Politics

విజయసాయి విదేశీ పర్యటనకు అనుమతి-తాజావార్తలు

విజయసాయి విదేశీ పర్యటనకు అనుమతి-తాజావార్తలు

* విదేశాలకు వెళ్లేందుకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు విదేశాలకు వెళ్లాలని విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. అక్టోబరులోగా రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. రూ.5లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దుబాయ్‌, బాలి, మల్దీవులకు విజయసాయి వెళ్లనున్నారు.

* అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్‌ అధికారులు సమాచారమిచ్చారు. కాబూల్‌ విమానాశ్రయం వద్ద దాడులు జరగొచ్చని ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. బ్రిటన్‌, ఆస్ట్రేలియా సైతం ఈ హెచ్చరికలను సమర్థించాయి. అక్కడికి కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

* రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైనాన్స్‌ కంపెనీ పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రై.లి.కి చెందిన రూ.106 కోట్లు ఈడీ జప్తు చేసింది. క్యాష్ బీన్‌ మొబైల్‌యాప్‌ ద్వారా రుణాలు ఇచ్చిన పీసీఎఫ్‌ఎస్‌… చైనాకు చెందిన జో యాహుయ్‌ ఆధీనంలో పనిచేస్తోందని ఈడీ తెలిపింది. బోగస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, యూఎస్‌, సింగపూర్‌కు నిధులు తరలించినట్టు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్‌ఎస్‌ సొమ్ము జప్తు చేసినట్టు ఈడీ పేర్కొంది.

* కోకాపేట భూముల వేలం వ్యవహారంలో జీవో నంబర్‌ 111పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నాలుగేళ్లు దాటినా ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా, తదితర కారణాలతో ఆలస్యమైందని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు సమాధానమిచ్చారు.

* సహేతుక కారణాలు వివరించే విద్యా సంస్థల ఫీజులు సవరించేందుకు సిద్ధమని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కాంతారావు చెప్పారు. 20 ఏళ్లుగా ఫీజులు ఖరారు చేయలేదన్న ఆయన.. కళాశాలల పరిశీలనకు వెళ్తుంటే కొందరు కోర్టులకెందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. విద్యాసంస్థలను లాభదాయకంగా చూడరాదన్నారు.

* దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు లాభం జరగాలనే కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అందుకే రేవంత్ రెడ్డి సోనియాను తెలంగాణ తల్లిగా భావిస్తారని అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులను అణచివేస్తున్నారని మండిపడ్డారు.

* అధికారంలోకి రాలేమని గ్రహించే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. తెరాస శాసన సభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డిది మాటలు.. మూటలు.. ముఠాలు చేసే వైఖరని వ్యాఖ్యానించారు.

* పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సస్పెండైన ఐపీఎస్‌ అధికారి గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌పై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం దేశద్రోహం, తదితర కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

* ఈ శతాబ్దపు ప్రపంచ జనాభా 2064లో అత్యధికంగా ఉంటుందని, అయితే… శతాబ్దం చివరి నాటికి అందులో 50% తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనకర్తలు అంచనా వేశారు. మరీ అంత తగ్గుదల ఎందుకు ఉంటుందని ఆశ్చర్యపడాల్సిన పనిలేదట! సమాజం నుంచి ఎదురయ్యే రకరకాల ఒత్తిళ్ల కారణంగా మానవ పునరుత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమవుతుందని వారు విశ్లేషించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒడుదొడుకులకు లోనైన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ ముగించాయి. సెన్సెక్స్‌ 56వేల మార్కు దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.22గా ఉంది. ఉదయం 55,935 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌.. తొలుత నష్టాల్లోకి వెళ్లి మళ్లీ లాభాల బాట పట్టింది.

* యాహూ సంస్థ భారత్‌లో న్యూస్‌ వెబ్‌సైట్‌ను మూసివేసింది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పురావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. విదేశీ యాజమాన్యంలోని మీడియా కంపెనీల డిజిటల్‌ కంటెంట్‌ను ఇది నియంత్రిస్తోంది. మూసివేస్తున్న వెబ్‌సైట్లలో యాహూ న్యూస్‌, క్రికెట్‌,ఫైనాన్స్‌,ఎంటర్‌టైన్‌మెంట్‌,మేకర్స్‌ ఇండియా ఉన్నాయి. భారత్‌లో యాహూ మెయిల్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ వినియోగించే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు.

* తెలంగాణకు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ నేతలపై నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ జారీ అయింది. కాంగ్రెస్‌ నేతలు పి.బలరాంనాయక్‌, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిపై ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. హన్మకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించారని 2018లో వీరిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశించినప్పటికీ విచారణకు హాజరు కానందున ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం వారిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ముగ్గురు నేతలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాగానే బలరాం నాయక్ కోర్టుకు హాజరయ్యారు. దీంతో బలరాం నాయక్‌పై జారీ చేసిన వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది.