Sports

టొక్యోలో పతకాల పంట. ట్యాంక్‌బండ్‌పై సందడి-తాజావార్తలు

టొక్యోలో పతకాల పంట. ట్యాంక్‌బండ్‌పై సందడి-తాజావార్తలు

* పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్‌ ట్47 పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించిన గంటలోనే మరో అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌ డిస్కస్‌త్రో విభాగంలో కాంస్యం సాధించాడు. దాంతో భారత్‌కు ఒకే రోజు మూడో పతకం ఖాయం చేశాడు. కొద్దిసేపటి క్రితం జరిగిన F52 డిస్కస్‌త్రో పోటీల్లో 41 ఏళ్ల వినోద్‌.. 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో పారాలింపిక్స్‌లో పతకం సాధించడమే కాకుండా ఆసియాలోనే అత్యుత్తమ రికార్డు నెలకొల్పిన అథ్లెట్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మరోవైపు పోలాండ్‌కు చెందిన పీయోటర్‌ కోసెవిక్జ్‌ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా క్రోయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండర్‌ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు.

* వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా… దానిపై ఆయన వెంటనే స్పందించారు. ప్రతి ఆదివారం సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఈ ఆదివారం సాయంత్రం అయిదు గంటల నుంచి ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. దీంతో సందర్శకులు ఇవాళ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలివచ్చారు. ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలను సీపీ అంజనీకుమార్‌ పరిశీలించారు. ఇకపై ప్రతి ఆదివారం వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు… మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది.ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, మహబుబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఏపీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి.గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

* పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ పాలకమండలి..తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతోంది.రూ.18లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్ కారును అధికారులు కొనుగోలు చేశారు.తిరుమలలో విధులు నిర్వర్తించే అధికారులకు మొత్తం.. 35 కార్లను కేటాయించనున్నట్లు తెలిపారు.దశల వారీగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.వీటితో పాటూ ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని పాలకమండలి భావిస్తోంది.

* నందమూరి హరికృష్ణ సేవలు మరువలేనివని టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

* చట్టవిరుద్ధమైన, అనైతిక పద్ధతులకు పాల్పడే నకిలీ జర్నలిస్టులను తొలగించడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృ త్వంలో ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు’ (పీసీటీఎన్) ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. నిజమైన జర్నలిస్టుల ప్రయోజనాలను కాపాడటానికి, పారిశ్రామికవేత్తలు, వ్యాపా రులను బ్లాక్మెయిల్ చేయడం వంటి చట్టవిరుద్ధ పను లకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించడానికి పీసీటీ ఎన్ ఏర్పాటు అవసరమని పేర్కొంది. విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక విభాగంలో అధికారిగా ఉన్న పొన్ మాణిక్యవేల్ తప్పుడు నివేదికలను దాఖలు చేయడంపై సిట్తో విచా రణ చేయించాలని చెన్నైకి చెందిన శేఖర్రామ్ అనే వ్యక్తి తనను తాను జర్నలిస్టుగా పేర్కొంటూ మద్రాస్ హైకో ర్టులో వ్యాజ్యం వేశారు. అతడు నకిలీ జర్నలిస్టు అని మాణిక్యవేల్ తరపు న్యాయవాదులు ఆరోపించారు. శని వారం ఈ కేసు విచారణకు రాగా… గుర్తింపు పొందిన మీడియాలోని సీనియర్ జర్నలిస్టులు, పదవీవిరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ కౌన్సిల్లో సభ్యు లుగా ఉండాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ప్రెస్ కౌన్సిల్ ద్వారానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఉచిత బస్ పాస్ వంటి ప్రయోజనాలను అందించాలని తెలిపింది. నకిలీ జర్నలిస్టులు పౌర సమాజానికి ముప్పని, వారిపై క్రిమినల్ చర్యలను చేపట్టాలంది. పత్రికా సంస్థ ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లించిన జీతాలు, పన్ను మినహాయింపు, పన్ను చెల్లింపు వివరాలను వెల్లడించకపోతే ప్రెస్ స్టిక్కర్లు, గుర్తింపు కార్డులు, ఇతర ప్రయోజనాలను జారీ చేయవ ద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు ఆదేశిం చారు. అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించిన నిబం ధనలను మూడు నెలల్లో సవరించాలని సూచించారు.

