NRI-NRT

తానా బోర్డు ఛైర్మన్‌గా డా.బండ్ల హనుమయ్య

తానా బోర్డు ఛైర్మన్‌గా డా.బండ్ల హనుమయ్య

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బోర్డు ఛైర్మన్‌గా మాజీ అధ్యక్షుడు, డెట్రాయిట్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. బండ్ల హనుమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, కోశాధికారిగా దేవినేని లక్ష్మీలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని ఓ గ్రామానికి చెందిన డా.హనుమయ్య 2005-07 మధ్య తానా అధ్యక్షుడిగా సేవలందించారు. మృదుభాషి, మితభాషి, నిగర్విగా తానాలో మంచి పేరు కలిగిన ఆయన సారథ్యంలో తానా రాజ్యాంగానికి పెద్ద గొడుగు పడతారని సభ్యులు, ప్రవాసులు ఆకామ్కిస్తున్నారు. తానా మౌలిక వనరులను బలోపేతం చేస్తూ అందరికీ సంస్థను చేరువ చేసే లక్ష్యంతో పనిచేస్తానని డా. బండ్ల హనుమయ్య తెలిపారు.

* ఎన్నాళ్లకెన్నాళ్లకు…?
తానాలో మహిళా నాయకత్వం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వినపడే పేర్లు ఒకటి నుండి మూడు మధ్యలోనే పరిమితం కావడం హాస్యాస్పదం, ఆశ్చర్యకరం. తానాతో చిరకాలం అనుబంధం కలిగిన దేవినేని లక్ష్మీ చాలాకాలంగా తానాలో ఖాళీగా ఉన్న మహిళా నాయకురాళ్ల సీటులో ఆశీనురాలు కావడం సంస్థకు నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తీసుకువస్తుందని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర అమెరికాలో ప్రవాస మహిళలు ఎదుర్కొనే పలు సమస్యలను పరిష్కరించడంలో దేవినేని సుపరిచితురాలు. బోర్డులో తన పరిధి మేరకు తానా వ్యాప్తిని విస్తృతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

నూతన బోర్డుకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి అభినందనలు తెలిపారు.