Sports

జకోను ఓడించి…తొలి టైటిల్ గెలిచి

జకోను ఓడించి…తొలి టైటిల్ గెలిచి

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ అద్భుతం చేశాడు. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కేరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్‌ జకోవిచ్‌కు షాక్‌ ఇచ్చాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో 34 ఏళ్ల జకోవిచ్‌ను ఓడించి అతడి జోరుకు బ్రేకులు వేశాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్‌ ఇంకొన్ని రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే జకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామని ఉవ్విళ్లూరుతున్న జకోకు నిరాశే ఎదురైంది.

న్యూయార్క్‌ సిటీలోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో అభిమానుల కోలాహాలం మధ్య, అత్యంత ఉత్కంఠగా ఈ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు ఆడారు. తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్‌దే పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్‌ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 25 ఏళ్ల మెద్వెదెవ్‌ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో సెర్బియా యోధుడు జకోవిచ్‌ మొదట తేలిపోయినప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదెవ్‌ విజయాన్ని జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో మెద్వెదెవ్‌ 6-4 తేడాతో గెలిచాడు. దీంతో డానిల్‌ మెద్వెదెవ్‌ మూడో సెట్‌ను గెలిచి టెన్నిస్‌ చరిత్రలో తన కొత్త పేజీని ప్రారంభించాడు. 2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలైన ఈ రష్యా వీరుడు ఇప్పుడు టైటిల్‌ గెలిచి రేసులోకి వచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఒడిపోయి టైటిల్‌ గెలిచిన వీరుడిగా మెద్వెదెవ్‌ నిలిచాడు. మరోవైపు యూఎస్‌ ఓపెన్‌లో సింగిల్స్‌ విభాగంలో ఈసారి ఇద్దరు కొత్త ఛాంపియన్లు ఉద్భవించారు. మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రదుకాను విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.