* సంక్షోభంలోనే నాయకత్వ పటిమ బయటపడుతుంది.. ఈ లెక్కన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విఫలమై.. ఒంటరి అయ్యారన్న సూత్రీకరణలు తాజాగా వినవస్తున్నాయి. అఫ్గాన్‌ పరిణామాలతో పాటు వివిధ అంశాలపై ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి సుస్థిరతలను, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి 20ఏళ్ల పాటు సైనిక కార్యకలాపాలు నిర్వహించి, లక్ష కోట్ల డాలర్లు వెచ్చించినా.. చివరకు తాలిబన్లను అణచలేక అమెరికాయే అక్కడి నుంచి వైదొలగవలసి వచ్చింది. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనే ఒప్పందం కుదిరినా, అమెరికా గౌరవానికి భంగం కలగకుండా దాన్ని అమలు చేయడంలో బైడెన్‌ విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసిస్‌-కె ఉగ్రవాద సంస్థ కాబుల్‌ విమానాశ్రయం వద్ద జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు, 169 మంది అఫ్గాన్లు మరణించడం ఆయన వైఫల్యానికి నిదర్శనమని కొందరు చెబుతున్నారు. సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా కాబుల్‌ నుంచి సైనికులను, అఫ్గాన్‌ ప్రజలను హడావుడిగా తరలించేంద]ుకు పూనుకోవడమే కారణమంటూ బైడెన్‌ ప్రభుత్వం సర్దిచెప్పుకోజాలదని.. ఇది అమెరికా అసమర్థతేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామాలన్నీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని పులిట్జర్‌ గ్రహీత, చరిత్రకారుడు జోసెఫ్‌ ఎలిస్‌ వ్యాఖ్యానించారు.

* హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఓఆర్‌ఆర్‌ వద్ద రూ.21 కోట్ల విలువైన సుమారు 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు ఓఆర్‌ఆర్‌పై ఓ ట్రక్కును తనిఖీ చేయగా… పూల మొక్కల చాటున 24 సంచుల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయితో పాటు మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈఏడాది ఇప్పటి వరకు ఎన్‌సీబీ అధికారులు 7,500 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 25 మందిని అరెస్టు చేశారు.

* గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొలం వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మట్టా సాంబశివరావు తుపాకీతో ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ మృతి చెందారు. ఆంజనేయులుకు తీవ్రగాయాలవ్వడంతో మాచర్ల ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* ప్రతిపక్షాల దగ్గర నీతి లేదని.. ఒక్కసారిగా దళితులపై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు దళితబంధును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ బేగంపేటలోని ఆయన నివాసంలో తలపెట్టిన ఒక్కరోజు దీక్షను మోత్కుపల్లి విరమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దళితుల కోసం పాదయాత్రలు చేయడం, సభలు నిర్వహించడం చేస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. తెదేపాలో ఉన్నప్పుడు మల్లారెడ్డి నుంచి డబ్బు తీసుకున్నవా? లేదా? అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణలో తెదేపాకు పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుందన్నారు. దళితబంధు అమలుతో విపక్ష నేతల గుండెల్లో వణుకు పుట్టిందన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. దళిత బంధును వ్యతిరేకించినా.. అమలును అడ్డుకునే ప్రయత్నం చేసినా సహించేది లేదని మోత్కుపల్లి తేల్చి చెప్పారు.

* దేవాదుల రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో దేవాదుల ప్రాజెక్టుపై మంత్రి సత్యవతి రాథోడ్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి ఎర్రబెల్లి సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్‌ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. 60 టీఎంసీల దేవాదుల నీటిని వరంగల్‌ జిల్లాకే పూర్తిగా వాడుకోవాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కాళేశ్వరం, దేవాదులతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.