ScienceAndTech

JEE-Mainsలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు-తాజావార్తలు

JEE-Mainsలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు-తాజావార్తలు

* తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్న మ‌లబార్ గ్రూప్ తెలిపింది. తమ గ్రూప్స్ కు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరీ మాన్యుఫాక్చరింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మొత్తం రూ. 750 కోట్ల పెట్టుబ‌డిని తెలంగాణలో పెట్టనున్నట్టు, ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్‌ల‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మ‌లబార్ గ్రూప్ తెలిపింది.

* దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం.. 27,176 కొత్త కేసులు, 284 మరణాలు సంభవించాయి. క్రితం రోజుతో పోల్చితే రోజువారీ కేసుల్లో 7 శాతం పెరుగుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కేసుల సంఖ్య 30 వేలకు దిగువనే నమోదైంది. కేరళలో 15,876, మహారాష్ట్రలో 3,530 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. సగానికిపైగా కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూస్తుండటం గమనార్హం.

* ఏపీ ఫైబర్ నెట్ కేసును బుధవారం రెండో రోజు సీఐడీ విచారణ చేపట్టింది. రెండో రోజు సీఐడీ విచారణకు వేమూరి హరిప్రసాద్‌ హాజరయ్యారు. మంగళవారం వేమూరితో పాటు ఇన్ కాప్ మాజీ ఎండి సాంబశివరావుని కూడా సీఐడీ విచారించింది. నోటీసులు అందుకున్న ముగ్గురిలో నిన్న ఇద్దరు విచారణకు హాజరయ్యారు. సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఫైబర్ నెట్ కుంభకోణంలో ఆ-1 వేమూరి హరిప్రసాద్, ఎ-2 మాజీ ఎండి సాంబశివరావు.. టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడంపై సీఐడీ ప్రశ్నించింది. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీఐడీ మొత్తం19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మిగిలిన నిందితులకి సీఐడీ నోటీసులు జారీ చేయనుంది.

* జేఈఈ మెయిన్స్ (JEE Mains) ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. 100 ప‌ర్సంటైల్ సాధించి మొద‌టి ర్యాంకు పొందిన 18 మందిలో తెలంగాణకు చెందిన ఇద్ద‌రు విద్యార్థులు ఉన్నారు. కొమ్మ శ‌రణ్య‌, జోష్యుల వెంక‌ట ఆదిత్య 100 ప‌ర్సంటైల్ సాధించి మొద‌టి ర్యాంకులో నిలిచారు.జేఈఈ మెయిన్స్ నాలుగో విడత ఫలితాలను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. మొత్తం 9,34,602 మంది విద్యార్థులు మెయిన్స్‌ పరీక్ష రాశారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుగ్గినేని వెంక‌ట‌ ప‌నీష్‌, ప‌స‌ల వీర‌శివ‌, కుంచ‌న‌ప‌ల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్‌ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు​ 26, 27, 31, సెప్టెంబర్​ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతి, అస్సామీస్‌, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు.

* ప్రైవేట్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగ సమయంలో కంపెనీ ఇచ్చిన క్రెడిట్‌ కార్డును, చెక్కులను కంపెనీకి సరెండర్‌ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఉపయోగించాడు. 20 రోజుల్లో స్నేహితుడితో కలిసి రూ.7 కోట్లు గోవాలో ఖర్చుచేసిన నిందితుడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* ట్రిబ్యున‌ళ్ల‌లో నియామ‌కాల‌పై ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ తీవ్రంగా మండిప‌డింది సుప్రీంకోర్టు. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్ర‌మే తీసుకోవ‌డంపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రెండు వారాల్లో ట్రిబ్యున‌ల్ నియామ‌కాలు మొత్తం పూర్తవ్వాల‌ని, ఎవ‌రినైనా నియ‌మించ‌క‌పోతే కార‌ణం చెప్పాల‌ని ఆదేశించింది. మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం. మీరు క‌చ్చితంగా చ‌ట్టాన్ని అనుస‌రించాల్సిందే అని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు.

* కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీ ( Rahul Gandhi ) మ‌రోసారి అధికార బీజేపీపైన‌, ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్‌పైన నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు ప‌నికిరానివ‌ని, వాటితో పోల్చుకుంటే కాంగ్రెస్ సిద్ధాంతం చాలా భిన్న‌మైన‌ద‌ని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బుధ‌వారం జ‌రిగిన మ‌హిళ కాంగ్రెస్ స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న.. ఒక కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌గా తాను ఏ పార్టీ సిద్ధాంతంతోనైనా కాంప్ర‌మైజ్ కాగ‌ల‌నుగానీ.. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాల‌తో మాత్రం ఎప్ప‌టికీ కాంప్ర‌మైజ్ కాబోన‌ని చెప్పారు.

* మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండోరోజు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కొనసాగుతున్నది. విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో ఆయన హత్యకు గల కారణాలను సీబీఐ సేకరిస్తున్నది. ఈ క్రమంలో వివేకానందరెడ్డి ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీశారు. అనంతరం కొలతలు వేశారు. నిన్న సాయంత్రం ప్రారంభించిన సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

* పంజాగుట్ట నిమ్స్‌లో ఇవాళ‌ ఓ రోగికి గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్స చేయ‌నున్నారు. మ‌ల‌క్‌పేట య‌శోద ఆస్ప‌త్రి నుంచి నిమ్స్‌కు బుధ‌వారం ఉద‌యం గ్రీన్ చానెల్ ద్వారా ప్ర‌త్యేక అంబులెన్స్‌లో గుండెను త‌ర‌లించారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి.. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి నుంచి గుండెను సేక‌రించారు.

* తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యుల వివరాలను సాయంత్రం తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగింది. ఏపీ నుంచి పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గొర్ల బాబూరావు, మధుసూదన్‌ యాదవ్‌, తెలంగాణ నుంచి మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, జీవన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, పార్థసారథిరెడ్డి, మారం శెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్‌రావు, తమిళనాడు నుంచి శ్రీనివాసన్‌, ఎమ్మెల్యే నందకుమార్‌, కన్నయ్య, కర్నాటక నుంచి శశిధర్‌, ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి, మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు అవకాశం కల్పించారు. మారుతి, సౌరభ్‌ , కేతన్‌ దేశాయ్‌, శ్రీనివాసన్‌ పేర్లు పాలకమండలి సభ్యుల జాబితాలో ఉన్నట్టు సమాచారం.

* డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖ విచారణలో చాలా మందిని తప్పించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఎక్సైజ్‌ శాఖ తూతూ మంత్రంగా విచారణ జరిపిందని ఆయన ఆక్షేపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

* హైదరాబాద్‌లో జరిగిన బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ స్పందించే వరకూ చిన్నారి ఇంటివద్ద దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇది పోలీసుల వైఫల్యం కాదా?ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ఆమె ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

* టెలికాం రంగంలో కేంద్రం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆటోమేటిక్‌ రూట్‌లో ఈ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది. టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

* ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. సభ్యుల ఎంపిక విధానాన్ని తప్పుబట్టింది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ తాము ఎంతో కష్టపడి దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు చేసి, కొందరి పేర్లను సిఫార్సు చేస్తే.. వాటిని కేంద్రం పక్కనబెట్టడంపై ఆగ్రహించింది.