* గత ఏడాదిన్నర కాలంలో (18 నెలలు) వృద్ధి ఆధారిత సాంకేతిక (టెక్) కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాయని సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగీ తెలిపారు. మరో రూ.30,000 కోట్ల సమీకరణకు ఈ తరహా కంపెనీలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ‘అంకురాల వ్యవస్థలో యూనికార్న్‌ల సంఖ్య పెరుగుతుండటం.. మన ఆర్థిక వ్యవస్థలో కొత్త తరం సాంకేతికత కంపెనీల వృద్ధిని సూచిస్తోంది. తక్షణమే లాభాలు ఆర్జించడం కంటే.. శరవేగంగా వృద్ధిని సాధించడంపై అవి దృష్టి సారిస్తున్నాయ’ని సీఐఐ సమావేశంలో ఆయన చెప్పారు. ఐపీఓల ద్వారా సుమారు రూ.30,000 కోట్లు సమీకరించేందుకు అనుమతులు కోరుతూ, దరఖాస్తులు సెబీ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. ‘అంకుర సంస్థల్లో తొలుత ఐపీఓకు వచ్చిన సంస్థ జొమాటో. ఈ ఐపీఓ విజయవంతం కావడంతో పేటీఎం, పాలసీ బజార్, మొబిక్విక్, నైకా లాంటి మరిన్ని సాంకేతిక సంస్థలు పబ్లిక్ ఇష్యూ నిమిత్తం సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. 2019-20లో పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.21,000 కోట్లు సమీకరిస్తే.. 2020-21లో రూ.46,000 కోట్ల మేర నిధుల సమీకరణ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే ఇంచుమించు ఈ స్థాయిలో నిధులను కంపెనీలు సమీకరించాయ’ని వివరించారు.
* మార్కెట్ల లాభాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. శుక్రవారం ఆరంభంలో అదరగొట్టిన సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ సానుకూల సంకేతాలతో జీవనకాల గరిష్ఠాలకు చేరుకున్న సూచీలు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. కొద్దిసేపు ఊగిసలాట ధోరణి కనబరిచినప్పటికీ.. చివరి గంటలో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ కీలక మైలురాయైన 59,000, నిఫ్టీ 17,500 మాత్రం నిలపుకొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.48 వద్ద ముగిసింది.
* ఎగుమతుల ఉత్పత్తుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారీ ఎగుమతులతో ఆర్థికంగా వివిధ పరిశ్రమలు మరింతగా నిలదొక్కుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. కాగా, రకరకాల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్న మేడ్చల్ జిల్లా.. తెలంగాణ రాష్ట్రంలోనే ఎగుమతుల పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. ఏరోస్పేస్, డ్రిల్లింగ్ మైనింగ్ పరికరాలు, ఫార్మా, బయోటెక్, విత్తనాలు, ఆహార పదార్థాలను అమెరికా, బ్రెజిల్, జర్మనీ, బ్రిటన్, రష్యా, చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఇక్కడి కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 24న పారిశ్రామికవేత్తలతో మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్ అసోసియేషన్ భవనంలో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరుగనున్నది. కలెక్టర్ హరీశ్ నేతృత్వంలో జరిగే ఈ మీటింగ్‌లో ఉత్పత్తుల పెంపు, పరిశ్రమలకు ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహంపై ప్రధానంగా చర్చ జరుగనున్నది. మేడ్చల్ జిల్లా నుంచి వివిధ దేశాలకు గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.12,062 కోట్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.14,775 కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు వచ్చా యి. దీంతో 2.25 లక్షల మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలు దక్కాయి.
* బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా తమ రిటైల్ రుణగ్రహీతల కోసం గురువారం పలు ఆఫర్లను ప్రకటించింది. గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.25 శాతం మేర తగ్గించింది. హోమ్ లోన్‌పై వడ్డీరేటు 6.75 శాతంతో, కార్ లోన్‌పై 7 శాతంతో మొదలవుతుందని బ్యాంక్ ఈ సందర్భంగా తెలిపింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజునూ తొలగిస్తున్నట్లు చెప్పింది. తక్షణమే రుణాలు మంజూరు కావడం కోసం కస్టమర్లు బీవోబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, వెబ్‌సైట్‌ను వాడుకోవచ్చని బీవోబీ మార్ట్‌గేజెస్, ఇతర రిటైల్ ఆస్తుల విభాగం జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి ఓ ప్రకటనలో తెలియజేశారు.
* ఉత్పత్తిలో సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. భారీ వర్షాలతో ఈ నెల ప్రథమార్ధంలో రోజుకు 1.85 లక్షల టన్నులకుగాను 1.43 లక్షల టన్నుల ఉత్పత్తే సాధ్యమైందన్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ప్రతిరోజూ 1.85-1.9 లక్షల టన్నులు, డిసెంబర్‌లో రోజూ 2 లక్షల టన్నులు, జనవరి-మార్చిలో 2.20 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి సాధించేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, విదేశీ బొగ్గు ధర విపరీతంగా పెరగడంతో దేశీయ బొగ్గుకు డిమాండ్ నెలకొన్నదని, కాబట్టి అధిక ఉత్పత్తికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
* గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 46 వేల దిగువకు చేరుకున్నది. కిలో వెండి సైతం ఏకంగా రూ. 720 తగ్గి రూ.61,540 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.300 చౌకై రూ.48 వేలకు, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.300 తగ్గి రూ.44 వేల వద్ద ఉన్నది. వెండి మాత్రం రూ.100 పెరిగి రూ. 67,800 పలికింది.