* ముద్రణా సామగ్రి కాంట్రాక్టులో అవకతవకలకు పాల్పడిన జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)కు చెందిన అధికారులు సహా ప్రైవేటు వ్యక్తులపై హైదరాబాద్ సీబీఐ విభాగం సోమవారం కేసు నమోదు చేసింది. ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ముద్రణా సామగ్రి అవసరం ఉంటుంది. దీనికోసం ఆలూరి రామకృష్ణ ప్రసాద్‌కు చెందిన బాలాజీ స్కాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరం సుధాకర్‌రెడ్డికి చెందిన వైష్ణవి లేజర్ గ్రాఫిక్స్ సంస్థలతో 2012లో తిరిగి 2016లో రేట్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉండగా ఎన్‌ఐఆర్‌డీ చేపట్టిన బేర్‌ఫూట్ టెక్నిక్స్ (బి.ఎఫ్.టి.) అనే కోర్సు శిక్షణకు వచ్చే వారికి పంపిణీ చేయాల్సిన సామగ్రి ముద్రించేందుకు రెండు సంస్థలతో కుదుర్చుకున్న రేట్ కాంట్రాక్టును పక్కనపెట్టారు. రంగుల్లో నాలుగు పేజీలు ముద్రించేందుకు బాలాజీ స్కాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు. వాస్తవానికి ఈ సంస్థతో ఉన్న రేట్ కాంట్రాక్ట్ ప్రకారం నాలుగు పేజీల బుక్‌లెట్ ముద్రణకు రూ.2,800, బైండింగ్ కోసం ఒక్కో దానికి రూ.7 చొప్పున చెల్లించాల్సి ఉంది. కానీ దీంతో సంబంధం లేకుండా నాలుగు పేజీల బుక్‌లెట్ ముద్రణకు రూ.3,800, బైండింగ్‌కు రూ.35 చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు. ఈ రకంగా బాలాజీ స్కాన్స్‌తోపాటు వైష్ణవి గ్రాఫిక్స్‌కు కలిపి మొత్తం రూ.4.74 కోట్లు చెల్లించారు. రేట్ కాంట్రాక్టుకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రూ.1.21 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ముద్రణా సామగ్రి పేరుతో ఎన్‌ఐఆర్‌డీలో ఇంకా అనేక అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో సంబంధం ఉందని భావించిన ఎన్‌ఐఆర్‌డీ అసోసియేట్ ప్రొఫెసర్ గుండబోలు రజనీకాంత్, ఎడిటర్ కొండవీటి పాపమ్మ, అకౌంట్స్ అధికారి గండి వెంకటస్వామి శ్రీధర్‌గౌడ్, బాలాజీ స్కాన్స్ యజమాని రామకృష్ణ ప్రసాద్, వైష్ణవి లేజర్స్ యజమాని సుధాకర్‌రెడ్డిలతోపాటు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 94వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు వివేకా సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే అనుమానితులతో పాటు వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులను విచారిస్తున్న సీబీఐ అధికారులు మరింత సమాచారం సేకరణలో భాగంగానే సుధీకర్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
* వివాహితను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించిన ఘటనలో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కాలనీకి చెందిన అరుణ్‌కుమార్ త్యాగి(47) స్థానికంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అందులో భాగస్వామిగా ఉన్న వివాహితను పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేశాడు. అనంతరం చేతులు కోసుకుని చనిపోతానంటూ బెదిరించాడు. బాధితురాలు జూన్ 26న జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకి పంపారు. అనంతరం జులై 28న బెయిలుపై బయటికి వచ్చిన నిందితుడు తిరిగి ఆమెను వేధించం మొదలు పెట్టాడు. కేసును వెనక్కి తీసుకోవాలని, తనని వివాహం చేసుకోవాలని.. లేదంటే చంపేస్తానంటూ బాధితురాలిని బెదిరించాడు. మరో మహిళకు సైతం ఫోన్‌లో అసభ్య సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఇరువురి ఫిర్యాదుతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
* ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో డీఆర్‌ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి లఖ్‌నవూకు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. విమానాశ్రయం నుంచి ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా దూసుకెళ్తున్న స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకొన్నారు. అనంతరం వారి నుంచి దాదాపు 9కిలోల బరువున్న 77 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరం నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్రమంగా బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులకు సమాచారం అందింది. ఆ బిస్కెట్లను లఖ్‌నవూలోని చౌదరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వారు ముజఫర్‌నగర్ వెళ్లే వ్యక్తులకు అందించనున్నట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన లఖ్‌నవూ డీఆర్‌ఐ అధికారులు అనుమానితులు విమానాశ్రయంలో అడుగు పెట్టగానే వారిపై నిఘా ఉంచారు. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు ఎస్‌యూవీలు హైస్పీడ్‌తో వెళ్తుండగా.. ఆ వాహనాలను ఛేజ్ చేసి అడ్డగించారు. రియాద్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులతో పాటు ఈ బిస్కెట్లను వారి నుంచి అందుకొనేందుకు వచ్చిన వ్యక్తులు వాహనాల్లో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి బెల్టులు, లోదుస్తుల్లో దాచి ఉంచిన మొత్తం 77 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపి ప్రధాన సూత్రధారిని లఖ్‌నవూలో అరెస్టు చేసినట్టు తెలిపారు. విమానాశ్రయం ద్వారా స్మగ్లర్లకు బంగారం అందించడంలో సహకరించిన కస్టమ్స్ అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.