Food

అరటి పిండితో చపాతీ అంట…తింటారా?

అరటి పిండితో చపాతీ అంట…తింటారా?

అరటి చపాతీ తిన్నారా ఎప్పుడైనా…? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా! మీకు చిత్రంగా ఉండొచ్చు కానీ కర్ణాటకలోని కొందరు అరటితో చపాతీలే కాదు బిస్కెట్లూ, గులాబ్‌ జామ్‌లూ చేసుకుని తింటున్నారు!

**దక్షిణ, ఉత్తర కర్ణాటక జిల్లాల్లో సాగుచేసే ప్రధాన పంటల్లో అరటి ఒకటి. కానీ సరైన ధర అందక తరచూ ఇబ్బంది పడుతుండేవారు రైతులు. లాక్‌డౌన్‌ సమయంలో కేజీ రూ.4-5 మాత్రమే చెల్లించి నాణ్యమైన అరటిని మాత్రమే దళారులు కొనేవారు. మిగిలిన పంటను ఇంకా తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చేది. అది రవాణా ఖర్చులకూ వచ్చేది కాదు. దాంతో పెద్ద మొత్తంలో అరటి గెలలు రైతుల దగ్గరే మిగిలిపోయేవి. ఎవరికైనా ఇద్దామన్నా, దాదాపు అందరూ అరటిని పండించేవారే. ఆ పరిస్థితుల్లో వాటిని బయట పడేయడమో, పశువులకు మేతగా వేయడమో చేసేవారు.

**తుముకూరుకు చెందిన మహిళా రైతు నయనా ఆనంద్‌ ఈ పరిస్థితిని కొన్నేళ్లుగా పరిశీలిస్తోంది. కొందరు అరటి పండ్లను ఎండబెట్టి ప్యాక్‌లలో అమ్ముతుంటారు. కానీ వాటికి డిమాండ్‌ తక్కువ. కేరళకు చెందిన ఓ మహిళ ‘నేంద్రన్‌’ రకం అరటి నుంచి పొడిని తయారుచేసి అమ్ముతున్నట్టు ఈ మార్చిలో సోషల్‌ మీడియాలో చూసింది నయన. అలెప్పీలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సాయంతో ఆ పని చేయగలిగానని చెప్పిందామె. కేరళలో అరటి పొడిని చంటి పిల్లలకు ఆహారంగా పెడతారు. అందుకే అక్కడ ఆ పొడికి గిరాకీ ఉంది. అలా తాము కూడా చేయొచ్చన్న ఆలోచన వచ్చింది నయనకు. ‘ఎనీటైమ్‌ వెజిటబుల్స్‌’ పేరుతో కర్ణాటకలో రైతులకే ప్రత్యేకమైన వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది. శ్రీ పాద్రే అనే జర్నలిస్టు దాన్ని నిర్వహిస్తారు. అరటి పొడి తయారీ విషయంలో పాద్రే సాయాన్ని నయన కోరినపుడు కేవీకేలోనే పనిచేసే జిస్సీ జార్జ్‌ని పరిచయం చేశారాయన. ఏ రకమైన అరటినైనా పొడిగా చేయొచ్చంటూ, తయారీ విధానాన్ని నయనకు వివరించారు జిస్సీ.

****ఇలా పొడి చేస్తారు…
‘పచ్చి అరటి నుంచే కాదు, పండ్ల నుంచీ పొడి తయారుచేయొచ్చని జిస్సీ మేడమ్‌ చెప్పాకే తెలిసింది. ఒక పాత్రలో 800 మి.లీ. నీరు, 200 మి.లీ. గంజి కలిపి తీసుకోవాలి. దాన్లో పది గ్రాముల ఉప్పు కలపాలి. తొక్క తీసిన పచ్చి లేదా పండిన అరటిని దాంట్లో అరగంటసేపు నానబెట్టాలి. తర్వాత వాటిని గుండ్రని ముక్కలుగా కోయాలి. ఆ ముక్కల్ని రెండ్రోజులూ లేదంటే పూర్తిగా తేమ పోయేంత వరకూ ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిగా చేసి ఏదైనా పాత్రలో పోసి, గాలి సోకకుండా మూతపెట్టాలి. వారం తర్వాత ఆ పొడిని వాడొచ్చు. పొడి అయితే ఆరు నెలలూ, ఎండ బెట్టిన అరటి ముక్కలు ఏడాదీ నిల్వ ఉంటాయి. అలాంటపుడు ముక్కల్ని ప్రతి రెండు నెలలకీ ఎండలో పోయాలి’ అని వివరిస్తుంది నయన.

****గోధుమ పిండికి ప్రత్నామ్యాయం…
మైదా, గోధుమ పిండితో ఏయే వంటకాలు చేయొచ్చో జాబితా రాసుకున్న నయన… వాటిని అరటి పిండితో చేయడం మొదలుపెట్టింది. చపాతీలూ, కట్‌లెట్లూ, బిస్కెట్లూ తయారుచేసింది. చపాతీలు మొదట తియ్యగా అనిపించేవట. దాంతో కొద్దిమొత్తంలో గోధుమ పిండి కలిపి తయారుచేసింది. తర్వాత మాత్రం కేవలం అరటి చపాతీలే తినడం అలవాటై పోయిందంటుంది. రాగి జావలోనూ ఈ పొడిని కలపొచ్చట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అరటి పిండితో గులాబ్‌జామ్‌ల తయారీ మరో ఎత్తు. ‘గులాబ్‌జామ్‌ కోసం మొదట అరటి పిండిలో కొద్దిగా పాల పొడి వేశాను. అందులో కొద్దిగా నీళ్లూ, పాలూ వేసి కలిపి చిన్న ఉండలు చేసి వాటిని నేతిలో వేయించి, పంచదార పాకంలో నాన బెట్టాను. తర్వాత కొబ్బరి పొడిలో ముంచి తీశా. అదిరి పోయే రుచి వచ్చింది. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు’ అని చెబుతుంది నయన. పాద్రే సూచన మేరకు ఈ విధానాన్ని ‘ఎనీటైమ్‌ వెజిటబుల్స్‌’ గ్రూపులో పంచుకుంది నయన. దాంతో అక్కడి రైతులందరూ ఈ పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టారు. అరటి ముక్కల్లో తేమ పోగొట్టడానికి డ్రైయ్యర్లనీ కొంటున్నారు రైతులు. ఒక్క తుముకూరు జిల్లాలోనే రైతుల దగ్గర 1500 దాకా డ్రైయ్యర్లు ఉంటాయని చెబుతారు పాద్రే. ఈ మార్పుతో వందల మంది రైతులు అరటి కాయలూ, పండ్లతో పొడి చేస్తూ తమ పంట వృథా పోకుండా చూసుకుంటున్నామని చెబుతున్నారు. ఆ పొడిని కొందరు అమ్ముతున్నారు కూడా. నయన మాత్రం పిండితో ఏవైనా ఉత్పత్తులు చేసి అమ్మకానికి పెడతానంటోంది.ఈసారీ తుముకూరులో అరటి ఉత్పత్తి బాగా ఉంది, వృథా మాత్రం లేదు!