Business

T-Mobileలో వాటాలు కొనుగోలు చేయనున్న రిలయన్స్-వాణిజ్యం

T-Mobileలో వాటాలు కొనుగోలు చేయనున్న రిలయన్స్-వాణిజ్యం

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తన టెలికాం వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించేందుకు యోచిస్తోంది. ఈ మేరకు నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ టి-మొబైల్‌లో మెజారిటీ వాటాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దాదాపు 5.7 బిలియన్‌ డాలర్లతో ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టి-మొబైల్‌కి నెల వ్యవధిలో నాన్‌-బైండింగ్‌ ఆఫర్‌ పంపనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కొనుగోలుకు కావాల్సిన నిధులను సమకూర్చేందుకు కొన్ని ఆర్థిక సంస్థలను కూడా రిలయన్స్‌ ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. పలు విదేశీ బ్యాంకులు సిండికేట్‌గా ఏర్పడి ఈ లావాదేవీకి కావాల్సిన నిధులు సమకూర్చేందకు సిద్ధమైనట్లు సమాచారం.

* హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ సోమవారం తొలి ‘హోండా బిగ్‌ వింగ్‌ వర్చువల్‌ షోరూమ్‌’ను ప్రారంభించింది. వినియోగదారులకు కాంటాక్ట్‌ లెస్‌ సేవలు అందించేందుకు దీనిని ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ షోరూమ్‌లో కస్టమర్లకు 360 డిగ్రీల్లో వర్చువల్‌ ప్రొడక్ట్‌ డెమో అందిస్తారు. ఆన్‌లైన్‌ డాక్యుమెంటేషన్‌, డైరెక్ట్‌ టు హోమ్‌ డెలివరీ, వర్చువల్‌ చాట్‌ సపోర్ట్‌ వంటి పలు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

* తూత్తుకుడి కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు రంగ బ్యాంకు తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు కావాల్సిన పత్రాలను సోమవారం సెబీకి సమర్పించింది. 15,827,495 తాజా షేర్లు, 12,505 ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్ని భవిష్యత్తులో సంస్థ కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు ఉపయోగిస్తామని తెలిపింది.

* సూచీల రికార్డుల సోమవారమూ పరంపర కొనసాగింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా వంటి దిగ్గజ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 58,515 వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 17,429 వద్ద రికార్డు నెలకొల్పింది. రూపాయి బలపడటం, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, టీకా ప్రక్రియ ఊపందుకోవడం, కొవిడ్‌ ఆంక్షల సడలింపు, బలమైన ఆర్థిక వ్యవస్థ గణాంకాలు, కీలక రంగాల రాణింపు సూచీల పరుగుకు తోడ్పడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.12 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 58,411 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే జోరును కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 58,515 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 166 పాయింట్ల లాభంతో 58,296 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 54 పాయింట్లు దూసుకెళ్లి 17,377 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,429 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

* రాబోయేది పండగల సీజన్‌. సాధారణంగా వినియోగదార్లు దసరా, దీపావళి పండగల సమయంలో కొత్త కార్లు డెలివరీ తీసుకోవడానికి ఇష్టపడతారు. అధికంగా అమ్మకాలు నమోదయ్యేది కూడా ఈ సీజన్లోనే. దీంతో కష్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ‘హోండా కార్‌ ఇండియా’ రూ.57,000 వరకు ప్రయోజనాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ మొత్తంలో కొంత రాయితీ, ఉచితంగా యాక్సెసరీస్‌, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలను సెప్టెంబరు 30, లేదా స్టాక్‌ పూర్తయ్యే వరకు అందించనున్నారు. హోండా అమేజ్ ప్రి-ఫేస్‌లిఫ్ట్‌పై గరిష్ఠంగా రూ.57,044 వరకు రాయితీ ఇస్తున్నారు. ఎస్‌ఎంటీ పెట్రోల్‌ ట్రిమ్‌పై రూ.20,000 నగదు రాయితీ లేదా రూ.24,044 విలువ చేసే ఎఫ్‌ఓసీ యాక్సెసరీస్‌ ఇస్తున్నారు. కారు ఎక్సేంజీ కింద మరో రూ.15,000 వరకు రాయితీ పొందొచ్చు. వీ ఎంటీ, వీఎక్స్‌ ఎంటీ గ్రేడ్‌ కార్లపై రూ.5,000 వరకు నగదు రాయితీ లేదా రూ.5,998 విలువ చేసే ఎఫ్‌ఓసీ యాక్సెసరీస్‌ లభిస్తాయి. కారు ఎక్స్‌ఛేంజ్‌ కింద రూ.10,000 వరకు పొందవచ్చు. లాయల్టీ బోనస్ కింద మరో రూ.5 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సబ్‌కాంపాక్ట్‌ సెడాన్‌పై మరో రూ.4,000 రాయితీ లభించనుంది. అయితే, అమేజ్‌ 2021పై మాత్రం గరిష్ఠంగా రూ.18,000 వరకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.