శ్రీధర్, ఈ పేరు తెలియని తెలుగు వాళ్లుండరు. కార్టూన్లు చూడని వాళ్లుండరు. బొమ్మ నవ్వించింది, ఆలోచన రేపింది, కోపం తెప్పించింది, నాయకులకి వాతలు పెట్టింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాలు మారిపోవడానికి ఒక కెటలిస్టులా (ఉత్ర్పేరకం) పనిచేసింది. ఈనాడు తెలిసిన వాళ్లందరికీ శ్రీధర్ తెలుసు. 40 ఏళ్లుగా బాగా వినిపించిన పేరు, కనిపించిన బొమ్మ. ఆయన సెలవు తీసుకుని రిటైర్మెంట్ ప్రకటించారు.
చిన్నప్పుడు హిందూలో టార్జన్ కార్టూన్ స్టోరీ వచ్చేది. అర్థం కాకపోయినా బొమ్మలు చూసి సంతోషించేవాడిని. తెలుగు పేపర్లలో వచ్చే కార్టూన్లను చదివి అర్థం చేసుకునే వయసు కాదు. మొదటిసారి కార్టూన్లను చూడ్డానికి కారణం మట్కా జూదం. 1973లో ఒక తుపాన్‌గా రాయదుర్గంలో వచ్చి పడింది. బొంబాయిలో ఒక కుండలోని చీటీలని లాటరీ తీసేవాళ్లు. కుండని మట్కా అంటారు కాబట్టి దానికా పేరు. అయితే జనాన్ని మోసం చేయడానికి మట్కా చార్టులు పుట్టాయి. రన్నింగ్ అని లెక్కలు తీసేవారు. ఇది కాకుండా పేపర్లలో వచ్చే కార్టూన్లలో నెంబర్లు దాగుంటాయని ఎవరో పుకారు పుట్టించారు. దాంతో నేను లైబ్రరీకి వెళ్లి కార్టూన్లని పరిశీలించేవాన్ని. చెవి 9లా , ముక్కు 3లా కనిపించేది. ఆ విషయం చెబితే వెర్రి జనాలు మట్కా ఆడి డబ్బులు పోగొట్టుకునే వాళ్లు.
1980 నాటికి ఈనాడు అనంతపురానికి సాయంత్రం 4 గంటలకు వచ్చేది. ప్రతి అక్షరం చదివించేది. 81 తర్వాత శ్రీధర్ బొమ్మలు పరిచయం. అంజయ్య వెంట ఒక హెలికాప్టర్ బొమ్మ వేస్తే పడిపడి నవ్వేవాళ్లం. 82లో NTR పార్టీ పెట్టేనాటికి తెల్లారేసరికి ఈనాడు వచ్చేది. మొదట చూసేది శ్రీధర్ కార్టూన్, తర్వాత పాకెట్ కార్టూన్. అప్పుడున్న రాజకీయ పరిణామాల వల్ల దాదాపు ప్రతిరోజూ పెద్ద కార్టూన్ వచ్చేది.
కాంగ్రెస్‌ని చీల్చి చెండాడుతూ , NTRని ఆకాశాన్ని ఎత్తుతూ వచ్చేది. జనంలో TDP మూడ్ క్రియేట్ కావడానికి కార్టూన్లు కూడా ఒక కారణం. ఈనాడు రాజకీయ అభిప్రాయాలకి అనుగుణంగానే కావచ్చు. అయితే శ్రీధర్ బొమ్మలోని వ్యంగ్యం, చమత్కారం గొప్పగా వుండేవి. ఉద్దేశం నెరవేరేది. NTRని డైరెక్ట్‌గా విమర్శించలేని ఇబ్బందులున్నప్పుడు అది కార్టూన్ రూపంలో పేలేది. NTR చనిపోయినప్పుడు వేసిన కార్టూన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. సామాన్యుడి గుండెల్లో NTR బతికి ఉన్నట్టు వేశారు.
ఆదివారం అనుబంధంలో జాతీయ, అంతర్జాతీయ విషయాలపై సందర్భానికి తగినట్టు పేలేవి. అవి చాలా ఆలోచనల్లో పడేసేవి. అవి వేయాలంటే బొమ్మ గీయడం తెలిస్తే చాలదు. విపరీతంగా చదువుకోవాలి. ఎన్నో విషయాలపై జ్ఞానం వుండాలి. శ్రీధర్ మంచి వ్యంగ్య రచయిత కూడా . సొంత పేరుతో కొన్ని , చికిత కలం పేరుతో కొన్ని కథలు రాశారు.
