* స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్. ఈసారి పండుగ సీజన్‌లో కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లు.. రకరకాల ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు పరిశ్రమ నిపుణులు. సాధారణంగా ఏటా పండుగ సీజన్ (సెప్టెంబర్ నుంచి జనవరి వరకు)లో మార్కెట్ అంతా సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. ధరల తగ్గింపుతో సందడిగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ సంబురం అంతంత మాత్రమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చితే కొత్త ఫోన్ల రాక తక్కువేనంటున్నారు. పైగా ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ధరలు 7 నుంచి 10 శాతం మేర పెరిగేందుకు వీలున్నదన్న సంకేతాలిస్తున్నారు. కరోనా మొదలైన దగ్గర్నుంచి సరఫరాలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని, ఏడాదిన్నరగా ఇంతేనని షియామీ అంటున్నది.
* ఐఫోన్ ప్రియులు ఆసక్తిగా వేచిచూస్తున్న తరుణం వచ్చేసింది. టెక్ దిగ్గజం యాపిల్ మంగళవారం కొత్త ఐఫోన్ 13 మోడల్స్‌ను ఆవిష్కరించింది. ప్రతీ ఏడాదిలానే ఈ సెప్టెంబర్ 14న కాలిఫోర్నియాలో జరిగిన ‘యాపిల్ ఈవెంట్’లో ఐఫోన్ 13 శ్రేణిని విడుదల చేశారు. గతేడాది వచ్చిన ఐఫోన్ 12 మోడల్‌తో పోల్చితే 13లో కొద్దిపాటి మార్పులు చేశారు. కెమెరా సెన్సార్, మెరుగైన అల్ట్రావైడ్ కెమెరాల్ని అమర్చారు. ఐఫోన్ 13(6.1 అంగుళాలు), ఐఫోన్ 13 మిని (5.4 అంగుళాలు)ల్లో 128 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఐఫోన్ 13 ప్రొ(6.1 అంగుళాలు), ఐఫోన్ ప్రొ మ్యాక్స్(6.7 అంగుళాలు) 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వెర్షన్లతో విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి ముందస్తు బుకింగ్‌లు. 24 నుంచి అందుబాటులోకి వస్తాయి
* పెట్రోల్, డీజిల్‌పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రధాన ఇంధనాలతో పాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుచేసే ప్రతిపాదనను సెప్టెంబర్ 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నుపై పన్ను వేసే విధానానికి ముగింపుపలకాలంటే ఈ ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చడమే పరిష్కారమని ఉన్నతస్థాయి అధికార వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇంధనాల ఉత్పత్తి వ్యయంపైనే కాకుండా, కేంద్రం విధించే ఎక్సయిజు సుంకంపై కూడా రాష్ర్టాలు వ్యాట్‌ను వసూలుచేస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్‌ను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే నిర్ణయాన్ని తీసుకోవాలంటూ జూన్ నెలలో కేరళ హై కోర్టు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని వచ్చే జీఎస్టీ కౌన్సిల్ ముందు ఉంచనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
* ఎస్బీఐ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని బేస్‌రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో బేస్‌రేటు 7.45 శాతానికి పరిమితమైంది. బేస్‌రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటు మరింత తగ్గనున్నది. దీంతోపాటు ప్రైమ్ లెండింగ్ రేటుని కూడా 5 బేసిస్ పాయింట్లు కోత విధించడంతో రుణరేటు 12.20 శాతానికి పరిమితమైంది.
* ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ.. రాజ్య భాష కీర్తి పురస్కార్ అవార్డును దక్కించుకుంది. మంగళవారం రాజ్య భాష దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాంక్ చేతుల మీదుగా ఎన్‌ఎండీసీ ఈడీ షణ్ముగనాథం అందుకున్నారు.
* మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ మరో రికార్డును సృష్టించింది. 16 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కార్లు మొత్తంగా ఇప్పటి వరకు 25 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాల్లో దూసుకుపోయిన స్విఫ్ట్.. ఇప్పటి వరకు 2.5 మిలియన్లకు పైగా అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ కారును వినియోగిస్తున్న వారిలో 52 శాతానికి పైగా మంది 35 ఏండ్లలోపు వారు కావడం గమనార్హం. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన మాన్యువల్, ఆటో గేర్ షిప్ట్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఈ కారు 23.20 నుంచి 23.76 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.