* కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా అరకొర వేతన పెంపుతో సరిపెట్టుకుంటున్న ఉద్యోగులకు తీపికబురు అందింది. వచ్చే ఏడాది సగటు వేతన పెంపు కొవిడ్-19కు ముందున్న పరిస్థితులకు చేరనుంది. ఈ ఏడాది 8.8 శాతంగా అంచనా వేసిన వేతన పెంపు 2022లో 9.4 శాతంగా ఉంటుందని ఏఓఎన్ 26వ వార్షిక వేతన పెంపు సర్వేలో వెల్లడైంది. 39 రంగాలకు చెందిన 1350 కంపెనీలను ఈ సర్వే పలుకరించింది. 2021లో పలు రంగాల్లో ఉద్యోగుల వలసలు, నిష్ర్కమణల రేటు 20 శాతంగా ఉంటుందని దీంతో నియామకాల ప్రక్రియా ఊపందుకుంటుందని సర్వే వెల్లడించింది. వచ్చే ఏడాది ఆశాజనకంగా ఉంటుందని 98.9 శాతం కంపెనీలు అంచనా వేస్తూ 2022లో వేతన పెంపు చేపడతామని చెప్పాయి. 9.4 శాతం సగటు వేతన పెంపు ప్రతిపాదన ఆరేండ్లలో అత్యధిక వేతన పెంపు ఇదే కానుండటం గమనార్హం. 2021లో సగటు వేతన పెంపు 8.8 శాతానికి పరిమితమైంది. సెకండ్ వేవ్ అనంతరం ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటున్న క్రమంలో వచ్చే ఏడాది అంతా సానుకూలంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
* కరోనా మహమ్మారి నెమ్మదించినా దేశవ్యాప్తంగా కొత్త ఉద్యోగాలు ఆశించిన స్ధాయిలో అందుబాటులోకి రావడం లేదు. జులైలో 6.96 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఆగస్ట్‌లో 8.32 శాతానికి ఎగబాకిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) జాబ్స్ డేటా వెల్లడించింది. మరోవైపు ఆగస్ట్‌లో భారత్‌లో 15 లక్షల కొలువులు కోల్పోయిందని పేర్కొంది. ఈ గణాంకాలు ప్రతికూలంగా ఉన్నా ఆందోళన రేకెత్తించేవి కాదని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేష్ వ్యాస్ పేర్కొన్నారు. జులైతో పోలిస్తే ఆయా పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యే రేటు పెరిగిందని చెప్పారు. నారుమళ్ల సీజన్ ముగియడంతో ఆగస్ట్‌లో ఉద్యోగాలు నష్టపోయినట్టు గణాంకాలు వెల్లడించాయని తెలిపారు. దీంతో వ్యవసాయ రంగంలో మొత్తం 80 లక్షల మంది ఉపాధి కోల్పోగా వీరిలో చాలా మంది ఇతర రంగాల్లో పనులకు కుదురుకున్నారని చెప్పారు. ఫలితంగా దెబ్బతిన్న ఉపాధి కేవలం 15 లక్షలకు పరిమితమైందని విశ్లేషించారు. ఎక్కువ మంది ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కోసం చూస్తుండటం సానుకూల పరిణామమని వ్యాస్ పేర్కొన్నారు.
* ఇప్పటికే కరోనా మహమ్మారితో తలెత్తిన ఆర్థిక ఒత్తిళ్లు, పెట్రోల్-డీజిల్ అధిక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో విలవిల్లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రవేట్ సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు 2020-21 ఆర్థిక సంవత్సర వడ్డీ ఆదాయాన్ని వారి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే దీపావళికల్లా సభ్యుల పీఎఫ్ ఖాతాలపై వడ్డీని దీపావళి పండుగకు ముందు వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది.
* భారత్‌లో ఎట్టకేలకు తన రేజర్ హైబ్రిడ్ స్కూటర్‌ను యమహ లాంఛ్ చేసింది. ఫాస్కినో హైబ్రిడ్ తర్వాత ఇది యమహ ఇండియా లైనప్‌లో రెండో హైబ్రిడ్ స్కూటర్. ఇక రేజర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ 76,830 (ఎక్స్ షోరూం, ఢిల్లీ)కాగా, రేజర్ హైబ్రిడ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ 79,830కి అందుబాటులో ఉంది. వీటితో పాటు స్పోర్టియర్ రేజర్ స్ట్రీట్ ర్యాలీ హైబ్రిడ్ (రూ 83,830)ను కూడా యమహ లాంఛ్ చేసింది. 2021 రేజర్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో అందుబాటులో ఉంది. న్యూ రేజర్ 123 ఎఫ్ఐ, స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ వెర్షన్ లాంఛ్‌తో భారత్‌లో హైబ్రిడ్ స్కూటర్ పోర్ట్ పోలియో విస్తరణకు వెసులుబాటు కలిగిందని యమహ మోటార్ ఇండియా చీఫ్ మోటోఫుమి షిటర పేర్కొనన్నారు. ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్‌కు అనూహ్య స్పందన రావడంతో మార్కెట్‌లో తమ స్ధానం మరింత బలోపేతం చేసుకోగలమనే విశ్వాసం ఏర్పడిందని చెప్పారు.
* ఐటీ రంగంలో టెకీలకు నెలకొన్న డిమాండ తరహాలో డిజిటల్ సేల్స్‌పై ఫోకస్ పెంచిన ఆటోమొబైల్ కంపెనీలు సైతం టెకీల నియామకానికి మొగ్గుచూపుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటో దిగ్గజాలు వర్చువల్ సేల్స్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా టెక్ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం ఆయా కంపెనీలు అన్వేషిస్తున్నాయి. 2019లో కొవిడ్-19కు ముందున్న పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో ఐటీ, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన సిబ్బంది హైరింగ్ ఏకంగా 45 శాతం పెరిగిందని మానవ వనరుల సంస్ధ టీమ్ లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది.