ఆన్‌లైన్ మోసాలను అడ్డుకునేందుకు టెక్ సంస్థలు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను ఎంచుకుని యూజర్స్‌ని ఏమార్చి యూజర్ డేటా, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీమెయిల్ ఖాతా యూజర్లు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో జీమెయిల్ యూజర్స్ జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా మోసంలో సైబర్ నేరగాళ్లు ముందుగా మీ జీమెయిల్‌కు అమెజాన్ లేదా పేపాల్ పేరుతో మెయిల్స్ పంపుతారు. అందులో ‘‘మీ అమెజాన్ ఖాతాలో మీరు యాపిల్ వాచ్ లేదా గేమింగ్ ల్యాప్‌టాప్ వంటి ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేశారు. దీనికి పేపాల్ నుంచి చెల్లింపులు జరిగాయి. ఒకవేళ ఈ చెల్లింపులు మీరు చేయకుంటే కింద సూచించిన నంబర్‌కి ఫోన్ చేయండి’’ అని ఉంటుంది. అలానే యూజర్‌ని ఏమార్చేందుకు సదరు కంపెనీలు ఉపయోగించే లొగో, ఫాంట్‌లను ఉపయోగిస్తారు. యూజర్ హ్యాకర్ సూచించిన నంబర్‌కి ఫోన్ చేసిన వెంటనే హ్యాకర్ అమెజాన్ లేదా పేపాల్ ప్రతినిధిలా మాట్లాడుతూ యూజర్ నుంచి వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తున్నట్లు గుర్తించామని కాస్పర్‌స్కై అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. దాంతోపాటు నకిలీ ఖాతాల నుంచి యూజర్ పేమెంట్ యాప్ ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారని వెల్లడించింది. అలానే ఫోన్ చేసినప్పుడు యూజర్‌ని ఏమార్చి వారి కంప్యూటర్లలో వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేలా చేసి అందులోని డేటా దొంగిలిస్తున్నట్లు గుర్తించామని కాస్పర్‌స్కై పేర్కొంది. అందుకే యూజర్స్ అలాంటి ఈ-మెయిల్స్‌ని ఓపెన్ చేయకుండా..ముందుగా అమెజాన్ లేదా పేపాల్ ఖాతాలను ఓపెన్ చేసి వాటి నుంచి లావాదేవీ జరిగిందా లేదా అనేది నిర్థరించుకోవాలని సూచించారు. ఒవవేళ సదరు మెయిల్ మోసపూరితమని అనుమానం కలిగితే వెంటనే డిలీట్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
సరికొత్త జీమెయిల్ స్కామ్
Related tags :