DailyDose

అమీర్‌పేటలో ఇన్‌స్టంట్ గంజాయి కేఫ్-నేరవార్తలు

అమీర్‌పేటలో ఇన్‌స్టంట్ గంజాయి కేఫ్-నేరవార్తలు

* ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత – టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట – జోగి రమేశ్ కారుపై దాడికి యత్నం – బుద్దా వెంకన్న జోగి రమేష్ మధ్య తోపులాట – నిన్న జగన్‍పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు – అయ్యన్న కామెంట్స్ పై జోగిరమేష్ ఆగ్రహం

* అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విదేశీ కరెన్సీ భారీగా పట్టుబడింది. ఈ సోదాల్లో మొత్తం 9 విలాసంతమైన కార్టు, 5 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి మంత్రిగా పని చేసిన కేసీ వీరమణి.. భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మాజీ మంత్రి ఇల్లు, ఆఫీస్, బంధువుల ఇళ్లు సహా మొత్తం 35 ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో కోట్లలో విలువైన ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు. 5 కేజీల బంగారం, 47 గ్రాముల డైమండ్స్, 7.2 కేజీల వెండి, రోల్స్ రాయిస్ సహా 9 విలాసవంతమైన కార్లు, 34 లక్షల నగదు, 1.8 లక్షల విదేశీ కరెన్సీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

* గంజాయి ముఠాలు కొత్త ట్రెండ్స్‌ సృష్టిస్తున్నాయి. గతంలో తెలిసిన మధ్యవర్తుల ద్వారా గుట్టుగా గంజాయి సరఫరా చేసిన గ్యాంగులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ‘దుకాణాలు’ తెరుస్తున్నాయి. ఇన్‌స్ట్రాగ్రాం గ్రూపుల ద్వారా వలవేసి, ఫైన్‌ క్వాలిటీ పొడి గంజాయిని అందిస్తున్నాయి. మత్తులో జోగేందుకు ఏకంగా గంజాయి కేఫ్‌లు సైతం పెట్టేస్తున్నాయి. ఇదంతా నగరంలో అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట ఏరియాలో కావడం గమనార్హం. గంజాయి మత్తులో జోగుతున్నవారిలో ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, పలువురు ధనవంతుల పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశాలతో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పవన్‌ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇన్‌స్పెక్టర్‌ బీ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో ఈ నెల 14న అమీర్‌పేట, లా కాలేజీ రోడ్డు, ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడులు నిర్వహించింది. అక్కడ ఒక ఫ్లాట్‌లో గంజాయి కేఫ్‌ నిర్వహిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. ఘటన స్థలంలో ఐదు కిలోల పొడి గంజాయితోపాటు గంజాయి సరఫరా చేస్తున్న జీ వరుణ్‌చందర్‌, జీ చంద్రశేఖర్‌, వీ కృష్ణప్రసాద్‌, వై రమేశ్‌లను అరెస్టు చేశారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న కీలక వ్యక్తి ఆదిత్యను స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం గురువారం ఉదయం అమీర్‌పేట సమీపంలోనే అరెస్టు చేసింది. అతడు ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి గంజాయిపొడిని తెప్పిస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒక్కో పొట్లం రూ.వెయ్యికి కస్టమర్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.

* సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజు కుటుంబసభ్యులు, పలు ప్రజా సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందించారు. రాజు ఆత్మహత్యపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు. ‘‘గ్యాంగ్‌మన్‌ కూడా నిందితుడు ట్రాక్‌పై తిరగడం చూశారు. రాజు రైలు కింద పడటం రైతులు సహా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారు. కోణార్క్‌ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులు. ఈ ఘటనలో ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిరాధార ఆరోపణలు తగదు’’ అని డీజీపీ అన్నారు.