* కరోనా మహమ్మారి దెబ్బతో అనేక రంగాలు కుదేలయ్యాయి. అనేక మంది ఉపాధి కోల్పోయారు. కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. అయితే, దాదాపు ఏడాదిన్నర గడిచిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అప్రమత్తంగా వ్యవహరించిన కంపెనీలు.. తాజాగా భారీ ఎత్తున నియామకాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మంచి వేతనాలిచ్చి నియమించుకుంటున్నాయి.
* పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్ని అజెండాలో చేర్చి చర్చించామని వివరించారు. లఖ్‌నవూలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ అనంతరం కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేదిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
* సీరమ్ ఇన్‌స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ (ఎస్‌ఐఎల్‌ఎస్), బయోకాన్ బయోలాజిక్స్ (బీబీఎల్) మధ్య కుదిరిన ఒప్పందం ఫలితంగా, ఇరు కంపెనీలు కలిసి అంటురోగాలపై మరింత ప్రభావవంతంగా పోరాడతాయని బీబీఎల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్‌కు 15 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నట్లు బయోకాన్ బయోలాజిక్స్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వాటాకు ప్రతిగా 15 ఏళ్ల పాటు ఏటా 10 కోట్ల టీకా డోసులను బీబీఎల్ పొందుతుంది. ఈ భాగస్వామ్యంపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అధర్ పూనావాలా మాట్లాడుతూ ‘10 కోట్ల టీకా డోసులనేది కనీసం మాత్రమే. అవకాశాలు అపరిమితంగా ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి ముడి పదార్థాల వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామ’ని అన్నారు. బయోకాన్ అనుబంధ సంస్థ బీబీఎల్ కాగా, సీసీఐ అనుబంధ సంస్థ ఎస్‌ఐఎల్‌ఎస్ అన్న సంగతి తెలిసిందే.
* ఆధార్‌తో పాన్ అనుసంధాన గడువును ఆరు నెలల పాటు అంటే 2022 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘కరోనా కారణంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆధార్ సంఖ్యను శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)తో అనుసంధానం చేయడానికి గడువును సెప్టెంబరు 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్న’ట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో.. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రోపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్-1988 కింద నోటీసులు, ఆదేశాల జారీకి గడువును సైతం మార్చి 2022 వరకు పెంచారు.