ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఓ వైద్యుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ వైద్య శిబిరంలో కేవలం 7 గంటల్లోనే 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికత్సలు చేశారు. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఆగస్టు 27న జిల్లాలోని మెయిన్‌పట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో గల నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. అయితే ఈ శిబిరంలో అవకతవకలు జరిగాయని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్యాంప్‌లో విధులు నిర్వహించిన ప్రభుత్వ సర్జన్ ఒకరు 7 గంటల్లో 101 మంది మహిళలకు ట్యూబెక్టమీ(కుటుంబ నియంత్రణ) శస్త్రచికిత్సలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. సర్జన్ ఒక రోజులో గరిష్ఠంగా 30 ఆపరేషన్లు మాత్రమే చేయాలి.
దీనిపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల ప్రాంతంలో సర్జన్ ఈ మహిళలకు ఆపరేషన్లు చేసినట్లు తెలిసింది. కమిటీ నివేదిక వచ్చిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఘటనపై సదరు వైద్యుడు, స్థానిక ఆరోగ్య అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి డా. అలోక్ శుక్లా వెల్లడించారు.
కాగా.. ఆ రోజు క్యాంప్‌కు మారుమూల గ్రామాల నుంచి చాలా మంది మహిళలు వచ్చారని సదరు వైద్యుడు తెలిపారు. ప్రయాణ దూరం కారణంగా తాము మళ్లీ రాలేమని, అప్పుడే ఆపరేషన్ చేయాలని మహిళలు కోరడంతో తాను శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆ సర్జన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ మహిళలంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.