Business

త్వరలో గూగుల్ పే ఫిక్సిడ్ డిపాజిట్లు-వాణిజ్యం

త్వరలో గూగుల్ పే ఫిక్సిడ్ డిపాజిట్లు-వాణిజ్యం

* రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటినీ నవంబరు నెలాఖరు కల్లా సర్వ సేవా కేంద్రాలు(సీఎస్‌సీ)గా మార్చేందుకు ఏపీ తపాలా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో తపాలా సేవలతో పాటు 34 రకాల ఆన్‌లైన్‌ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే కంప్యూటర్లు అందుబాటులో ఉండి, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న 1,568 పోస్టాఫీసులను కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా మార్చేశారు. మరో 8,504 పోస్టాఫీసులను రెండు నెలల్లో సీఎస్‌సీలుగా మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌, ఓటరు గుర్తింపు కార్డు, మొబైల్‌ రీఛార్జీలు, బీమా ప్రీమియంలు, ఆర్‌టీఏ, డీటీహెచ్‌ సేవలు, విద్యుత్తు, నీటి బిల్లులు, గ్యాస్‌ కనెక్షన్లకు దరఖాస్తు, ఫాస్ట్‌ట్యాగ్‌ సేవలు, రైలు, బస్సు, విమాన టికెట్లు, ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి యోగిమాన్‌ ధన్‌ యోజన వంటి పథకాలకు దరఖాస్తులు, సాయిల్‌ హెల్త్‌కార్డ్‌, ఆహార పదార్థాల విక్రయ లైసెన్సులు. ‘‘తపాలా శాఖకు ఉన్న పరిధిని ఉపయోగించుకుని అన్ని గ్రామాలకూ ఈ ఆన్‌లైన్‌ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డా.అభినవ్‌ వాలియా తెలిపారు. ‘‘సీఎస్‌సీలలో అందించే సేవలపై రాష్ట్రంలోని నాలుగు వేల మందికిపైగా తపాలా శాఖ సిబ్బంది తర్ఫీదు పొందారు. ఇప్పటి వరకు తపాలా సీఎస్‌సీల ద్వారా సుమారు రూ.1.30 కోట్ల విలువైన 11,710 లావాదేవీలు చేశాం’’ అని అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ సుధీర్‌బాబు వివరించారు.

* ద‌క్షిణ కొరియా కారు త‌యారీ కంపెనీ హ్యుందాయ్ వచ్చేవారంలో త‌న ఐ20 ఎన్ లైన్ ఇండియా లాంఛ్‌ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఐ20 ఎన్ లైన్ వివరాల‌ను వెల్ల‌డించిన కంపెనీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. సెప్టెంబ‌ర్ 2న ఈ వాహ‌నం ధ‌ర‌ను హ్యందాయ్ వెల్ల‌డించనుంది.

* దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ ఎడ్‌టెక్‌​ స్టార్టప్ “స్పోర్​జో” 2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ప్రి సిరీస్ ఏ రౌండ్​లో ప్రైవేట్ ఇన్వెస్టర్, పునీత్ బాలన్ గ్రూప్, పునీత్ బాలన్ స్టూడియోస్ చైర్మన్ పునీత్ బాలన్.. స్పోర్​జోలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అలాగే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్​తో స్పోర్​జో చేతులు కలిపింది. 1996 ఒలింపిక్స్ మెడలిస్ట్ పేస్ ఈ స్టార్టప్​నకు వ్యూహాత్మక సలహాదారుగా, అంబాసిడార్​గా వ్యవహరించనున్నారు.

* త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (ఎఫ్‌డీ) బుకింగ్‌ చేసుకునే వీలును గూగుల్ పే (Google Pay) కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. మింట్‌ నివేదిక ప్రకారం, గూగుల్ పే ద్వారా ఎఫ్‌డీలను బుక్ చేసుకునేందుకు తమ వినియోగదారులను అనుమతించడానికి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లను (ఏపీఐ) అందించడంలో ప్రత్యేకత కలిగిన ఫిన్‌టెక్ సేతుతో గూగుల్ జతకట్టింది. దీంతో గూగుల్‌ పే వినియోగదారులు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలను ఒక ఏడాది వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ఎఫ్‌డీలకు పొందే గరిష్ట వడ్డీ రేటు 6.35 శాతంగా ఉండనున్నది. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు వన్‌ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా ఆధార్ ఆధారిత కేవైసీని పూర్తిచేయాల్సి ఉంటుంది.

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (Reserve Bank Of India) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్‌ను నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అతడి నియామకం ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియామకానికి ముందు ఆయన న్యూఢిల్లీలోని రీజనల్‌ డైరెక్టరేట్‌లో రీజనల్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్, ప్రిమిసెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా అజయ్‌ కుమార్‌ బాధ్యతలు చూస్తారు. సెంట్రల్ బ్యాంక్‌లో అజయ్ కుమార్‌కు మూడు దశాబ్దాల అనుభవం ఉన్నది.