* రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
* రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యలు శుభాకాంక్షలు తెలిపారు.
* ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాబినెట్‌లో సిరాజుద్దిన్ హక్కానీ ఆ దేశ హోంమంత్రిగా నియమితులయ్యారు. హక్కానీ గ్రూపుకు చెందిన సిరాజుద్దీన్.. ఉగ్రవాద జాబితాలో ఉన్నారు. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ లిస్టులో అతను మోస్ట్ వాంటెడ్. ఉగ్రవాది హోంమంత్రి కావడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో లింకు ఉన్న హక్కానీ గ్రూపును స్థాపించిన జలాలుద్దిన్ హక్కనీ కుమారుడే సిరాజుద్దీన్. జలాలుద్దీన్ సోవియేట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సిరాజ్ మేనమామ ఖలీల్ హక్కానీ కూడా మంత్రి అయ్యారు. శరణార్థుల శాఖకు తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాలిబన్ల ప్రభుత్వంలో ఇద్దరు హక్కానీలకు చోటు దక్కడం పాక్ పాత్రను స్పష్టం చేస్తున్నది. ప్రస్తుతం సిరాజుద్దీన్, ఖలీల్ హక్కానీలు ఇంకా అమెరికా ఉగ్రవాద జాబితాలో ఉన్నారు. వారిద్దరి తలలపై మిలియన్ల డాలర్ల నజరానా ఉన్నది. సిరాజుద్దీన్ హక్కానీ తలపై సుమారు 10 మిలియన్ల డాలర్ల రివార్డు ఉన్నది. కాబూల్‌లో 2008లో ఇండియన్ ఎంబసీపై జరిగిన బాంబు దాడిలో హక్కానీ గ్రూపు కీలకంగా నిలిచింది. ఆ దాడిలో 58 మంది మృతిచెందారు. పాక్ ఐఎస్ఐ ఆ దాడులను ప్లానేసినట్లు తేలినా.. ఆ దేశం దాన్ని ఖండించింది. హక్కానీ గ్రూపు రెండు దశాబ్ధాలుగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. పాశ్చాత దేశాలకు చెందిన వారిని కిడ్నాప్ చేసి భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంలోనూ హక్కానీ గ్రూపు నిమగ్నమైంది. 2017లో కాబూల్‌లో జరిగిన ట్రక్కు బాంబు దాడిలో 150 మంది మరణించారు. ఆ దాడిలో సిరాజుద్దీన్ ప్రధాన నిందితుడు. హక్కానీ గ్రూపును అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తిస్తోంది. ఆల్‌ఖయిదాతోనూ ఆ సంస్థకు లింకులు ఉన్నాయి.
* భారీ వర్షాలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. ఈ మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం కంటే 24 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు 24 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అత్యధిక వర్షపాతం నమోదైంది. మారేడుపల్లిలో అత్యధికంగా 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
* అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం ఢిల్లీలో భేటి అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై వీళ్లిద్దరూ చర్చించారు. అక్కడ తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే ఈ ఇద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా ఉగ్రవాదిగా గుర్తించిన వ్యక్తినే తాలిబన్లు ప్రధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధోవల్, బర్న్స్ ఏం చర్చించారన్న విషయంపై స్పష్టత లేదు. దోవల్ ఇప్పటికే రష్యా ఎన్ఎస్ఏతోనూ భేటీ అయ్యారు.
* ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఏపీ ఈ-గెజిట్’ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను ఈ-గెజిట్‌లో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు అవసరం లేని వ్యక్తిగతమైన సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందులో అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేసింది. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
* రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నూతన రోడ్ల నిర్మాణం కోసం మూడు రోజుల్లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. పదోన్నతులు పొందిన 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు ఖాళీలకు అనుగుణంగా పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు కూడా పదోన్నతులు కల్పించాలని.. అందుకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కారోబార్‌లు, పంపు మెకానిక్‌ల సమస్యలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇంకా నిర్మాణం చేయాల్సి ఉన్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.