* టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తెదేపా మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అప్పుడే తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి ఆక్షేపించారు.
* వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా ‘బీహెచ్’ (భారత్ రిజిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసే అవసరం తప్పుతుంది. ఈ మేరకు తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది.
* సినీతారల మాదక ద్రవ్యాల కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ఆబ్కారీ కేసుల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఫెమా కేసులూ నమోదు చేసే యోచనలో ఈడీ ఉంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించనుంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉంది.
* బొగ్గు అక్రమరవాణా కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సమన్లు జారీచేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు మీడియాకు వెల్లడించారు. తన మేనల్లుడికి ఈడీ సమన్లు జారీ చేయడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. భాజపా తమకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టడం తమకు తెలుసునని వ్యాఖ్యలు చేశారు.
* ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక పేరిట తెదేపానేతలు పోరాటాలు చేస్తామంటున్నారు.. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని, ఆలోచన చేయాలని సూచించారు.
* వరుసగా రెండు పర్యాయాలు అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా.. ఆదాయం విషయంలోనూ మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటుతోంది. ఏటేటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి రూ.2,410.09 కోట్ల ఆదాయం సమకూరగా, 2019-20లో ఏకంగా 50.34 శాతం అధికంగా రూ.3,623.28 కోట్లు వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం 25.69 శాతం తగ్గిపోయింది. 2018-19లో ఆ పార్టీకి రూ.918.03 కోట్లు ఆదాయం రాగా, మరుసటి ఆర్థిక సంవత్సరంలో రూ.682.21 కోట్లు మాత్రమే వచ్చాయి. శాతాల వారీగా చూస్తే ఆదాయ పెరుగుదలలో మరో జాతీయ పార్టీ ఎన్సీపీ మొదటి స్థానంలో ఉంది. 2018-19లో ఆ పార్టీకి రూ.50.71 కోట్లు సమకూరగా 2019-20లో 68.77 శాతం అధికంగా రూ.85.583 కోట్లు వచ్చింది. జాతీయ పార్టీల ఆదాయ, వ్యయ వివరాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2019-20లో వచ్చిన ఆదాయంలో భాజపా 54.57 శాతమే(రూ.1,651.022 కోట్లు) ఖర్చు చేసింది. అదే ఏడాది కాంగ్రెస్ తన ఆదాయం కన్నా 46.31 శాతం అధికంగా వ్యయం చేసింది. 2019-20లో తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.143.676 కోట్లు సమకూరగా, అందులో 74.67 శాతం(రూ.107.277 కోట్లు) ఖర్చు పెట్టింది. 7 జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ, తృణమూల్, సీపీఐల మొత్తం ఆదాయం (2019-20లో)
రూ.4,758.206గా ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. అదే ఏడాదికిగానూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకూ ప్రకటించిన ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం ఆదాయం 3,441.324 కోట్లు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏడీఆర్ సేకరించిన వివరాల ప్రకారం అన్ని పార్టీలు కలిపి రూ.3,429.5586 కోట్ల ఎన్నికల బాండ్ల ఆదాయాన్ని పొందినట్లు తేలింది. ఇందులో 87.29 శాతం భాజపా, కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీలకే వచ్చింది. ఎన్నికల బాండ్ల ద్వారా భాజపాకు రూ.2,555 కోట్లు, కాంగ్రెస్ రూ.317.861 కోట్లు, తృణమూల్ రూ.100.4646 కోట్లు, ఎన్సీపీ రూ.20.50 కోట్లు సమకూరాయి. భాజపా అత్యధికంగా విరాళాల రూపంలో రూ.3,427.775 కోట్లు పొందినట్లు ఏడీఆర్ వెల్లడించింది. కాంగ్రెస్‌కు రూ.469.386 కోట్లు, తృణమూల్‌కు రూ.108.548 కోట్లు, సీపీఎంకు రూ.93.017 కోట్లు, సీపీఐ రూ.3.024 కోట్లు విరాళంగా వచ్చినట్లు పేర్కొంది.
* ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్కోరుబోర్డుపై ఉన్న భారీ పరుగులే టీమ్‌ఇండియాను ఒత్తిడికి గురిచేశాయని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శనివారం ఆతిథ్య జట్టు చేతిలో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. నాలుగో రోజు తమ బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తమని తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూల్చిన తర్వాత భారీ స్కోర్ సాధించినప్పుడు వెనుకబడిపోయామని అర్థమైందని కోహ్లీ చెప్పాడు. నాలుగో రోజు ఉదయం ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా చెలరేగారని, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి తెచ్చారని అన్నాడు. ఈ క్రమంలోనే తాము కూడా సరైన రీతిలో ఆడలేకపోయామని స్పష్టం చేశాడు. అయితే, ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయమని భారత సారథి పేర్కొన్నాడు.
* హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకోకుండా చూడాలని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమేనని పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి కృష్ణా బేసిన్ అవతలికి నీటి మళ్లింపునకు ట్రైబ్యునల్ అనుమతి లేదన్నారు.
* టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తెదేపా మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు.
* తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించిన అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రను శనివారం ఆయన ప్రారంభించారు.
* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 83వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు ఇవాళ కడప రిమ్స్ డాక్టర్ ఆనంద నాయక్‌ను విచారించారు. వివేకా మృతదేహానికి ఆనంద నాయకే పోస్టుమార్టం నిర్వహించారు. కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వివేకా పోస్టుమార్టం నివేదికను మరోసారి క్షుణ్నంగా పరిశీలించారు.
* కరోనా అదుపులో ఉన్నందున విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మహబూబియా ప్రభుత్వ పాఠశాలలను ఆమె తనిఖీ చేసి అక్కడ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆన్‌లైన్ బోధనతో పూర్తిస్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదని.. అందుకే ప్రత్యక్ష బోధన కొనసాగుతుందన్నారు.
* దేశంలో కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి పలు రాష్ట్రాల్లో మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్ నిబంధనలు, మార్దదర్శకాలను మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
* ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల డబ్బుల కోసం మల్లన్న బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వచ్చే నెల 9 వరకు మల్లన్నకు రిమాండ్ విధించారు.
* అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన విషయం తెలిసిందే. అయితే, తొలుత ఆయన తజకిస్థాన్ లేదా ఒమన్‌కి వెళ్లి ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ, చివరకు ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి వెళ్లి సెటిలయ్యారు. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది.
* ఆధార్-పాన్ అనుసంధానం, గ్యాస్ ధర, జీఎస్టీఆర్-1 ఫైలింగ్ సహా సెప్టెంబరులో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ కొత్త మార్పులు మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపొచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రానున్న కొన్ని ముఖ్యమైన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..
* పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ప్రధాని మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. రేపు జరగబోయే తుదిపోరులో ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. ‘అభినందనలు భవీనా పటేల్! అద్భుతంగా ఆడావు. రేపటి మీ విజయం కోసం దేశం మొత్తం ప్రార్థిస్తోంది. మీ వంతు ప్రయత్నించండి. ఏ మాత్రం ఒత్తిడికి తలొగ్గకుండా ఆడండి. మీ విజయాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తాయి’ అని ట్విటర్ వేదికగా మోదీ ఆమెను ఉత్సాహపరిచారు.