Business

భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో. అమ్మకానికి L&T సిద్ధం-వాణిజ్యం

భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో. అమ్మకానికి L&T సిద్ధం-వాణిజ్యం

* ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకి కోవిడ్‌ సంక్షోభం శాపంగా మారింది. వరుస లాక్‌డౌన్‌లు, కఠిన నిబంధనలు, వర్క్‌ఫ్రం హోం వంటి కారణాల వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతుంది. దీంతో హైదరాబాద్‌ మెట్రోలో తన వాటా అమ్మేందుకు ఎల్‌ అండ్‌​ టీ సన్నాహలు చేస్తోంది. పబ్లిక్‌ , ప్రైవేటు పార్టనర్‌షిప్‌లో ప్రపంచలోనే అతి పెద్ద మెట్రోగా 71 కిలోమీటర్ల నిడివితో మూడు మార్గాల్లో హైదరాబాద్‌ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. ఆరంభానికి తగ్గట్టే ప్రారంభించిన ఏడాదిలోపే నిత్యం 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా మారింది. ఇక లాభాల రూట్‌లోకి వెళ్లడమే తరువాయి అనే సమయంలో కోవిడ్‌ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. 

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 1,81,754 యూనిట్లను రీకాల్‌ చేసింది. వీటిల్లో సియాజ్‌, ఎర్టిగా, విటార్‌ బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎక్స్‌ఎల్‌ 6 కార్లు ఉన్నాయి. ‘‘2018 మే 4వ తేదీ నుంచి 2020 అక్టోబర్‌ 27వ తేదీ మధ్య తయారు చేసిన 1,81,754 కార్లను వెనక్కి రప్పిస్తున్నాం. ఈ రీకాల్‌ ప్రపంచ వ్యాప్తంగా వర్తిస్తుంది. భద్రతా పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకూడదని ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని మారుతీ సుజుకీ ఒక ప్రకటనలో పేర్కొంది. వెనక్కి పిలిపించిన కార్లను తనిఖీ చేసి అవసరమైతే మోటార్‌ జనరేటర్లను మార్చనుంది.

* ప్రముఖ బీమా సంస్థ ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.6,687 కోట్లు. దీంతో ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన 100 శాతం వాటాలు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు వెళ్లనున్నాయి. ఒక్కో షేరుకు రూ.685 చొప్పున మొత్తం 8,70,22,222 షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పరంకానున్నాయి. మరో రూ.762 కోట్లు నగదు రూపంలో చెల్లించనున్నారు. ఈ ఒప్పందానికి ఐఆర్‌డీఏఐ, సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ, సెబీ వంటి నియంత్రణా సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

* భారత్‌, అమెరికా మధ్య ఎయిర్-లాంచ్ మానవరహిత విమానాల కోసం ‘అగ్రిమెంట్‌’ అనే ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ సాంకేతిక సహకారం మరింత బలోపేతమయ్యే దిశగా ఇది ఓ కీలక అడుగు. ‘డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్(డీటీటీఐ)లోని జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎయిర్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఇరు దేశాల రక్షణ శాఖలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సహకార సాంకేతిక మార్పిడిని ప్రోత్సహించి వాటిని ఇరు దేశాల నాయకత్వ దృష్టిని తీసుకెళ్లడమే డీటీటీఐ ప్రధాన లక్ష్యం. అలాగే భారత్‌, అమెరికా సైనిక దళాల కోసం భవిష్యత్తు సాంకేతికతలను కలిసి అభివృద్ధి, ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సముపార్జించాలి. డీటీటీఐ కింద సంబంధిత రంగాల్లో పరస్పరం కుదిరిన ఒప్పందాలపై దృష్టి సారించడానికి త్రివిధ దళాల్లో సంయుక్త వర్కింగ్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. డీఆర్‌డీఓలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ), ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ లాబొరేటరీ (ఏఎఫ్‌ఆర్‌ఎల్‌)లోని ఏరోస్పేస్ సిస్టమ్స్ డైరెక్టరేట్, సహా ఇరు దేశాల వాయుసేనలు ప్రాజెక్టు అగ్రిమెంటును అమలు చేయనున్నాయి.

* ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నేడు భారీగా పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో ఇది 3.65 శాతం పెరిగి రూ.2,377కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్లను దాటేసింది. కంపెనీకి చెందిన రిటైల్‌ విభాగం సెర్చింజన్‌ ప్లాట్‌ఫామ్‌ జస్ట్‌డయల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉందన్న విషయం వెలుగులోకి వచ్చిన మర్నాడే ఈ ర్యాలీ జరిగింది. రిలయన్స్‌ రిటైల్‌కు జస్ట్‌డయల్‌ లిమిటెడ్‌లో 41శాతం వాటా లభిస్తుంది. జులై 20వ తేదీన జస్ట్‌ డయల్‌కి చెందిన రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.1,020 ధరకు రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. మొత్తం ₹1.31కోట్ల షేర్లు రిలయన్స్‌కు లభించాయి. ఇటీవల జరిగిన ఏజీఎంలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ రినీవబుల్‌ ఎనర్జీలో కంపెనీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించారు. ఆ తర్వాత నుంచి కంపెనీ షేర్లు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. రిలయన్స్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ సమీపించడం కూడా ర్యాలీకి మరో కారణం. నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యంత విలువైన షేరు.