Business

గృహరుణాలపై SBI బంపర్ ఆఫర్-వాణిజ్యం

గృహరుణాలపై SBI బంపర్ ఆఫర్-వాణిజ్యం

* దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోంలోన్ ( SBI Home Loan ) కోసం చూస్తున్న వాళ్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. హోంలోన్‌పై వడ్డీ రేటును 6.7 శాతానికి త‌గ్గించింది. అంతేకాదు ఎంత లోన్ తీసుకున్నా.. ఇదే వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఇలా ఒకే రేటుకు హోంలోన్లు ఇవ్వ‌డం ఇదే తొలిసారి. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. దేశంలో పండుగ‌ల సీజ‌న్‌కు ముందు ఇళ్లు కొనాల‌నుకుంటున్న వారిని ఆక‌ర్షించ‌డానికి ఎస్‌బీఐ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇది ఎలా ల‌బ్ధి చేకూర్చ‌నుందో కూడా బ్యాంకు వివ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రైనా రూ.75 ల‌క్ష‌ల హోంలోన్ తీసుకుంటే.. 7.15 శాతం వ‌డ్డీ క‌ట్టాల్సి వ‌చ్చేది. ఈ తాజా ఆఫ‌ర్‌తో ఏకంగా 45 బేసిస్ పాయింట్లు త‌గ్గింది. దీనివ‌ల్ల రూ.75 ల‌క్ష‌ల లోన్‌, 30 ఏళ్ల వ్య‌వ‌ధిపై రూ.8 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌డ్డీ మిగులుతుంది అని ఎస్‌బీఐ తెలిపింది. గ‌తంలో ఉద్యోగుల‌కు, ఉద్యోగేత‌రుల‌కు వేర్వేరు వ‌డ్డీ రేట్లు ఉండేవి. ఉద్యోగేత‌రులైతే ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి వ‌చ్చేది. ఈ తాజా నిర్ణ‌యం వ‌ల్ల ఉద్యోగేత‌రులు కూడా త‌మ వ‌డ్డీ రేటుపై 15 బేసిస్ పాయింట్లు ఆదా చేసుకోవ‌చ్చు అని బ్యాంక్ చెప్పింది. ఇన్నాళ్లూ హోంలోన్ వ‌డ్డీ రేట్ల‌పై ఆఫ‌ర్లు ఇచ్చినా.. అది సాధార‌ణంగా కొంత‌ మొత్తం లోన్ వ‌ర‌కూ, లోన్ తీసుకునే వారి వృత్తికి అనుగుణంగా ఉండేవి. ఈసారి మాత్రం అంద‌రికీ ఆఫ‌ర్ వ‌ర్తించేలా నిర్ణ‌యం తీసుకున్నాం అని ఎస్‌బీఐ రీటెయిల్ అండ్ డిజిట‌ల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి చెప్పారు. ఇన్నాళ్లూ కేవ‌లం బ‌డ్జెట్ ఇళ్ల‌ను తీసుకునే వారినే ప్రోత్స‌హించినా.. తాజా నిర్ణ‌యం ఎలాంటి బ‌డ్జెట్ వారికైనా ల‌బ్ధి చేకూర్చ‌నుంది.

* కార్పొరేట్ రంగంలో ముఖ్యంగా ఐటీలో ఉద్యోగుల‌ వ‌ల‌స‌ల రేటు అత్య‌ధికంగా ఉండ‌టంతో నైపుణ్యాలు క‌లిగిన టెకీల‌ను కాపాడుకునేందుకు కంపెనీలు టాప్ పెర్ఫామ‌ర్స్‌కు న‌జ‌రానాలు ప్ర‌క‌టిస్తున్నాయి. క్వార్ట‌ర్లీ ప్ర‌మోష‌న్లు, ప్ర‌త్యేక వేత‌న పెంపులు, ఎక్క‌డి నుంచైనా ప‌నిచేసే వెసులుబాటు, ఉన్న‌త విద్య కోసం ప్రోత్స‌హ‌కాలు వంటి ప‌లు ఆఫర్ల‌తో ఉద్యోగుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. కాగ్నిజెంట్‌, పెర్సిస్టెంట్ సిస్ట‌మ్స్‌, టాటా స్టీల్‌, ఆర్‌పీజీ గ్రూప్‌, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్పొరేట్ దిగ్గ‌జాలు కీల‌క నైపుణ్యాలు క‌లిగిన ఉద్యోగుల‌ను నిల‌బెట్టుకునేందుకు వారికి అనూహ్య‌మైన అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నాయి. ఈ ఏడాది భార‌త్‌లో 66 శాతం మంది ఉద్యోగులు తాము ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న ఉద్యోగం నుంచి మార్పు కోరుతున్నార‌ని మైక్రోసాఫ్ట్ చేప‌ట్టిన స‌ర్వే నివేదిక పేర్కొంది. భార‌త్‌లో ఈ ఏడాది అన్ని రంగాల్లోనూ స‌గ‌టున ఉద్యోగుల నిష్క్ర‌మ‌ణ రేటు ద‌శాబ్ధంలోనే గరిష్టంగా 20 శాతం ఉంద‌ని ఏఒన్ ఇండియా వేత‌న పెంపు స‌ర్వే సైతం వెల్ల‌డించింది.

