NRI-NRT

కాలిఫోర్నియాలో గిడుగు జయంతి

కాలిఫోర్నియాలో గిడుగు జయంతి

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం రాజధాని అయిన శాక్రమెంటో నగరంలో ‘శాక్రమెంటో తెలుగు సంఘం’ ఆధ్వర్యంలో ఆగష్టు 29న గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి ‘తెలుగు భాషా దినోత్సవం’ ఘనంగా జరిగింది. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని తెలుగు భాషలో ఉన్న అందాన్నీ, మాధుర్యాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు అని వక్తలు ప్రశంసించారు. ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ అనే చర్చా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా అంతర్జాలంలో ఏర్పాటు చేశారు. సిలికానఆంధ్ర ‘సుజన రంజని’ పత్రిక సంపాదకులు తాటిపాముల మృత్యుంజయుడు, డా.దారా సురేంద్ర, డాక్టర్ మధు బుడమగుంట, శాక్రమెంటో తెలుగు సంఘం ‘తెలుగు వెలుగు’ పత్రిక సంపాదకుడు వెంకట్ నాగం తదితరులు ప్రసంగించారు.

అమెరికాలో తదుపరి తరానికి తెలుగు భాషను అందించే ప్రయత్నాలు సరిపడేంతగా జరుగుతున్నాయా? తరువాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సమస్యలు ఉన్నాయా? అసలు ఎక్కడ నుండి మొదలుపెట్టాలి మనం? చిన్న చిన్న పదాలతో తెలుగును నేర్పిస్తే బాలలకు మన భాష వంట పడుతుందని, ప్రవాస చిన్నారులు ఇంగ్లీషులో రాసిన చిన్న చిన్న కవితలను తెలుగులో అనువదింపజేసి పత్రికలలో ప్రచురింపజేయాలని, అమెరికాలో యువ అవధానులు వస్తున్నారని ఇది శుభ పరిణామం అని చర్చించారు. శాక్రమెంటో తెలుగు సంఘం అధ్యక్షుడు రాఘవ్ చివుకుల కార్యక్రమం విజయవంతం కావడానికి శాక్రమెంటో తెలుగు సంఘం బోర్డు సభ్యులు సత్యవీర్ సురభి, శేష కల్యాణి గుండమరాజు, శాక్రమెంటో తెలుగు సంఘ సభ్యులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.