అఫ్గాన్‌లో తాలిబన్ల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని చైనా స్వాగతించింది. తద్వారా గత మూడు వారాలకుపైగా అక్కడ నెలకొన్న అస్థిరతకు తెరదించారని అభిప్రాయపడింది. అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంలో అమెరికా సరిగా వ్యవహరించకపోవడంతోనే అక్కడ అస్థిరత ఏర్పడిందని విమర్శిస్తోన్న చైనా.. తాలిబన్ ప్రభుత్వం రాకతో ఆ పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చైనా ఎంతో ప్రాముఖ్యత ఇస్తోందని చైనా విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. తద్వారా మూడు వారాలకుపైగా అక్కడ నెలకొన్న అస్థిరతకు ముగింపు పలకడంతో పాటు దేశం పునర్నిర్మాణంలో ఇదో కీలక అడుగు అని వ్యాఖ్యానించారు. అయితే, అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. స్థానిక, విదేశీ విధానాల్లో తాలిబన్ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందన్న ఆయన.. పొరుగున ఉన్న అన్ని దేశాలతో తాలిబన్లు మంచి సంబంధాలు నెలకొల్పుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా, నాటో బలగాలు ఉపసంహరించుకున్న తర్వాత అఫ్గాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులుపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించడంపైనా పలు దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం ముందునుంచీ తాలిబన్లకు మద్దతుగానే నిలుస్తోంది. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న వెంటనే తాలిబన్‌లతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన చేసింది. భవిష్యత్తులోనూ వారితో కలిసి పనిచేస్తామని పేర్కొంది. ఇదే సమయంలో కొవిడ్-19 పోరులోనూ తమకు మద్దతుగా నిలుస్తామని చైనా హామీ ఇచ్చినట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు.