Business

ఉద్యోగస్థులకు 6.6 శాతానికే గృహరుణం

ఉద్యోగస్థులకు 6.6 శాతానికే గృహరుణం

మీరు జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగ‌స్థులా? ఇల్లు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నారా? గృహ రుణం ఏ బ్యాంకులో తీసుకోవాలి.. అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే. 6.66 శాతం వ‌డ్డీ రేటుతో రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు గృహ రుణం పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్‌ని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) అందిస్తోంది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌(ఐపీపీబీ) ఇప్పుడు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్‌)తో టై-అప్‌ అయ్యింది. గృహ రుణ ఉత్పత్తుల‌ను తమ 4.5 కోట్ల మంది ఖాతాదార్లకు విక్రయించేందుకు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌తో జ‌త కట్టిన‌ట్లు ఐపీపీఐ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

650 బ్రాంచ్‌లు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సిస్ పాయింట్ల‌తో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు బ‌ల‌మైన‌, విస్తృత‌మైన నెట్‌వ‌ర్క్ ఉంది. అంతేకాకుండా ఐపీపీబీలో దాదాపు 2ల‌క్ష‌ల మంది పోస్ట‌ల్ ఉద్యోగులు(పోస్ట్‌మ్యాన్‌, గ్రామీణ డాక్ సేవక్‌లు) మైక్రో ఏటీఎమ్‌, బ‌యోమెట్రిక్ ప‌రికరాల‌తో ఇంటి వ‌ద్దే(డోర్‌స్టెప్‌) బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందిస్తున్నారు. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్‌ గృహ రుణాల‌ను దేశ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారుల‌కు అందించ‌డంలో ఈ వ్య‌వ‌స్థ ముఖ్య‌పాత్ర పోషిస్తోందని ఐపీపీబీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఈ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కింద గృహ రుణాల‌కు సంబంధించి క్రెడిట్ అండ‌ర్ రైటింగ్‌, ప్రాసెసింగ్‌, పంపిణీ మొద‌లైన ప‌నుల‌ను ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్వ‌హిస్తుంది. రుణాల‌ను వినియోగ‌దారునికి అందించ‌డంలో పోస్ట్ పేమెంట్ బ్యాంక్ స‌హాయ‌ప‌డుతుంది. అంటే ఖాతాదారునికి, ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్‌కి మ‌ధ్య వారధిలా ఐపీపీబీ ప‌నిచేయనుంది.

ఇండియా పోస్ట‌ల్‌ పేమెంట్స్ బ్యాంక్.. బీమా కంపెనీల భాగ‌స్వామ్యంతో ఇప్ప‌టికే సాధార‌ణ‌, జీవిత బీమా పాల‌సీల‌ను తన క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తుండ‌గా..తాజాగా గృహ‌ రుణ ఉత్ప‌త్తుల‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వారికి 6.66 శాతం ప్రారంభ వ‌డ్డీతో రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు గృహరుణాల‌ను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ ఆఫ‌ర్ చేస్తోంది.

పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా గానీ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా గానీ ఈ గృహ రుణాన్ని పొంద‌చ్చు. రుణ‌ అర్హ‌త ఆధారంగా బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు.. వినియోగ‌దారునికి గృహ రుణాల‌ను మంజూరు చేస్తాయి. ఇక్క‌డ రుణ అర్హ‌త అంటే.. మీకు బ్యాంకు ఎంత‌మేర‌కు రుణం ఇవ్వ‌గ‌ల‌దో తెలుసుకోవడం. ద‌ర‌ఖాస్తుదారుడి ఆర్థిక స్థితి, నెల‌వారీ ఆదాయం, వృత్తి, ప‌నిచేసే సంస్థ, వ‌య‌సు, క్రెడిట్ స్కోర్‌, ఆస్తులు మొద‌లైన అన్ని వివ‌రాల‌ను ప‌రిశీలిస్తారు. మీ నెల‌వారీ ఆదాయాన్ని ముఖ్య‌మైన అంశంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. సంపాద‌న బాగుండి, క్ర‌మశిక్ష‌ణ‌తో చెల్లింపులు చేసే వారు.. ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవ‌కాశం ఉంటుంది. గ‌రిష్ఠ రుణ మొత్తం ఆస్తి విలువ‌లో 75 శాతం నుంచి 90 శాతం వ‌ర‌కు ఉంటుంది.