ఈనాడులో బాగా పనిచేసే వాళ్లకి పొగ , సెగ పెట్టడం అలవాటు. (ఇపుడు అన్ని పత్రికలు అదే రూట్లో వున్నాయి) శ్రీధర్ డైరెక్ట్‌గా రామోజీరావుతో అనుసంధానం కావడం వల్ల వదిలేశారు. ఆయనతో సమానంగా కార్టూన్లు వేయగలిగిన వాళ్లు ఈనాడులో లేకపోవడం కూడా కారణం కావచ్చు. శ్రీధర్ ఒకే ఒక్కడు. కార్టూన్ ఎడిటర్ హోదా వున్న ఏకైక వ్యక్తి.
ఏడెనిమిదేళ్లుగా శ్రీధర్ కార్టూన్లు తగ్గించారు. నేను చూడడం కూడా మానేశాను. దానికి కారణం మునుపటి పంచ్ , వ్యంగ్యం తగ్గిపోయింది. శ్రీధర్‌లో శక్తి లేక కాదు. ఈనాడులోనే శక్తి పోయింది. రాజకీయంగా ఏకపక్షం కావడం, వ్యాపార ప్రయోజనాల వల్ల రాజీ పడడంతో పోరాట శక్తి కోల్పోయింది. నెట్వర్క్, సంస్థాగత బలం, గుడ్‌విల్‌తో నెట్టుకొస్తోంది.
నిజానికి ఏడేళ్ల క్రితమే శ్రీధర్ రిటైర్ అయ్యారు. అయితే సంస్థ కోరిక మేరకు కొనసాగారు. కొంత కాలం ఫిల్మ్ సిటీ నుంచి, కొంత కాలం సోమాజిగూడ ఆఫీస్ నుంచి పనిచేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నడిచింది. తీవ్రమైన బ్యాక్ పెయిన్ వల్ల చివరికి మానేశారని సన్నిహితులు అంటున్నారు.
అయితే ఈనాడులో ఆయన్ను కొందరు ఇబ్బంది పెట్టారని సోషల్ మీడియాలో కథనాలొస్తున్నాయి. 40 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఆయన్ని పొగుడుతూ వ్యాసాలు రావడం మేనేజ్మెంట్లో కొందరికి నచ్చలేదట! తమ సంస్థ ఉద్యోగులు పాపులర్ కావడం ఈనాడుకి ఇష్టం వుండదు. నిజమే. అయితే శ్రీధర్ ఎప్పుడో పాపులర్. సోషల్ మీడియా కీర్తనల వల్ల కొత్తగా వచ్చే గుర్తింపేమీ లేదు.
ఈనాడులో రిటైర్ అయిన ఉద్యోగులకి ఒక పాలసీ వుంది. వాళ్లని కొనసాగిస్తే మొదటి ఏడాది అప్పటి వరకూ తీసుకుంటున్న జీతంలో 75 శాతం , రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది 35 శాతం ఇస్తారు. ఈ పాలసీ శ్రీధర్‌కి కూడా వర్తింపజేస్తే ఆయన నొచ్చుకుని వుంటాడనే వాదన కూడా వుంది.
ఇంకో విషయం ఏమంటే శ్రీధర్‌కే కాదు, కార్టూనిస్టులందరికీ ఇది టప్ టైమ్. సొసైటీలో సహించలేని తనం ఎక్కువైంది. ఎవరి మీద గీత గీసినా ఆయా కులపోళ్లు, వర్గం వాళ్లు, పార్టీ వాళ్లో మీద పడిపోతున్నారు. స్వేచ్ఛ కరువవుతున్న కాలం. ఆప్ఘన్లో తాలిబన్లు అంటున్నారు కానీ మన తాలిబన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు.
పైగా ఈనాడు పాలసీ ఏమిటో పాఠకులకే కాదు, ఈనాడు ఉద్యోగులకి కూడా అర్థం కాని స్థితిలో శ్రీధర్‌కి గీయడమూ కష్టమే, గీసినా జనానికి ఎక్కడమూ కష్టమే.
ఈనాడులో జనరేషన్ మారింది. కార్టూనిస్టు ఎడిటర్‌కి అనుగుణంగా పనిచేయాలి. అక్కడ ఎడిటర్, ఓనర్ ఒక్కరే. రామోజీరావు పాలన ముగిసింది. కొత్తవాళ్లకి శ్రీధర్ అర్థం కాకపోవచ్చు. అవసరం లేకపోవచ్చు. ఏది ఏమైనా శ్రీధర్ ఖాళీని భర్తీ చేసేవాళ్లు ఇప్పట్లో రాకపోవచ్చు. ఎప్పటికీ రాకపోవచ్చు. ఇది పాఠకుల కంటే ఈనాడుకే బాగా తెలుసు. – GR Maharshi