DailyDose

కూర బాలేదన్న భర్త. తల పగలగొట్టిన భార్య-నేరవార్తలు

కూర బాలేదన్న భర్త. తల పగలగొట్టిన భార్య-నేరవార్తలు

* సంసారమన్నాక భార్యాభర్తల మధ్య చిన్నచిన్న వాదనలు, గొడవలు రావడం సహజమే. కానీ ఒక్కోసారి ఇలాంటి చిన్న తగువులే తీవ్రమవుతుంటాయి. అనవసర ఘటనలకు దారితీస్తాయి. హరియాణాలోని హిసార్ జిల్లాలో ఈ తరహా గొడవే జరిగింది. కూర బాగాలేదని చెప్పిన పాపానికి భర్త తల పగలగొట్టింది భార్య. హిసార్ జిల్లా బార్వాలా పట్టణంలో దినేశ్, బిందియా దంపతులు నివసిస్తున్నారు. ప్రతిరోజులాగే భర్త కోసం ఆహారం సిద్ధం చేసింది బిందియా. అయితే కూరలో ఉప్పు తక్కువైందని భావించిన దినేశ్(40).. ఈ విషయాన్ని భార్యతో చెప్పాడు. భోజనం అంత రుచిగా లేదన్నాడు. దీంతో వారిమధ్య వాదన మొదలైంది. దీంతో కోపోద్రిక్తురాలైన బిందియా భర్త దినేశ్‌పై ఇనుప రాడ్డుతో దాడిచేసింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆ గొడవను గమనించిన పొరుగింటి వ్యక్తి అక్కడకు చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం ఈ ఘటనపై దినేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ మధ్య తరచూ ఇలాంటి గొడవలే జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు ఆ బాధిత భర్త.

* తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో డ్రగ్స్‌ సరఫరాదారుడు కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. కెల్విన్‌ బ్యాంకు ఖాతా వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. కెల్విన్‌తో పాటు పాతబస్తీకి చెందిన వాహిద్‌, కుదూస్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితులు, నటుడు నందు మధ్య లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. కెల్విన్‌ను అదుపులోకి తీసుకొనే ముందు నటుడు నందును 4 గంటల పాటు ప్రశ్నించారు.

* పనిచేయకుండా పోయిన లిఫ్ట్‌ను దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తెరిచిన సిబ్బంది అందులోని దృశ్యాలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అందులో ఓ వ్యక్తి అస్థిపంజరం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌ కైలీలోని ఈపీసీఈ ఆసుపత్రిని 1991లో నిర్మించారు. అందులోని లిఫ్ట్‌ కొద్దికాలంపాటు పనిచేసి 1997లో పాడైపోయింది. అప్పటి నుంచి ఆ లిఫ్ట్‌ వినియోగంలో లేదు. తాజాగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిన ఆసుపత్రి యాజమాన్యం ఆ లిఫ్ట్‌ను తెరిపించింది. అయితే అందులో పూర్తిగా ధ్వంసమైపోయిన ఓ అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది. విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు ఎముకలను డీఎన్‌ఏ పరీక్షల కోసం తరలించారు. అనంతరం ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. పనిచేయకుండాపోయిన లిఫ్ట్‌లోకి మృతదేహం ఎలా వచ్చింది? లిఫ్ట్‌ ఆగిపోయిన సమయంలో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడా? లేదా ఎవరైనా అతడిని హత్య చేసి అందులో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడిని గుర్తించేందుకు 24 ఏళ్ల క్రితం తప్పిపోయినవారి సమాచారం సేకరిస్తున్నారు. డీఎన్‌ఏ నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

* నకిలీ చలాన్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రికవరీ కానీ ఆస్తులు స్టాంప్‌ డ్యూటీ కట్టని జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.6.50 కోట్లు రికవరీ అయినట్లు అధికారులు గుర్తించారు.

* హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ చర్చికి పాస్టర్‌గా వ్యవహరిస్తున్న జోసఫ్‌ చర్చికి వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా ముగ్గురు యువతలను చర్చిలోనే పెళ్లి చేసుకున్నాడు. అతడు ఈ మధ్య కాలంలో లైంగిక దాడులకు దిగడంతో పాటు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. అతని ప్రవర్తనతో మోసపోయామని గ్రహించిన యువతులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. యువతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పాస్టర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి సీఐ అంజిరెడ్డి తెలిపారు.