిక‌తో రిల‌య‌న్స్ జియో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 43.6 కోట్ల‌కు చేరింది. వైర్‌లైన్ క‌స్ట‌మ‌ర్లు జియోకు 1.87 ల‌క్ష‌ల మంది వ‌చ్చి చేరారు.

* కొత్త క్రెడిట్‌ కార్డులు విక్రయించకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై విధించిన నిషేధాన్ని ఆర్‌బీఐ ఎత్తివేయడంతో.. తిరిగి ఈ విభాగంలో పూర్వవైభవాన్ని సాధించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. నెలకు మూడు లక్షల క్రెడిట్‌ కార్డుల విక్రయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ పేమెంట్స్‌ విభాగాధిపతి పరాగ్‌ రావు వెల్లడించారు. మూడు నెలల్లో ఈ లక్ష్యాన్ని అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రెండు త్రైమాసికాల్లో నెలకు ఐదు లక్షల కార్డుల విక్రయాన్ని టార్గెట్‌గా నిర్దేశిస్తామన్నారు. ఇలా ఇప్పటి నుంచి రానున్న నాలుగు త్రైమాసికాల్లో కార్డుల విభాగంలో మార్కెట్‌ షేర్‌ పరంగా తిరిగి అగ్రగామిగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.