Politics

హైకోర్టుకు AP CS. ఏపీ వదిలేస్తానంటున్న జేసీ-తాజావార్తలు

హైకోర్టుకు AP CS. ఏపీ వదిలేస్తానంటున్న జేసీ-తాజావార్తలు

* ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి భోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారభించి, నవంబర్‌ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ముగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండవద్దని సీఎం ఆదేశించారు.

* నరేగా బిల్లుల చెల్లింపు అంశంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో బకాయిలు లేవని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పనులపై విజిలెన్స్‌ విచారణ పెండింగ్‌లో లేదని సీఎస్‌ కోర్టుకు వెల్లడించారు. కాగా, ఈ కేసులో హైకోర్టు ఈనెల 29న తీర్పు వెలువరించనుంది.

* రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని.. వాటిపైన చర్చించేందుకు శాసనసభ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. భాజపా ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ఇకనైనా నియంతృత్వ పోకడలకు కేసీఆర్ మంగళం పాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని హితవు పలికారు.

* తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌లో 33,683 (98.53 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. ఉత్తీర్ణులైన వారిలో 25,983 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించారు.

* ‘‘నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పా.. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించి నాకు తెలియదు. రాజకీయాలు బాగోలేవు.. సమాజం కూడా బాగోలేదు. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తా. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’’ అని తెదేపా నేత జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

* వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అధికార భాజపా కీలక ప్రకటన చేసింది. నిషద్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి, యూపీ ఎన్నికల భాజపా ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌, నిషద్‌ పార్టీ చీఫ్‌ సంజయ్‌ నిషద్‌లు లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

* భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు రైతు సంఘం నేత రాకేష్‌ టికాయిత్‌ విజ్ఞప్తి చేశారు. భారత ప్రధానితో జరిగే సమావేశంలో వీటిపై ప్రస్తావించాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ.. నేడు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్న సందర్భంగా రాకేశ్‌ టికాయిత్‌ ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు.

* భారత్‌లో కీలక శాఖలపై జరిగిన సైబర్‌ దాడుల్లో చైనా హ్యాకర్ల పాత్ర లేదని బీజింగ్‌ తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. భారత్‌పై సైబర్‌ దాడుల విషయాన్ని వెల్లడించిన అమెరికన్‌ కంపెనీ నివేదికను శుద్ధ అబద్ధమని కొట్టిపారేసింది. ఇటీవల అమెరికాకు చెందిన ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌ ఏజెన్సీ .ఐఎన్‌సీ’ కంపెనీ మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది.

* మగవారు మాత్రమే విద్యాసంస్థలకు హాజరు కావాల్సి ఉంటుందని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో అఫ్గాన్‌లో విద్యార్థులందరూ (అబ్బాయిలు, అమ్మాయిలు) కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అమ్మాయిలను కూడా తిరిగి చదువుకోవడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. తాజాగా మహిళలు చదువుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఓ అమ్మాయి భావోద్వేగంగా మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అయింది.

* ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌ శుక్రవారం రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పకాలం మినహా దాదాపు రోజంతా 60 వేల ఎగువనే ట్రేడింగ్‌ నమోదయ్యింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయి గరిష్ఠాల్లో పయనించింది. ఉదయం 60,158.76 పాయింట్ల వద్ద జోష్‌ మీద ప్రారంభమై సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 60,333 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

* ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్‌కు తెర తీసింది. ఏటా ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట నిర్వహించే సేల్‌ తేదీలను తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

* రాయలసీమకు నీటి వాటాలు దక్కకుండా ఈ ప్రాంతంలో రైతులు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డేనని తెదేపా నేతలు విమర్శించారు. కడపలోని మాధవి కన్వెన్షన్‌లో రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలంతా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వెలిగొండ, గాలేరునగరి, హంద్రీనీవాలకు కృష్ణా నీటి వాటా హక్కులను వదులుకుంటామని 2006లోనే రాజశేఖర్‌రెడ్డి.. కృష్ణా ట్రైబ్యునల్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీఎం జగన్‌ లాలూచీ రాజకీయాలు చేస్తూ సీమకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్‌రెడ్డి ఆరోపించారు.

* అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. దామోదర్‌రెడ్డి అనే వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దామోదర్‌రెడ్డిని కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. హత్య అనంతరం నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వ్యాపారంలో తలెత్తిన గొడవల కారణంగానే దామోదర్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది.

* తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న జహీరాబాద్‌ చెరకు రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా చెరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని.. రైతులకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చెరకును ప్రభుత్వమే కర్ణాటక మిల్లులకు తరలించాలన్నారు. మద్దతు ధర కల్పిస్తే రైతుబంధు, బీమా, రుణమాఫీ అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వా్న్ని నిలదీస్తామన్నారు. చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని రేవంత్‌ ప్రశ్నించారు.

* తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ పార్టీ చర్చించింది. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్యేలు జ‌గ్గారెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, సీత‌క్కలు హాజరయ్యారు.

* కలసపాడు మండలానికి వెలుగొండ ప్రాజెక్టు నీరు తెచ్చుకునేందుకు వైకాపా నాయకులు తమ వంతు కృషి చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ గోవింద రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని రాచ్చెరువుకు వెలుగొండ ప్రాజెక్టు నీరు చేరితే.. ఈ ప్రాంతంలోని 18 నుంచి 20వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అంది సస్యశ్యామలం అవుతుందన్నారు. భవిష్యత్తులో మిగిలిన అన్ని గ్రామాలకు తారు రోడ్లు వేయించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. పార్టీ తరఫున గెలుపొందిన ప్రజా ప్రతినిధులు, వైకాపా నాయకులు ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు పాల్గొన్నారు.

* మండల తహసీల్దారు కార్యాలయం వద్ద శుక్రవారం మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.21వేలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాడ్యుటీ సదుపాయం కల్పించాలన్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌లో భాగంగా రూ.5లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలన్నారు. కొవిడ్‌తో మరణించిన వర్కర్స్‌కు రూ.50లక్షల బీమా పథకం అమలు చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారు రామచంద్రుడికి అందజేశారు. కార్యక్రమంలో కె.వి.పి.ఎస్‌ జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ కుమార్‌, సీఐటీయూ నాయకులు విజయమ్మ, మేరి తదితరులు పాల్గొన్నారు.

* టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌ జహీరాబాద్‌ పర్యటనకు వస్తున్నట్లు తనకు సమాచారం లేదని.. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే కాంగ్రెస్‌ పార్టీలో కుదరదని వ్యాఖ్యానించారు. కనీసం మాజీ మంత్రి గీతారెడ్డికి కూడా సమాచారం లేదన్నారు. సంగారెడ్డి వస్తే తనకు సమాచారం తెలియలేదని చెప్పారు. విబేధాలు ఉన్నాయని చెప్పేందుకే సమాచారం ఇవ్వట్లేదా? అని నిలదీశారు. సీఎల్పీ అంతర్గత సమావేశంలో ముఖ్యనేతల వద్ద జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.