Business

ఓలా విద్యుత్ స్కూటర్లకు భారీ డిమాండ్

ఓలా విద్యుత్ స్కూటర్లకు భారీ డిమాండ్

పర్యావరణ హిత ప్రయాణంలో భాగంగా ఓలా సంస్థ తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారత్‌లో భారీ స్పందన లభిస్తోంది. విద్యుత్తు స్కూటర్ల విక్రయాలు ప్రారంభించిన తొలి రోజునే రికార్డు స్థాయి అమ్మకాలు సొంతం చేసుకుంది. అమ్మకాలు మొదలుపెట్టిన బుధవారం ఒక్కనాడే రూ.600 కోట్ల విలువైన స్కూటర్లను అమ్మినట్లు సంస్థ వెల్లడించింది. వీటి అమ్మకాలను గురువారం అర్థరాత్రితో ముగిస్తామని ప్రకటించింది.

‘ఎలక్ట్రిక్‌ వాహనాలకు కట్టుబడిన భారత్‌.. పెట్రోల్‌ను తిరస్కరిస్తోంది! గరిష్ఠంగా సెకనుకు 4 స్కూటర్లను అమ్మాము. ఇలా ఒక్క రోజులోనే రూ.600కోట్ల విలువైన స్కూటర్లను విక్రయించాం. ఈ రోజు అర్థరాత్రితో అమ్మకాల ప్రక్రియ ముగుస్తుంది’ అని ఓలా సహవ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అమ్మకాలు మొదలుపెట్టిన తొలిరోజునే ఊహించని సంఖ్యలో బుకింగ్స్‌ వచ్చాయని అని అన్నారు. 2వీలర్‌ ఇండస్ట్రీలో అమ్మకాలకు ఈ విధమైన స్పందన రావడం గొప్పవిషయమని అభిప్రాయపడ్డారు. ఎస్‌1, ఎస్‌1 ప్రో స్కూటర్ల కోసం ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి నేటితో గడువు ముగుస్తుందని భవీష్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అయితే, భారీ స్పందన ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎన్ని బుకింగ్స్‌ వచ్చేయనే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.

ఓలా స్కూటర్‌ ఎస్‌1, ఎస్ 1 ప్రో వేరియంట్లలో 10రంగుల్లో అందుబాటులో లభ్యం కానుంది. ఈ స్కూటర్ల కొనుగోలు ప్రక్రియను ఓలా యాప్‌లోనే పూర్తి చేయవచ్చు. ఇప్పటికే రూ. 499 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం క్రమంలో విక్రయాలు చేస్తున్నారు. అయితే, డిమాండ్‌ నేపథ్యంలో ప్రస్తుతం రూ.20వేలు చెల్లించాలని.. మిగతా మొత్తం డెలివరీ సమయంలో చెల్లిస్తే సరిపోతుందని ఓలా సంస్థ వెల్లడించింది. అక్టోబ‌ర్‌ 22 నుంచి ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల డెలివ‌రీలు ప్రారంభ‌మ‌వుతాయి.