బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ రిక్వెస్ట్ చేయబట్టే తాను ఆయన్ని కౌగిలించుకున్నానని అలనాటి నటి భాగ్యశ్రీ తెలిపారు. వీరిద్దరూ జంటగా నటించిన సెన్సేషనల్ సూపర్‌హిట్ చిత్రం ‘మై నే ప్యార్ కియా’. 1989లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఓ పాపులర్ షోలో అతిథిగా పాల్గొన్న భాగ్యశ్రీ ‘మై నే ప్యార్ కియా’ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభమైన రోజుల్లో కొంత ఇబ్బందిపడ్డానని.. ఆ తర్వాత సెట్‌లో ఉన్న వాళ్లందరూ బాగా పరిచయమైపోయారని ఆమె తెలిపారు. షూట్‌ని బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. సల్మాన్‌తో నటించడం గురించి మాట్లాడుతూ.. ‘ఆ సినిమా షూటింగ్ అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. అప్పటికే నేను ప్రేమలో ఉన్నా. త్వరలో పెళ్లి చేసుకోవాలని మేము అనుకున్నాం. దానివల్ల సినిమాలోని ఓ సన్నివేశం కోసం సల్మాన్‌ని కౌగిలించుకోవడానికి నేను కంగారుపడ్డా. త్వరలో ప్రేమించినవాడితో ఏడడుగులు వేయాలని నిర్ణయించుకుని.. వేరే వ్యక్తిని ఎలా కౌగిలించుకోవాలి? అని బాధపడ్డా. ఆ సీన్ చేయనని చెప్పేయాలనుకున్నా. అప్పుడు సల్మాన్ నా వద్దకు వచ్చి.. ‘ప్లీజ్.. సినిమా కోసం ఈ సీన్ చేయండి’ అని అడిగారు. ఆయన మాటకు గౌరవమిచ్చి ఓకే అన్నాను. మరో సన్నివేశంలో సల్మాన్-నేనూ ముద్దుపెట్టుకోవాలి. ఆ సీన్ చెప్పగానే ఇబ్బందిపడ్డా. నా ఇబ్బందిని గుర్తించిన దర్శకుడు సల్మాన్‌కి నాకు మధ్య ఓ అద్దం అడ్డుపెట్టారు. మేమిద్దరం ఆ గ్లాస్‌ని ముద్దుపెట్టుకుంటే చాలు అన్నారు. అలా, ఆ కిస్ సీన్ షూట్ చేశారు.’ అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. మరోవైపు, ప్రస్తుతం భాగ్యశ్రీ రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’లో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే, జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘తలైవి’లోనూ ముఖ్య భూమిక పోషించారు.
సల్మాన్ అడిగినందుకే కౌగిలింతకు ఒప్పుకున్నాను
Related tags :