‘‘హరీశ్.. సీఎం వద్ద నువ్వొక రబ్బరు స్టాంపువి. నీకు స్వేచ్ఛ ఉందా? పైగా నీకు నిజాయతీ కూడా లేదు. ఒకవేళ ఉంటే 2004లో అఫిడవిట్‌లో తెలియజేసిన నా ఆస్తులపై.. అదే ఎన్నికల సమయంలో నువ్వు, మీ మామ పేర్కొన్న వివరాలపై విచారణకు సిద్ధమా? ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే నేను పార్టీకి ద్రోహం చేశానని నువ్వు విమర్శిస్తున్నావు. నువ్వే ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టే ప్రయత్నం చేశావు. 2018లో నువ్వు నీ అనుకూల ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చినవనే కదా మీ మామ నిన్ను దూరం పెట్టిండు. నాకు నీలాగా డ్రామాలు చేయడం, అబద్ధాలు చెప్పడం రావు. కుంకుమ భరిణెలు ఇస్తున్నా అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావ్. నేనెక్కడ పంచానో చూపించు. ఎవరిది తప్పైతే వాళ్లు ముక్కు నేలకు రాద్దాం’’ అని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు గుప్పించారు. ఘాటు విమర్శలు చేశారు. ‘‘హరీశ్ సొంతపార్టీ నాయకులను వెలకట్టి కొంటున్నాడు. కోట్ల రూపాయలను పట్టుకొచ్చి ఇక్కడ కొనుగోళ్ల పర్వానికి తెరతీస్తున్నాడు. ఆయన పతనం హుజూరాబాద్ నుంచే మొదలైంది. చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. గతాన్ని మరిచిపోయి మామ మాయలో పడ్డాడు. ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలకు ఆయనపై అంతో ఇంతో ఉన్న అభిమానం కూడా ఇప్పుడు దూరమైంది. తెరాసకు ఓనర్లం అని నేను అంటేనే హరీశ్‌కు మంత్రి పదవి వచ్చింది. నా నియోజకవర్గానికి వచ్చి నన్ను అభాసుపాలు చేస్తూ మతి భ్రమించిన వ్యక్తిగా మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టను. త్వరలోనే నీ బండారాలన్నీ బయటపెడతా’’ అన్నారు. ‘‘హుజూరాబాద్‌లో తెరాస గెలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా. అదే నేను విజయం సాధిస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. సిద్ధమేనా’’ అని సవాలు విసిరారు. కేసీఆర్ నిరంకుశ వైఖరి 2015లో మొట్టమొదట మంత్రి హరీశ్‌రావు నుంచే ప్రారంభమైందన్నారు. సమావేశంలో భాజపా నాయకులు వివేక్, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఏనుగు రవీందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హరీష్…ఆ ఎన్నికల్లో సీఎం కావాలని డబ్బులు పంచాడు
Related tags :