* అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా గురించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొన్ని విషయాలు బయటపెట్టారు. రెండు నెలలపాటు పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాకు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా కేసుపై క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పందించారు. విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్, లాప్‌టాప్, హాట్‌డ్రైవ్ డిస్క్‌లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆ వీడియోలన్నింటినీ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్‌షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. రాజ్‌కుంద్రా అరెస్ట్ బాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది.
* భారత ప్రభుత్వ అధికారులకు తమ న్యాయ ప్రతినిధులు లంచం ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అమెజాన్ స్పష్టం చేసింది. అవినీతిని ఏమాత్రం సహించబోమని పేర్కొంది. అయితే ఆరోపణలను కొట్టిపారేయడం గానీ ధ్రువీకరించడం గానీ కంపెనీ చేయలేదు. మార్నింగ్ కంటెక్స్ట్‌నివేదిక ప్రకారం.. ఈ విషయమై అమెజాన్ కొందరు న్యాయ ప్రతినిధులపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం విషయంలోనే సంస్థ సీనియర్ కార్పొరేట్ న్యాయవాదిని సెలవుపై పంపించినట్లు సమాచారం. ఈ వార్తలపై అమెజాన్ అధికార ప్రతినిధిని సంప్రదించగా.. ‘మేం అవినీతిని ఏమాత్రం సహించం. అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం. ఈ ఆరోపణలపై, దర్యాప్తు ఎంత వరకు వచ్చిందనే విషయాలపై ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోవడం లేద’ని తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే తెదేపా అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 శాతం జడ్పీటీసీలు, 85 శాతం ఎంపీటీసీ స్థానాలను వైకాపా కైవసం చేసుకుందన్నారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైకాపా గెలిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని వెల్లడించారు. కుప్పంలో చంద్రబాబును తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని అన్నారు.
* టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు రేవంత్‌రెడ్డిని ఆదేశిస్తూ సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇంజక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు న్యాయస్థానం రేవంత్ రెడ్డికి ఇంజక్షన్ ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.
* తెరాస పెట్టే కేసులకు భయపడేది లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి వైట్ చాలెంజ్ చేస్తే.. దానికి మంత్రి కేటీఆర్ పరువునష్టం కలిగిందని అనడం అవివేకమని విమర్శించారు. ఈ అంశంలో ప్రజాప్రతినిధులు టెస్టులు చేయించుకుని ఆదర్శంగా నిలవాలని కోరారు.
* గత రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా పారిశ్రామికంగా ఏపీ గణనీయ వృద్ధి సాధించిందని సీఎం జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో వాణిజ్య ఉత్సవ్-2021ని జగన్ ప్రారంభించారు. 2021 ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదైందని చెప్పారు. ‘68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రాష్ట్రానికి సహకరించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నాను’ అని జగన్ పేర్కొన్నారు.
* తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో జావడేకర్ పాల్గొన్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. 2023 ఎన్నికల్లో తెరాసతో ఉద్యమమేనని.. హుజూరాబాద్ ఎన్నికల్లో భాజపాదే విజయమని జావడేకర్ ధీమా వ్యక్తం చేశారు.
* కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది. అధికార లిబరల్ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటీవ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ చివరకు జస్టిన్ ట్రూడోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నా.. కరోనా వైరస్ రూపం మార్చుకుంటూ విస్తరిస్తూనే ఉంది. తగ్గినట్టే తగ్గి, కొత్త మార్పులతో కోరలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా రకం ప్రపంచదేశాలకు విస్తరించి, వణికిస్తోంది. కాగా, మహారాష్ట్రలో మాత్రం డెల్టాలోని ఏవై.4 రకం కేసులు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
* ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో యాంటీ వ్యాక్సిన్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం ఒక్క డోసు టీకా అయినా వేసుకొని పనికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిర్మాణరంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
* ఐపీఎల్ 14వ సీజన్‌లోని తొలి దశలో ఐదు ఓటములతో వెనుకంజలో పడిన కోల్‌కతా నైట్ రైడర్స్ సోమవారం బెంగళూరుపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి కోహ్లీసేనను చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ మోర్గాన్ మాట్లాడుతూ తమ జట్టులోని ఆటగాళ్ల ముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదని ప్రశంసించాడు.