DailyDoseMovies

అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కంగనకు కోర్టు హెచ్చరిక-నేరవార్తలు

అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కంగనకు కోర్టు హెచ్చరిక-నేరవార్తలు

* వంద రూపాయలు ఖాతాలో వేసి ఓ వస్తువు కొంటే లాభం వస్తుందని నమ్మించాడు. మళ్లీ కొనుగోలు చేయాలంటూ సూచించాడు. చివరకు భారీగా టోకరా వేశాడు ఓ సైబర్‌ కేటుగాడు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. షేక్‌పేట ఎన్‌ఎస్‌ఎఫ్‌ కాలనీలో నివసించే ప్రైవేటు ఉద్యోగి అబ్దుల్‌ సత్తార్‌ ఉద్యోగం కోసం అంతర్జాలంలో అన్వేషించారు. ఆదివారం ఈబే988.కామ్‌ను క్లిక్‌ చేశాడు. వెంటనే చరవాణికి ఒక వాట్సాప్‌ నంబరు నుంచి సంబంధిత వెబ్‌సైట్‌ వినియోగదారుల సేవా కేంద్రం నుంచి సందేశం వచ్చింది. ఓ వ్యక్తి మాట్లాడుతూ.. రోజుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు సులభంగా సంపాదించవచ్చని నమ్మించాడు. సత్తార్‌తో రూ.వందతో యాప్‌లోని వస్తువు కొనుగోలు చేయాలని సూచించాడు. కప్పులు కొనుగోలు చేయగా రూ.110 జమయ్యాయి. ఎంత కొంటే అంత ఎక్కువ నగదు వస్తుందని చెప్పడంతో అయిదారు లావాదేవీలు చేశారు. రూ.680తో వస్తువు కొనుగోలు చేశారు. డబ్బు తిరిగి రాకపోగా బ్యాంకు ఖాతా నిలిచిపోయింది. సంస్థ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించగా.. మరో అయిదు కొనుగోళ్లు చేస్తే ఖాతా తెరుచుకుంటుందని చెప్పడంతో గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ.55,000 విలువైన వస్తువులు కొనుగోలు చేశారు. అయినా ఖాతా తెరుచుకోలేదు. మొత్తం రూ.66,580 మోసపోయినట్లు గ్రహించి సోమవారం బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

* స్థల వివాదంలో న్యాయం కోరుతూ ఓ యువతి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. ఆ సమయంలో ఓ రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కార్యాలయ సిబ్బంది కొత్తగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి వివరాల ప్రకారం.. కొత్తగూడెం పరిధిలోని రామవరం ఏడో నెంబరు వీధిలో హైమావతి తన తల్లి సరళ, సోదరి అరుణ జ్యోతితో కలిసి నివాసం ఉంటోంది. తండ్రి వెంకటేశ్వర్లు సింగరేణి కార్మికుడిగా పనిచేసి మృతిచెందారు. వీరి ఇంటి పక్కనున్న వంద గజాల స్థలం విషయంలో పొరుగు కుటుంబంతో కొంతకాలంగా వివాదం జరుగుతోంది. గతేడాది డిసెంబరులో ప్రత్యర్థి తమపై దాడి చేయడంతో కేసు పెట్టామని, అయినా స్థానిక నాయకుడొకరు జోక్యం చేసుకుని న్యాయం జరగనివ్వడం లేదని బాధితురాలు ఆరోపించారు. సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఉదయం వచ్చిన ఆమె ఆందోళన చేసి.. అనంతరం రసాయన ద్రావణం తాగింది. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. తహసీల్దార్‌ పి.వి.రామకృష్ణ ప్రభుత్వాసుపత్రికి వచ్చి హైమావతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

* అడవి జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల ఉచ్చుకు ఇద్దరు వ్యక్తులు బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ములకలపల్లి అటవీ ప్రాంతంలో కొంతకాలంగా యథేచ్ఛగా అటవీ జంతువుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొందరు మాదారం ప్రాంతంలో విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేశారు. కాగా, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మొగరాలకుప్ప గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు వంటచెరుకు కోసం అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో పాయం జాన్‌బాబు(24), పకూరం దుర్గారావు(35)లు విద్యుత్‌ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో పాటు వెళ్లిన మిగతా ముగ్గురు అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్‌ తీగలను తొలగించారు. అనంతరం మృతదేహాలను అటవీ ప్రాంతం నుంచి ములకలపల్లి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* తండ్రీ, కుమారుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ కాలనీలో చోటు చేసుకుంది. మూడు రోజుల కిందట తండ్రి కార్తీక్, నాలుగేళ్ల కుమారుడు హరీశ్‌ను తీసుకొని స్నాక్స్‌ తీసుకొస్తానని ఇంటి నుంచి బయటి వెళ్లాడు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు కోర్టు మరోసారి షాక్‌ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్‌ అఖ్తర్‌ వేసిన డిఫమేషన్‌ కేసులో గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్‌ వారెస్ట్‌ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు.