* సంగం డెయిరీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ తిరస్కరణకు గురైంది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన ఇంప్లీడ్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
* దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు. ఎల్‌పిజి సిలిండర్‌ల ధరను రూ. 25 పెంచిన పెట్రోలియం కంపెనీలు. పెరిగిన ధరతో కలిపి ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 884.50 కి చేరిక.
* వివిధ సంస్థల్లో పనిచేసే వారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి తెలిసే ఉంటుంది. దీనికి ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ (వాటా)తో పాటు సంస్థ కూడా అంతే మొత్తంలో జమచేస్తుంది. ఏ ఇతర పొదుపులతో పోలిస్తే అత్యధికంగా 8.5% వడ్డీ రేటు ఉండటం ఉద్యోగులకు లాభదాయకం. నేటి (సెప్టెంబర్ 1) నుంచి ఈపీఎఫ్ నియమాలు మారబోతున్నాయి. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని పక్షంలో కంపెనీ (యజమాని) వాటా జమ కాదు. దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితమే ఈపీఎఫ్‌ఓ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. యూఏఎన్-ఆధార్ అనుసంధానం కాకపోతే.. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) భర్తీ కాదు. అంటే ఉద్యోగులు వారి సొంత పీఎఫ్ ఖాతాను చూడగలిగినప్పటికీ, కంపెనీ వాటాను మాత్రం పొందలేరు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)- ఆధార్ అనుసంధానించాలని యాజమాన్య సంస్థలను ఆదేశించింది. ఇంతకు ముందు ఈపీఎఫ్ – ఆధార్ లింక్ కోసం 30 మే 2021 వరకు గడువు ఉంది. కానీ తర్వాత, ఈపీఎప్ఓ – ఆధార్ లింక్ చివరి తేదీని 2021 ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈపీఎఫ్‌లో ఉద్యోగికి కొవిడ్ – 19 అడ్వాన్స్ తీసుకోవడం, పీఎఫ్ బీమా, ఇతర పొదుపు పథకాల కన్నా అధిక వడ్డీ రేటు పొందడం వంటి అనేక ప్రయోజనాలు, ఉపయోగాలున్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల లాభాల జోరుకు బ్రేక్ పడింది. బుధవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. గతకొన్ని రోజుల బుల్‌పరుగు నేపథ్యంలో ముదపర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు స్థిరీకరణ దిశగా సాగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడం సూచీలను నిరుత్సాహపరిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.09 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 57,763 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. ఇంట్రాడేలో 57,918 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 214 పాయింట్ల నష్టంతో 57,338 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 55 పాయింట్లు దిగజారి 17,076 వద్ద స్థిరపడింది.
* ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోం) సదుపాయాన్ని వచ్చే ఏడాది వరకు పొడిగిస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. గూగుల్ క్యాంపస్‌లకు తిరిగి వచ్చే విషయంలో ఉద్యోగులకు జనవరి 10 వరకు స్వేచ్ఛనిస్తున్నామని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించుకునే విచక్షణాధికారాన్ని స్థానిక ఆఫీసులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా కార్యాలయాల్లో బిజినెస్ ఊపందుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా క్యాంపస్‌లకు తరలివచ్చే గూగుల్ ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నామన్నారు. రానున్న రోజులు ఊహించినదాని కంటే కొంత భిన్నంగా గడిచే అవకాశాలు ఉన్న్పటికీ.. వచ్చే సవాళ్లకు సమష్టిగా ఎదుర్కొనే సామర్థ్యం గూగుల్‌కు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
* దేశంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల(ఐపీఓ) పరంపర కొనసాగుతోంది. తాజాగా దేశీయ తొలి మ్యాపింగ్ కంపెనీ ‘మ్యాప్‌మైఇండియా’ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. మొత్తం 75,47,959 ఈక్విటీ షేర్లు విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) కిందే విక్రయించనున్నారు. వాటాదారులు, ప్రమోటర్లుగా ఉన్న రష్మీవర్మ 30,70,033 ఈక్విటీ షేర్లు, క్వాల్‌కామ్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ 20,26,055 ఈక్విటీ షేర్లు, బెన్రిన్ కంపెనీ లిమిటెడ్ 10,27,471 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. మ్యాప్‌మైఇండియాలో వైర్‌లెస్ టెక్నాలజీ కంపెనీ క్వాల్‌కామ్, జపాన్‌కు చెందిన డిజిటల్ మ్యాపింగ్ జెన్రిన్‌కు వాటాలున్నాయి.