* ఆటోమొబైల్‌, డ్రోన్‌ పరిశ్రమల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించేక్రమంలో కేంద్ర క్యాబినెట్‌ భారీ ప్రోత్సాహక పథకానికి పచ్చజెండా ఊపింది. రూ.26,058 కోట్ల విలువైన ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) స్కీమును క్యాబినెట్‌ ఆమోదించిందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. క్యాబినెట్‌ సమావేశం అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు అమలులో ఉండే ఈ స్కీము కారణంగా ఆటోమొబైల్‌, ఆటో విడిభాగాల పరిశ్రమ రూ.42, 500 కోట్లు తాజాగా పెట్టుబడి చేస్తుందని అంచనావేస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.2.3 లక్షల కోట్ల విలువైన అదనపు ఉత్పత్తి జరుగుతుందని, 7.5 లక్షలకుపైగా అదనపు ఉపాధి కలుగుతుందని భావిస్తున్నామన్నారు. 2021-22 బడ్జెట్లో ప్రతిపాదించిన 13 రంగాలకు ప్రతిపాదించిన రూ.1.97 లక్షల కోట్ల పీఎల్‌ఐ స్కీముల్లో భాగంగా ఆటోమొబైల్‌, ద్రోన్‌ పరిశ్రమలకు తాజాగా ప్రోత్సాహకాల్ని ప్రకటించారు. ఈ స్కీములో రెండు విభాగాలున్నాయి. అవి… చాంపియన్‌ ఓఈఎం ఇన్సెంటివ్‌ స్కీమ్‌: ఇది అమ్మకాల విలువతో అనుసంధానమైన పథకం. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలు, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ వాహనాలకు వర్తిస్తుంది.కాంపోనెంట్‌ చాంపియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌: ఇది కూడా అమ్మకాల విలువతో అనుసంధానమైనదే. వాహనాల అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కాంపొనెంట్స్‌, వివిధ వాహనాల సీకేడీ, ఎస్‌కేడీ కిట్స్‌కు వర్తిస్తుంది.ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ఇటీవల ప్రకటించిన రూ.10,000 కోట్ల పీఎల్‌ఐ స్కీము, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ తయారీకి ప్రారంభించిన రూ.18,100 కోట్ల పీఎల్‌ఐ స్కీములకు తాజా స్కీము అదనమని మంత్రి ఠాకూర్‌ వివరించారు.

* బ్యాడ్‌ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) జారీచేసే సెక్యూరిటీ పత్రాలకు ప్రభుత్వ గ్యారంటీని ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌బ్యాంకుల నుంచి కొనుగోలుచేసే మొండి బకాయిల విలువలో 15 శాతం నగదుగానూ, 85 శాతం ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిన సెక్యూరిటీ పత్రాల రూపంలోనూ చెల్లించనుంది. నిర్ణీతకాలంలో బ్యాంకులు బ్యాడ్‌ బ్యాంక్‌కు అప్పగించే మొండి బకాయి విలువలో తగ్గుదల ఏర్పడితే ప్రభుత్వ గ్యారంటీగా వున్న సెక్యూరిటీ ద్వారా బ్యాంకు నగదుగా మార్చు కుంటుంది. ప్రభుత్వ గ్యారంటీలు రూ.31,000 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. బ్యాంకుల మొండి బకాయిల్ని కొనుగోలు చేసేందుకు ఈ బ్యాడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటుచేసే బాధ్యతను ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)కు అప్పగించారు. రూ.6,000 కోట్ల మూలధనంతో ఎన్‌ఏఆర్‌సీఎల్‌ను నెలకొల్పేందుకు ఇప్పటికే రిజర్వుబ్యాంక్‌కు ఐబీఏ దరఖాస్తుచేసింది.

* రుణభారంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం రంగం కోరుకుంటున్నట్లుగానే కేంద్రం భారీ ప్యాకేజీకి ప్రకటించింది. ముఖ్యంగా రూ.1 లక్ష కోట్లకుపైగా ఉన్న ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి ఈ రంగానికి పెద్ద ఊరట లభించింది. దివాలా అంచున ఉన్న వొడాఫోన్‌ ఐడియా మనుగడకు తాజా ప్యాకేజీ ఉపకరించి, దేశంలో మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు, ఒక ప్రభుత్వ కంపెనీ ఆరోగ్యకరంగా పోటీపడే వీలు కలుగుతుంది. ఏజీఆర్‌ నిర్వచనాన్ని హేతుబద్దీకరణ, నూరుశాతం ఎఫ్‌డీఐ, బకాయిల చెల్లింపుపై మారటోరియం తదితర నిర్ణయాల్ని క్యాబినెట్‌ తీసుకున్నదని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. ఈ రంగంలో 9 వ్యవస్థాగత సంస్కరణల్ని చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెలికం రంగంపై తీసుకున్న నిర్ణయాల్ని వివరించారు.

* కొద్దిరోజుల విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. టెలికం, ఆటో రంగాలకు కేంద్రం ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 476 పాయింట్లు ర్యాలీ జరిపి 58,723 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 139 పాయింట్లు జంప్‌చేసి 17,519 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రెండు సూచీలకు ఇవి చరిత్రాత్మక గరిష్ఠాలు. సెన్సెక్స్‌-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఎన్టీపీసీ 7 శాతం ర్యాలీచేయగా, ఐటీ షేర్లు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నూతన గరిష్ఠస్థాయిల వద్ద క్లోజయ్యాయి. టెలికం, ఆటో పరిశ్రమలకు ప్రకటించిన చర్యలు వృద్ధికి దోహదపడతాయని, టెలికం కంపెనీల రుణ భారం బ్యాంకులకు తగ్గనున్నందున, ఈ రంగానికి కూడా కేంద్ర ప్రతిపాదనలు ప్రయోజనకరమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయకుమార్‌ చెప్పారు.