ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 169 వ సాహిత్య సదస్సు ఈ నెల 20న ఆసక్తికరంగా జరిగింది. 74వ భారత స్వాతంత్ర్య దిన వార్షికోత్సవం సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి సదస్యులకు అభినందనలు తెలిపారు .
మాడ సమన్విత ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ విచ్చేశారు. సంస్థ పూర్వ అధ్యక్షులు కోడూరు కృష్ణారెడ్డి ముఖ్య అతిథిని సభకు పరిచయం చేస్తూ వారి సాహిత్య జీవన ప్రస్థానాన్ని చక్కగా వివరించారు. కృష్ణ కుమార్ తన ప్రసంగంలో “పిల్లలమఱ్ఱి చినవీరభద్రుని కవితావైభవం -యోగ శక్తి” అన్న అంశంపై లోతైన విశ్లేషణ చేసి సభికుల ప్రశంసలు అందుకున్నారు. తరువాతి అంశంగా లెనిన్ వేముల “జయ భారతీ” అన్న దాశరథి స్వాతంత్ర్యోద్యమ కవితను వివరించడం జరిగింది. తరువాతి అంశంగా “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా నరసింహారెడ్డి కొన్ని పొడుపు కథలు, జాతీయాలు ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సభ్యులను భాగం చేశారు. మాడా దయాకర్ పుస్తక పరిచయం చేస్తూ గుఱ్ఱం జాషువా సుప్రసిద్ధ గబ్బిలం లఘు కావ్య విశేషాన్ని వివరించారు. తరువాతి అంశంగా మాసానికో మహనీయుడు శీర్షికన ఈ మాసంలో జన్మించిన విశిష్ట రచయితలను అరుణ జ్యోతి గుర్తు చేశారు . చిన్నారి సమన్విత “దేశం మనదేరా” అన్న గేయాన్ని పాడి అలరించింది. కార్యక్రమంలో చివరి అంశంగా “పద్య సౌగంధం” శీర్షికన ఉపద్రష్ట సత్యం ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోని పద్యం యొక్క తాత్పర్య విశేషాలు విశ్లేషించారు. అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ముఖ్య అతిథి పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ కి, ప్రార్థనా గీతం పాడిన సమన్విత తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి సాహితీ వేముల జాతీయ గీతం “జన గణ మన” వేణుగానంతో సభకు ముగింపు పలికింది.