Business

HDFCపై నిషేధం ఎత్తివేత-వాణిజ్యం

HDFCపై నిషేధం ఎత్తివేత-వాణిజ్యం

* క్రెడిట్‌ కార్డుల జారీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల జారీని వేగవంతం చేయనుంది. క్రెడిట్‌ కార్డుల విషయంలో నిషేధం కాలంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎంతో జట్టు కట్టింది. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పేటీఎంతో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల జారీని వేగవంతం చేసేందుకు రెడీ అవుతోంది.

* ఉద్యోగుల వేతన పెంపు వచ్చే ఏడాది నాటికి కొవిడ్‌ మునుపటి స్థాయికి చేరుకుంటుందని ఓ ప్రముఖ సర్వే అంచనా వేసింది. 2022లో వేతనాలు సగటున 8.6 శాతం పెరుగుతాయని తెలిపింది. కొవిడ్‌ ఆంక్షలతో సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపార కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. డెలాయిట్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు 25 శాతం సంస్థలు 2022 నాటికి రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాయి. కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షల నేపథ్యంలో వేతన పెంపు సగటున 4.4 శాతానికి పడిపోయింది. వ్యాపార రంగం పుంజుకుంటుండడంతో ప్రస్తుతం పెంపు సగటున 8 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికి అది మరింత పెరిగి 8.6 శాతానికి చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది.

* గత వారం కొత్త రికార్డులు నెలకొల్పుతూ లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. దీనికి తోడు ఇటీవల సూచీలు భారీ లాభాలు చవిచూసిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమూ మరో కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ సైతం కీలకమైన 17,400 మార్కు దిగువన ముగిసింది.

* వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23) బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల త‌యారీ క‌స‌ర‌త్తు అక్టోబ‌ర్ 12 నుంచి ప్రారంభం కానున్న‌ది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ సోమ‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇది మోదీ 2.0 ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స‌మ‌ర్పించ‌నున్న నాలుగో వార్షిక బ‌డ్జెట్ కానున్న‌ది. 2022 ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పిస్తారు. గ‌త కొన్నేండ్లుగా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీనే కేంద్ర బ‌డ్జెట్‌ను స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న అంచ‌నాల మ‌ధ్య ద్ర‌వ్య క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తూ, ఆర్థిక వృద్ధిరేటు వేగ‌వంతం చేయ‌డంపైనే బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో విత్త‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫోక‌స్ చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 12 నుంచి 2022-23 బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప్రీ-బ‌డ్జెట్ చ‌ర్చ‌లు ప్రారంభం అవుతాయ‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం ఓ నోటిఫికేష‌న్ జారీ చేసింది.