కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన ఒంటారియోలోని లండన్‌లో చోటుచేసుకున్నది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఘటన జరగడం శోచనీయం. కోవిడ్ వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న నిరసనకారులు ప్రధాని ట్రూడోపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న రాళ్లతో జరిగిన దాడిలో ఎవరూ గాయపడలేదు. కానీ ప్రధాని జస్టిన్‌తో పాటు ఆయన సిబ్బందిపై కూడా ఆ రాళ్లు పడ్డాయి. ఓ బ్రెవరీని విజిట్ చేసి తిరిగి తన బస్సులోకి వస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. కోవిడ్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రచార సభకు అడ్డుతిరిగారు. ఇటీవల ఆందోళనకారుల వల్ల ఓ ర్యాలీని కూడా ఆయన రద్దు చేసుకున్నారు. ఒంటారియోలో జరిగిన ఘటన గురించి ఆయన మాట్లాడుతూ.. తన భుజంపై ఆ చిన్న రాళ్లు తగిలాయని, కానీ దాంతో బెదిరేదిలేదన్నారు. ప్రధానిపై రాళ్లు రువ్విన ఘటనను ప్రతిపక్ష నేత ఖండించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కచ్చితం టీకా వేసుకోవాలని ట్రూడో ఆంక్షలు విధించారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా అవసరమని ఆయన స్పష్టం చేశారు. దీన్ని యాంటీ వ్యాక్సిన్ ఆందోళనకారులు తప్పుపడుతున్నారు.
కెనడా ప్రధానిపై రాళ్ల దాడి
Related tags :