* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 90వ రోజుకు చేరింది. ఇవాళ కడప కేంద్రకారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. సీఎం జగన్ మేనమామ, కమలాపురం వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య తర్వాత రవీంద్రనాథ్‌రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి.
* రైతులతో బండి సంజయ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ రచ్చబండ నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ యాత్ర మార్పు తీసుకువస్తుందని ఫడణవీస్ ధీమా వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా రైతుల వద్దకు వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పోరాటం ప్రారంభమైందన్న ఫడణవీస్ ఈ ప్రాంత ప్రజలు సంజయ్ కు మద్దతుగా నిలవాలని కోరారు. రైతు బంధు పేరుతో రైతుల పథకాలు ఎత్తేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడే రైతు బందు అమలవుతుందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భాజాపా అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
* గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పది మంది కరోనా బారినపడ్డారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నలుగురు, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఒకరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
* దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా పెంచాలని సూచించారు. జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కారు పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకొని ముష్కర మూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 6న ఇజ్రాయెల్ పౌరుల సెలవులు ప్రారంభం కానున్నందున వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే ప్రమాదం ఉందని, ఇందుకోసం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, కాన్సులేట్ సిబ్బంది, వారి నివాసాలు, కోషెర్ రెస్టారెంట్, చాబాద్ హౌస్, యూదుల కమ్యూనిటీ సెంటర్ వంటి ప్రాంతాల్లో వచ్చే నెలాఖరు వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పెంచాలన్నారు. ఇజ్రాయెల్ పౌరుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.
* దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు. గతంలో ఉన్న 9 పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీసు కమిషనరేట్లు రెండు నుంచి తొమ్మిదికి, నాలుగు పోలీసు జోన్లు ఏడుకి పెరిగాయని హోం మంత్రికి వివరించారు. పోలీసు మల్టీ జోన్లు రెండు కొత్తగా ఏర్పాటయ్యాయని తెలిపారు. ఎస్పీలు, కమిషనర్లు, జోన్ ఐజీల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పారు. సీనియర్ డ్యూటీ పోస్టులను 76 నుంచి 105కు పెంచాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ కీలక భేటీలో పలు అంశాలపై 10 లేఖలను ప్రధానికి అందజేసిన విషయం తెలిసిందే.
* జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఉచిత వైద్యసేవలు అందించడానికి హైదరాబాద్‌లోని ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ కొత్త భవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
* బంజారాహిల్స్‌లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 10 కిలోల గంజాయి, 50 గ్రాముల ఛారాస్, నాలుగు బోల్ట్స్ ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
* బార్ కౌన్సిల్‌తో తనకు ఎనలేని అనుబంధం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలయ్యాయని గుర్తుచేసుకున్నారు. శనివారం ఆయనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక ప్రసంగం చేశారు. ఖర్చులు, విచారణలో జాప్యమే న్యాయ వ్యవస్థకు పెద్ద సవాల్ అన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు తన వంతు కృషిచేస్తానని చెప్పారు.
* భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నంతో పాటు మీర్‌పేట, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జోరు వానల ధాటికి ముసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది. గత రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* ‘‘అసెంబ్లీలో సీఎం జగన్ కట్టుకథలు బాగా చెబుతారు. అవే కట్టుకథలు డీజీపీ కూడా బాగా వల్లెవేస్తారు. వనజాక్షి కేసును తిరగదోడాలని చూస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తారా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? నాపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు’’ అని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ కేసుల సినిమా చూపించటంలో డీజీపీ గౌతమ్ సవాంగ్.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మను మించిపోయారని విమర్శించారు.
* కరోనా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో ఈ నెల 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ 2021-22 విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. 213 పనిదినాలతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకుంది. అక్టోబర్ 6 నుంచి 17 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.
* మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తే తప్పేంటి? అంటూ నిర్మాత బండ్ల గణేశ్ ప్రశ్నించారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్‌రాజ్‌ని నాన్‌లోకల్ అనడం పట్ల గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రకాశ్‌రాజ్ తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారని.. ఆయన ఎలా నాన్ లోకల్ అవుతారని ప్రశ్నించారు.
* ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఓ వైద్యుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ వైద్య శిబిరంలో కేవలం 7 గంటల్లోనే 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికత్సలు చేశారు. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆగస్టు 27న జిల్లాలోని మెయిన్‌పట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో గల నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. అయితే ఈ శిబిరంలో అవకతవకలు జరిగాయని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
* తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడించింది. ఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల సీఎస్‌లతో సీఈసీ సమావేశమైంది.