ఫేస్బుక్ ద్వారా వేధింపులు, నకిలీ ఖాతాల ద్వారా మోసాలు, అశ్లీల వీడియోలకు సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ఫేస్బుక్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాటిని పోలీసులు నేరపూరితమైన పోస్టులుగా ధ్రువీకరిస్తే తాము వెంటనే స్పందిస్తామని వారు చెప్పారు. ఈమేరకు పోలీసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు అందులో ఎఫ్ఐఆర్ను అప్లోడ్ చేసిన వెంటనే ఫేస్బుస్ ప్రతినిధులు నిందితుడి ఖాతాను తొలగిస్తారు. వీడియోలు, చిత్రాలు కనపడకుండా చర్యలు తీసుకుంటారు. తరచూ ఒకే వ్యక్తి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుంటే వారి ఖాతాలను బ్లాక్ చేస్తుంది.
*** ఈ వేదికగా నేరాలెన్నో..
* ఫేస్బుక్ విస్తృతి పెరగడంతో ఇదే అదనుగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. యువతులు, విద్యార్థినులను వేధిస్తున్న నేరస్థుల్లో 20 శాతం మంది తప్పుడు పేర్లు, యువతుల పేర్లతో ఖాతాలు ప్రారంభిస్తున్నారు. ఎదుటివారు స్పందించగానే అసభ్యకరమైన, అశ్లీల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
* విద్యార్థినులు, మహిళలను ఆకర్షించేందుకు 20 శాతం మంది నేరస్థులు ఫేస్‌బుక్‌ను వాడుకుంటున్నారు. నకిలీ ఫొటోలతో ఖాతాలు తెరుస్తున్నారు. పరిచయమయ్యాక తమ కోరికను చెబుతున్నారు. తిరస్కరిస్తే వేధింపులకు గురి చేస్తున్నారు.
* కొందరు యువకులు ఇతర మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, పురాణ, అవతార పురుషుల చిత్రాలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి పోస్ట్‌లు పెట్టడం, వీడియోలను అప్లోడ్ చేయడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు.
* మత ప్రవచనాలను వక్రీకరిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారంటూ వివిధ మత సంస్థల ప్రతినిధుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి