Business

క్యాన్సర్ ఔషధ హక్కులు విక్రయించిన రెడ్డీస్-వాణిజ్యం

క్యాన్సర్ ఔషధ హక్కులు విక్రయించిన రెడ్డీస్-వాణిజ్యం

* పెట్రో ఉత్పత్తులపై ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌- జులై మధ్య రూ.లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రాబడి వచ్చినట్లు సీజీఏ డేటా పేర్కొంటోంది. గతేడాది ఇదే నాలుగు నెలల కాలానికి రూ.67,895 కోట్లు సమకూరింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ సారి వసూలైన మొత్తం రూ.32,492 కోట్లు అదనం. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆయిల్‌ బాండ్లకు గానూ కేంద్రం చెల్లించాల్సింది రూ.10వేల కోట్లు. అంటే ఆయిల్‌ బాండ్లకు చెల్లించాల్సిన మొత్తం కంటే కేవలం నాలుగు నెలల్లో అదనంగా సమకూరిన మొత్తమే మూడు రెట్లు అధికం అన్నమాట! ఆయిల్‌ బాండ్లకు రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌ పేర్కొనగా.. ఈ నెల 2న (రాహుల్‌ విమర్శలపై స్పందిస్తూ) ఆ మొత్తం రూ.1.5 లక్షల కోట్లు అని హర్దీప్‌సింగ్‌ పూరి పేర్కొనడం గమనార్హం.

* సెక్యూరిటీల పెట్టుబడిపై వడ్డీ కింద వొడాఫోన్‌ ఐడియా నుంచి దాదాపు రూ.149 కోట్లు అందుకున్నట్లు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. అయిదు పథకాలతో కూడిన సెగ్రిగేటెడ్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఎన్‌సీడీలపై ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 2020 ఏప్రిల్‌లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆరు డెట్‌ పథకాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇందులో అయిదు పథకాలు ఫ్రాంక్లిన్‌ ఇండియా లో డ్యూరేషన్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా షార్ట్‌ టెర్మ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా డైనమిక్‌ అక్యూరల్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా ఇన్‌కమ్‌ అపర్చ్యూనిటీస్‌ ఫండ్‌లు.. వొడాఫోన్‌లో పెట్టుబడులు పెట్టాయి. వొడాఫోన్‌ జారీ చేసిన బాండ్లలో ఈ పెట్టుబడులు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.40,000 కోట్లకు పైగా సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలపై వొడాఫోన్‌ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్‌ నుంచి వచ్చిన వడ్డీ మొత్తాన్ని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఆయా ఫండ్ల యూనిట్‌దారులకు పంపిణీ చేయనుంది.

* జాతీయ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) పరిధిలోని అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) అతిపెద్ద సామాజిక భద్రత పథకంగా అవతరించించింది. 2.8 కోట్ల మంది ఇప్పటి వరకు ఇందులో చేరారు. ఎన్‌పీఎస్‌ పరిధిలో మొత్తం 4.2 కోట్ల మంది ఉండగా.. అందులో 2.8 కోట్ల మంది అంటే 66 శాతం మంది 2020-21 ఆర్థిక సంవత్సరాంతానికి ఈ పథకంలో చందాదారులుగా మారినట్లు ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ పేర్కొంది. చేరిలో వారిలో మెట్రో కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ట్రస్ట్‌ పేర్కొంది. 2015 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌ యోజనను తీసుకొచ్చింది. 18-40 వయసు గల వారు ఈ స్కీమ్‌కు అర్హులు. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛను పొందొచ్చు. అందుకు నెలవారీ జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే అంతే మొత్తాన్ని జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. ఆ వ్యక్తి కూడా మరణిస్తే పెన్షన్ కోసం సమకూరిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌) ఈ పథకంలో చేరొచ్చు.

* యాంటీ- కేన్సర్‌ ఏజెంట్‌ ‘ఈ7777 (ఇంజినీర్డ్‌ ఐఎల్‌-2 డిఫ్తీరియా టాగ్జిన్‌ ఫ్యూజన్‌ ప్రొటీన్‌)’ పై తనకు ఉన్న హక్కులను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ యూఎస్‌కు చెందిన సిటియస్‌ ఫార్మాసూటికల్స్‌కు విక్రయించింది. ఈ విషయాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ శనివారం వెల్లడించింది. దీనికి ప్రతిఫలంగా డాక్టర్‌ రెడ్డీస్‌కు 40 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.290 కోట్లు) వెంటనే లభిస్తాయి. ఆ తర్వాత సీటీసీఎల్‌ (క్యుటానేయస్‌ టీ-సెల్‌ లింఫోమా) అనుమతి వచ్చిన నాడు ‘అప్రూవల్‌ మైల్‌స్టోన్‌ పేమెంట్‌’ కింద మరో 40 మిలియన్‌ డాలర్లు వస్తాయి. ఇదేకాకుండా ఇంకా అదనపు అనుమతులు వచ్చిన నాడు 70 మిలియన్‌ డాలర్లు లభించే అవకాశం ఉంది. ఈ7777 యాంటీ- కేన్సర్‌ ఏజెంట్‌పై జపాన్‌, ఆసియా దేశాలు మినహా మిగిలిన దేశాలకు సంబంధించిన పూర్తి హక్కులను డాక్టర్‌ రెడ్డీస్‌ 2016లో జపాన్‌కు చెందిన ఈసాయి కంపెనీ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసింది. తదుపరి దీనిపై డాక్టర్‌ రెడ్డీస్‌ మరికొంత పరిశోధనలు చేసింది. ఇప్పుడు దీన్ని సిటియస్‌ ఫార్మాకు విక్రయించింది. ఈ యాంటీ- కేన్సర్‌ ఏజెంట్‌ను ఇంకా అభివృద్ధి చేసి సీటీసీఎల్‌ చికిత్సకు అనువైనదిగా తీర్చిదిద్దే సత్తా ఈ కంపెనీకి ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎరెజ్‌ ఇజ్రాయెలి పేర్కొన్నారు.