ScienceAndTech

రోల్స్ రాయిస్ గీతకు ఉడుత వెంట్రుకలు

రోల్స్ రాయిస్ గీతకు ఉడుత వెంట్రుకలు

నిజమే… ‘మాకు డబ్బు కన్నా కారే ముఖ్యం’ అనే ప్రమాణాన్ని మొదటినుంచీ పాటిస్తున్న రోల్స్‌రాయిస్‌ సంస్థ అడిగిన వాళ్లందరికీ తమ కారును అమ్మదు. కారును బుక్‌చేసుకున్న కస్టమరు వ్యక్తిగత ప్రొఫైల్‌, సమాజంలో అతని స్థాయి, దాన్ని నడపబోయే డ్రైవరు వివరాలు… ఇలా అన్నింటినీ చూస్తుంది. అందుకే ఈ కారు కొనాలంటే డబ్బుతోపాటూ అదృష్టం కూడా ఉండాలని అంటారు. సాధారణంగా కార్లన్నీ కొన్ని ప్రాథమిక రంగులూ, వాటి షేడ్లలోనే ఉంటాయి. కానీ రోల్స్‌ రాయిస్‌ మాత్రం 44,000 షేడ్స్‌లో వస్తుంది. అంతేనా, ఎవరైనా వినియోగదారుడు ఒక రంగును వేయించుకుంటే దాన్ని అతని పేరుమీద రిజిస్టర్‌ చేస్తుంది. ఒకవేళ ఇంకెవరైనా ఆ రంగును వేయించుకోవాలని ఆశపడితే రిజిస్టర్‌ అయిన కారు ఓనరు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతి లభించాక ఏదో ఒక షోరూంలో రంగును మార్పించుకోవచ్చనుకుంటే పొరపాటే. సదరు వినియోగదారుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. సంస్థే తమ ఉద్యోగిని వాళ్లుండే చోటుకు పంపి రంగు వేయిస్తుంది. ఇక, ఈ కారును బాగా గమనిస్తే… దీనిపైన చాలా సన్నని గీత ఉంటుంది. సంస్థ ఆ గీత గీయాలని నిర్ణయించుకున్నప్పటినుంచీ మార్క్‌ కోర్ట్‌ అనే వ్యక్తే ఆ పని చేస్తున్నాడట. ఒకప్పుడు వీధి గోడలపైన బొమ్మలు వేసిన మార్క్‌కోట్‌ రోల్స్‌రాయిస్‌ కంపెనీలో చేరాక ఆ గీత గీయడం తప్ప మరో పని చేయడట. పైగా కారు మొత్తం తయారయ్యాక మాత్రమే ఆ గీతను గీస్తారు కాబట్టి మార్క్‌ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడట. ఇందుకోసం అతను ఉడుత వెంట్రుకలతో స్వయంగా బ్రష్‌ను తయారుచేసుకుని మరీ వాడతాడు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే రోల్స్‌రాయిస్‌ అంటే… అంత క్రేజ్‌ మరి!