Politics

షర్మిలకు సెకండ్ షాక్

షర్మిలకు సెకండ్ షాక్

వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌టిపిని స్థాపించిన సంగతి తెలిసిందే. తొలినాళ్లలో పార్టీ ప్రకటన, పార్టీ పేరు అంటూ హడావుడి చేసిన షర్మిల వెంట ముఖ్య నాయకులే నడిచారు. అయితే, తర్వాత తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటికి వచ్చేస్తున్నారు. తాజాగా ఇందిరా శోభన్‌ పార్టీకి రాజీనామా చేశారు. తనవెంటే ఉంటామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ షాక్‌లు మీద షాక్‌లు ఇవ్వడం ఒకటైతే.. ఎవరి కోసమైతే నిలబడదామని షర్మిల అనుకున్నారో ఇప్పుడు వారే వద్దనడం మరో షాక్‌కు గురి చేసింది. ప్రభుత్వం ఉద్యోగం దొరక్క ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం వారి ఇంటి వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షల పేరుతో ఆత్మహత్యల అంశాన్ని తెరపైకి తీసుకురావాలని షర్మిల భావించారు. ఇదే క్రమంలో సిఎం కెసిఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆమె మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టాలనుకున్నారు. గ్రామానికి చెందిన పట్టభద్రుడు నరేశ్‌ ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న నిరాశతో బలవన్మరణం చెందాడు. నరేష్‌ జ్ఞాపకార్థం షర్మిల నిరాహార దీక్ష చేయాలనుకుంది. అయితే, నరేష్‌ తండ్రి తన ఇంటికి రావొద్దని కోరడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ పరిణామం దీక్షకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్‌ఆర్‌టిపి నాయకులను కూడా షాక్‌కు గురి చేసింది. నరేష్‌తో పాటు ఆయనకు మరో ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురూ సర్కార్‌ కొలువుల్లో ఉన్నారు. ఇప్పుడీ షర్మిల దీక్ష వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయేమో అని నరేష్‌ తండ్రి భయపడినట్లున్నాడు. దీంతో తన ఇంటికి రావద్దని షర్మిలకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఇందిరా శోభన్‌ గత శుక్రవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం షర్మిలకు పెద్ద షాక్‌ అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ పెట్టక ముందే కాంగ్రెస్‌ని వీడి షర్మిల వెంట నడిచిన ఇందిర ఇంత హటాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. సరైన ప్రాధాన్యత లేకపోవటం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఇందిర చెప్పినప్పటికీ.. తెరవెనక కథ ఇంకేదో కారణం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, రాజీనామా వెనక్కి తీసుకోవాలని, ఇకపై బాగా చూసుకుంటానని షర్మిల హామీ ఇచ్చారని, అయినా ఇందిర ససేమిరా అన్నట్టు సమాచారం. మరోవైపు ఇందిరా శోభన్‌ రాజీనామా వెనక టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఉన్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేవంత్‌కు సన్నిహితురాలైన ఎమ్మెల్యే సీతక్క కూడా ఇందిరతో మాట్లాడారని సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న రేవంత్‌ ఇందిరను మళ్లీ పార్టీలోకి తీసుకొస్తాడో లేదో చూడాలి.