Business

ఐటీ ఉద్యోగాల్లో దూసుకెళ్తున్న మహిళలు-వాణిజ్యం

ఐటీ ఉద్యోగాల్లో దూసుకెళ్తున్న మహిళలు-వాణిజ్యం

* ఆధార్‌తో పాన్‌/ఈపీఎఫ్‌ఓ అనుసంధాన సదుపాయాల్లో ఎటువంటి అంతరాయం లేదని శనివారం యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) పేర్కొంది. అన్ని సేవలూ ‘స్థిరం’గా ఉన్నట్లు, సక్రమంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆధార్‌తో పాన్‌, ఈపీఎఫ్‌ఓల అనుసంధానంలో అంతరాయం కలుగుతోందన్న వార్తల మధ్య యూఐడీఏఐ పై విధంగా స్పందించింది. గత వారం రోజులుగా తమ వ్యవస్థల్లో అవసరమైన భద్రతాపరమైన మెరుగులు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో కొంత మేర సేవల్లో అంతరాయం కలిగింది. అది కూడా కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఎన్‌రోల్‌మెంట్‌, మొబైల్‌ నవీకరణ సేవల సదుపాయాల్లో ఇబ్బంది తలెత్తింది. ఇపుడు అవి సక్రమంగానే పనిచేస్తున్నాయ’ని యూఐడీఏఐ వివరించింది. ‘నవీకరణ మొదలైన గత తొమ్మిది రోజుల్లో 51 లక్షల మంది నమోదు చేసుకున్నారు. సగటున రోజుకు 5.68 లక్షలు సేవలందుకున్నార’ని తెలిపింది. కాబట్టి పాన్‌, ఈపీఎఫ్‌ఓతో ఆధార్‌ అనుసంధానంలో యూఐడీఏఐ వ్యవస్థలో అంతరాయం కలిగిందన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.

* ఐటీ రంగంలో మహిళలు అధిక సంఖ్యలో ఉండటం కొత్త విషయం కాదు. కానీ మహిళల శాతం బాగా పెరగడమే తాజా ప్రత్యేకత. హైదరాబాద్‌లో చూస్తే… ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఏటా కొత్త నియామకాలు 50,000 పైగానే ఉంటాయి. ఈ ఉద్యోగాలకు మహిళలు అధికంగా ఎంపికవుతున్నారు. 5-7 ఏళ్ల ఉద్యోగ అనుభవం గల వారిలో మహిళల సంఖ్య 52 శాతం ఉన్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా. హెచ్‌ఆర్‌ సేవలు, బీపీఓ, కాల్‌ సెంటర్‌ ఉద్యోగాల్లో మహిళా ఉద్యోగులు ఇంకా అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఉద్యోగంలో చేరిన అయిదారేళ్ల తర్వాత మహిళలు వివిధ కారణాలతో రాజీనామా చేయడం ఇటీవల వరకూ కనిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితీ మారుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ‘ఇంటి నుంచి పని’ విధానంలో, మహిళా ఉద్యోగులు ఎంత కాలమైనా ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడానికి కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ‘ఫ్లెక్సిబుల్‌’ టైమింగ్స్‌’ను కూడా అనుమతిస్తున్నాయి. దీంతో కార్యాలయానికి రాలేక, లేదా కుటుంబంతో వేరే నగరానికి తరలివెళ్లడం.. వంటి కారణాలతో ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం మహిళలకు ఉండటం లేదు. అందువల్ల మొత్తం ఐటీ ఉద్యోగుల్లో మహిళల సంఖ్యతో పాటు, వీరి సీనియార్టీ కూడా పెరుగుతోందని జాబ్‌ కన్సల్టెంగ్‌ సేవల సంస్థ హ్యూసిస్‌ ఎండీ జీఆర్‌ రెడ్డి వివరించారు. ఇప్పటివరకు సీనియార్టీ ఉన్న మహిళా ఉద్యోగులు తక్కువగా ఉండటంతో, ఐటీ రంగంలో ఉన్నత స్థానాల్లో వారి సంఖ్య పరిమితంగా ఉంది. వైస్‌ప్రెసిడెంట్లు, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్లు, సీటీఓ.. తదితర ఉన్నతోద్యోగాల స్థాయికి మహిళలు చేరుకోవడం తక్కువ. ప్రస్తుత మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు మహిళలు చేరుకునే అవకాశాలు ఏర్పడినట్లు ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన కింద దేశంలో బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన వారి సంఖ్య 43 కోట్లకు చేరుకుందని శనివారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.1.46 లక్షల కోట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ పథకాన్ని ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించింది. 2014 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకం గురించి ప్రకటించారు. అదే ఏడాది ఆగస్టు 28న లాంఛనంగా ప్రారంభించారు. తొలి ఏడాది 17.90 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా, ఈ ఏడాది ఆగస్టు 18న నాటికి మొత్తం ఖాతాలు 43.04 కోట్లకు చేరుకున్నాయి. అందులో 23.87 కోట్ల మంది (55.47%) మహిళలు కావడం విశేషం. 28.70 కోట్ల ఖాతాలు (66.69) గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ ‘‘ఈ పథకం దేశ అభివృద్ధి నమూనాను సంపూర్ణంగా మార్చివేసింది. కోట్లాది మందికి సాధికారిత, గౌరవం కలిగించి సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి దోహదపడింది. పారదర్శకతను తీసుకువచ్చింది’’ అని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న నిరుపేదలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు ఈ పథకం సహకరించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

* దిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో యథాపూర్వ స్థితిని కొనసాగించాలని; సింగపూర్‌ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌(ఈఏ) ఆదేశాలను అమలు చేయాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ‘ఫిబ్రవరి 2, 2021, మార్చి 18, 2021 తేదీల్లో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు ముందు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను కంపెనీ దాఖలు చేసింది. త్వరలోనే ఎస్‌ఎల్‌సీ విచారణకు రావొచ్చ’ని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఫ్యూచర్‌ రిటైల్‌ పేర్కొంది. ‘ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉంది. ఏకసభ్య ధర్మాసనం జారీ చేసిన ‘స్టే’ ఆర్డర్ల కారణంగా కంపెనీ నగదీకరణకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడే అవకాశం ఉంద’ని తన పిటిషన్‌లో పేర్కొంది. బ్యాంకు రుణాలు, డిబెంచర్ల రూపంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ జారీ చేసిన రూ.28,000 కోట్ల ప్రజా ధనం కూడా ఇబ్బందుల్లో పడుతుందని వివరించింది. ‘ఫ్యూచర్‌ రిటైల్‌లోని 35,575 ఉద్యోగుల కుటుంబాలతో పాటు, కంపెనీతో సంబంధమున్న 8,050 చిన్న, మధ్య స్థాయి కంపెనీలపైనా ప్రభావం చూపొచ్చ’ని అందులో పేర్కొంది.