బ్లూటూత్ డివైజ్‌లను కనెక్ట్ చేసేందుకు నిర్దేశించిన వైర్‌లెస్ ప్రొటోకాల్‌లోని లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ 10, ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్స్‌కి సైబర్ నేరగాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. బ్లూటూత్ క్లాసిక్‌లోని వైర్‌లెస్ ప్రొటోకాల్‌లోని 16 రకాల లోపాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిని బ్రాక్‌టూత్‌గా పిలుస్తున్నారు. క్వాల్‌కోమ్, ఇంటెల్, టెక్సాస్ ఇనుస్ట్రుమెంట్స్ కంపెనీలకు చెందిన బ్లూటూత్ స్పీకర్స్, హెడ్‌ఫోన్స్, మైక్, కీబోర్డ్‌లలోని మైక్రోప్రాసెసర్ చిప్‌లలో ఈ సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సింగపూర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధన బృందం తమ నివేదికలో పేర్కొంది. అయితే ఈ చిప్‌లను ఎక్కువగా మైక్రోసాఫ్ట్, డెల్ ల్యాప్‌టాప్‌లతోపాటు శాంసంగ్, గూగుల్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించినట్లు తెలిపారు. దీనివల్ల సుమారు వంద కోట్లకుపైగా డివైజ్‌లు ప్రభావితం కానున్నాయని వెల్లడించారు.
ఈ లోపం కారణంగా హ్యాకర్స్ సులువుగా యూజర్ డివైజ్‌లలోకి మాల్‌వేర్‌లను పంపి ఇన్‌స్టాల్ చేయగలరని తెలిపారు. ఇప్పటికే దీని గురించిన సమాచారం చిప్ తయారీ సంస్థలకు, వాటిని ఉపయోగించిన టెక్ సంస్థలకు అందించినట్లు పరిశోధన బృందం తెలిపింది. ఈ ఉత్పత్తులను తయారుచేసిన సంస్థలు దీని గురించి యూజర్‌కి సమాచారం అందించి లోపాన్ని సరిచేయాలని నివేదికలో పేర్కొన్నారు. దాంతోపాటు యూజర్స్ డివైజ్ తయారీ సంస్థల నుంచి వచ్చే కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. అయితే ఏ దేశాల్లో ఈ ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడయ్యాయనే దానిపై పూర్తి సమాచారంలేదు.