టాలీవుడ్ మత్తు మందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దర్యాప్తు అగమ్యగోచరంగా తయారయింది. విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖుల నుంచి నిధుల బదిలీకి సంబంధించిన వివరాలు రాబట్టడం అసాధ్యంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ.. ఆరుగుర్ని విచారించినా నిధుల బదిలీపై ఆధారాలేవీ లభించలేదు. దాంతో కేసు పరిస్థితి చీకట్లో బాణం వేస్తున్నట్లుగా మారింది. 2017లో బయటపడిన మత్తుమందుల కేసులో ఆబ్కారీ అధికారులు నాలుగేళ్లు దర్యాప్తు జరిపి చివరకు ఏమీ లేదని తేల్చడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు రేకెత్తాయి. ఇప్పుడు ఈడీ దర్యాప్తు కూడా అలాగే ముగిసే పరిస్థితులు కనిపిస్తుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మత్తుమందుల సరఫరాలో ప్రధాన సూత్రధారి కెల్విన్‌తో టాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాలపై ఆబ్కారీశాఖ గతంలో దర్యాప్తు జరిపినప్పుడు తాను చాలామందికి డ్రగ్స్ అందజేసేవాడినని చెప్పాడు. ఆ వాంగ్మూలం ఆధారంగా వారందర్నీ పిలిచి విచారించారు. కానీ కెల్విన్ వారికి మత్తుమందులు సరఫరా చేసినట్లు కాని, వారు వాటిని వాడినట్లు కాని ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. చివరికి వారి రక్తం, గోళ్లు, వెంట్రుకల వంటి నమూనాలను విశ్లేషించినా మాదకద్రవ్యాల వినియోగంపై వీసమెత్తు ఆధారం కూడా లభించలేదు. దాంతో ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖుల పాత్రలేదని తేల్చేశారు. కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ కెల్విన్ ముఠాపైనే అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో కెల్విన్ ముఠాకు, టాలీవుడ్ ప్రముఖులకు మధ్య జరిగిన నిధుల బదిలీపై ఈడీ దృష్టి సారించింది. మత్తుమందుల వ్యాపారం అంటేనే అనేక చీకటి లావాదేవీలకు నిలయం. అక్రమంగా నగదు బదిలీలు జరుగుతాయి. ఇలాంటివి జరిగాయేమో తెలుసుకునేందుకే ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఇప్పటి వరకూ కెల్విన్ ముఠాకు, టాలీవుడ్ ప్రముఖులకు మధ్య నగదు బదిలీ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. పైగా విచారణకు హాజరవుతున్న వారు అసలు కెల్విన్ ఎవరో తమకు తెలియదనే సమాధానం చెబుతున్నారని సమాచారం. అందుకే అధికారులు అతడినీ పిలిపించి విచారణకు వచ్చిన వారితో కలిపి ప్రశ్నిస్తున్నారని, అయినా ప్రయోజనం కలగడంలేదని తెలుస్తోంది. దాంతో ఈడీ విచారణ అగమ్యగోచరంగా తయారయింది. ఈ కేసులో ఇంకా ఆరుగుర్ని విచారించాల్సి ఉంది. అది కూడా పూర్తయితే స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.
కెల్విన్‌ను గుర్తుపట్టని సినీ ప్రముఖులు?
Related tags :