* ‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అని షర్మిల ట్వీట్ చేశారు.అంటే తాను ఒంటరిని అయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే.. సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయం ఎవరికైనా స్పష్టంగానే అర్థమైపోతుంది. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది..
* జూరాల జలాశయంలోకి వరద కొనసాగుతోంది. 41 వేల క్యూసెక్కుల వరద చేరుతుంది. దిగువకు జల విద్యుదుత్పత్తి ద్వారా 35 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
* దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో కొత్తకేసులు 47వేలు దాటగా.. మరణాలు కూడా 500పైనే నమోదుకావడం గమనార్హం. అయితే, కొత్త కేసుల్లో 70శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47,092 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.28కోట్లు దాటింది. ఇదే సమయంలో 509 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,39,529 మందిని మహమ్మారి బలితీసుకుంది. ఇక నిన్న మరో 35,181 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.20కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీరేటు 97.48శాతంగా ఉంది.
* వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి. ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు
* జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని అండర్ 18 వరల్డ్ క్లాస్ చెస్ ప్లేయర్ బొమ్మినేని మౌనిక అక్షయకు ప్రవాస జనసేన తరుపున లక్ష రూపాయల చెక్ అందజేశారు.
* తెదేపా అధినేత చంద్రబాబుతో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ ముగిసింది. 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించిన చంద్రబాబు గోరంట్ల గౌరవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ… రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ‘‘పార్టీలో నెలకొన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న మాట వాస్తవం. కానీ, ఎంతో మంది మిత్రులు, అభిమానులు రాజీనామా చేయొద్దని కోరారు. పార్టీకి సంబంధించి నా అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పా. కార్యకర్తల మనోభావాలను అధినేతకు వివరించాను.
* ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో ఆమె చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారిలో కొందరు ప్రశాంత్ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. వీరిలో పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతేడాది సోనియాకు లేఖ రాసిన 23 మంది నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే మరికొందరు నాయకులు మాత్రం కిశోర్ వల్ల పార్టీకి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నట్లు సమాచారం.
* ఏపీలో వైకాపా ప్రభుత్వం రెండేళ్లుగా తెదేపా నేతల్ని వేధిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెట్రో ధరలపై ఆందోళన చేస్తే చింతమనేనిని అరెస్టు చేశారన్నారు. ఉపాధి బిల్లలు చెల్లించకుండా వేధిస్తు్న్నారని విమర్శించారు. తిరగబడితే ప్రభుత్వం తోకముడుస్తుందని.. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు.
* దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం అందిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధం దృష్ట్యా వెళ్తున్నానని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతమన్నారు. ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్‌తో సన్నిహితంగా మెలిగినవారు, అప్పటి మంత్రిమండలిలో, కాంగ్రెస్‌లో పనిచేసిన వారిని విజయమ్మ ఆహ్వానించారు.
* తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు మతిభ్రమించిందని.. అందుకే ఇస్టానుసారం అబద్ధాలాడుతున్నారని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజూరాబాద్‌లో భాజపా కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఇతర నేతలతో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు మాట్లాడే ప్రతి మాట వ్యంగ్యంగా, అసత్యాలతో కూడినవిగా ఉన్నాయన్నారు. ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగలేదని చేస్తున్న అసత్య ప్రచారాలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా?అని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.
* మహిళల భద్రత కోసం చిత్తశుద్ధితో ‘దిశ’ చట్టాన్ని తీసుకొస్తే తెదేపా నేతలు ఆ చట్టాన్ని అవహేళన చేయటం తగదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల ముందు తెదేపా నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే చట్టాన్ని అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దిశ యాప్ ద్వారా అనేక మంది మహిళలు రక్షణ పొందుతున్నారన్నారు. తెదేపా అధికారంలో ఉండగా మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే దాడి చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు.