Politics

₹5వేలు కట్టి హుజూరాబాద్ టికెట్‌కు దరఖాస్తు చేసుకోండి-తాజావార్తలు

₹5వేలు కట్టి హుజూరాబాద్ టికెట్‌కు దరఖాస్తు చేసుకోండి-తాజావార్తలు

* సుప్రీంకోర్టుకు ఇటీవల నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్,జస్టిస్‌ జేకే మహేశ్వరి,జస్టిస్‌ హిమా కోహ్లి,జస్టిస్‌ బీవీ నాగరత్న,జస్టిస్‌ సి.టి. రవికుమార్,జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్,జస్టిస్‌ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్‌ పమిడిగంథం శ్రీనరసింహలు ప్రమాణం చేశారు.ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ తొమ్మిది మందితో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు చేరింది.

* కేంద్ర ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేసి, రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot ) డిమాండ్ చేశారు. హ‌ర్యానాలోని క‌ర్నాల్ టౌన్‌లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌పై పోలీసులు లాఠీచార్జి చేయ‌డాన్ని గెహ్లాట్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘ‌ట‌న‌లో మొత్తం 10 మంది రైతుల‌కు గాయాల‌య్యాయి. లాఠీచార్జి జ‌రుగుతుండ‌గా ఓ అధికారి రైతుల త‌ల‌లు ప‌గులగొట్టండి అని ఆదేశించ‌డం వీడియోలో రికార్డ‌య్యింది.

* సెప్టెంబర్‌ 2న రాష్ట్రంలోని ప్రతి, పల్లె, పట్టణంలో గులాబీ జెండా గుండెలనిండుగా ఎగరాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 20 సంవత్సరాల కిత్రం జలదృశ్యం నుంచి కేసీఆర్‌ నేతృత్వంలో గుప్పెడు మందితో కలిసి ఒక్క అడుగుతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమతి ప్రస్థానం.. 20 ఏళ్ల విజయవంతమైన ప్రయాణంలో 2న ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా సగర్వంగా టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేయబోతున్నదన్నారు. ఒకప్పుడు ఏ అస్థిత్వం కోసం ఢిల్లీ వీధుల్లో తెలంగాణ సమాజం గుండె చప్పుళ్లు ప్రతిధ్వనించాయో.. ఇప్పుడు అవే వీధుల్లో మన ఆత్మగౌరవ పతాకం ఆకాశమంత ఎత్తుకు ఎగురబోతున్నదన్నారు.

* హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబరు5 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేవారు రూ.5 వేల డీడీ తీయాల్సి ఉంటుందని చెప్పారు. సెప్టెంబరు 6న పీసీసీ బృందం ఆశావహులను ఇంటర్వ్యూ చేసి 10న ఏఐసీసీకి నివేదిక అందజేస్తుందని, ఆ తర్వాత అధిష్ఠానం అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. పీసీసీ బృందంలో భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు వరంగల్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ నాయిని రాజేందర్‌రెడ్డి, కరీంనగర్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ ఉంటారని చెప్పారు.

* రాజధాని అంశంపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నారు. ‘‘పులివెందుల, విజయవాడ కావొచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చు. సీఎం నివాసం ఎక్కుడుంటే అదే రాజధాని. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం జరిగింది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు’’ అని గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

* రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు), సచివాలయాలు నిర్మించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం 1160 చోట్ల ఆర్‌బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో మిగతా నిర్మాణాలను 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది.

* గత కొంతకాలంగా కరోనా థర్డ్‌వేవ్‌పై ఆందోళనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ రానుందనే నివేదికలు వెలువడుతున్నాయి. అక్టోబర్‌లో మూడోముప్పు గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని కేంద్రం నేతృత్వంలోని కమిటీ గతంలోనే వెల్లడించింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సమిరన్ పాండా పలు కీలక విషయాలు వెల్లడించారు.

* తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

* యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట భవంతులను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించడంపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది.

* పోలవరం నిర్మాణం వెనుక 1.9 లక్షల మంది ప్రజల త్యాగం ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పోలవరం నిర్వాసితులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా కూనవరం మండలంలోని పోలవరం నిర్వాసితులను నారా లోకేశ్‌ పరామర్శించారు. రోజులు గడుస్తున్నా పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

* ఆన్‌లైన్‌ మోసాలను అడ్డుకునేందుకు టెక్‌ సంస్థలు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలను ఎంచుకుని యూజర్స్‌ని ఏమార్చి యూజర్‌ డేటా, బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీమెయిల్ ఖాతా యూజర్లు లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

* అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించిన తీరు చాలా అసమర్థంగా జరిగిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఇలాంటి దారుణమైన ఉపసంహరణ ప్రక్రియను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ జో బైడెన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అఫ్గాన్‌ గడ్డపై 20ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి సంపూర్ణ ముగింపు పలుకుతూ అమెరికా రక్షణ దళాల చిట్టచివరి విమానం సోమవారం అర్ధరాత్రి కాబుల్‌ నుంచి బయల్దేరింది.

* విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు పలు దేశీయ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల పరంపరను మంగళవారమూ కొనసాగించాయి. అన్ని రంగాల షేర్లు రాణించడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 57,500 మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 17,000 కీలక మైలురాయిని సునాయాసంగా దాటేసింది. సెన్సెక్స్‌ 662 పాయింట్లు లాభపడింది.

* లాక్‌డౌన్‌ సమయంలో సరైన ప్రాక్టీస్‌ లేక నిద్రపట్టేది కాదని, దాంతో పారాలింపిక్స్‌లో పతకం సాధించలేననే తీవ్ర నిరాశకు గురయ్యానని కాంస్య పతక విజేత సింగ్‌రాజ్‌ అధాన గుర్తుచేసుకున్నారు. ఇటీవల కొవిడ్‌-19 రెండో దశ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పారాలింపిక్స్‌ సన్నాహకాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపాడు. దాంతో మానసిక వేదనకు కూడా లోనయ్యానన్నాడు.