Business

వాట్సాప్‌లో క్యాష్‌బ్యాక్-వాణిజ్యం

వాట్సాప్‌లో క్యాష్‌బ్యాక్-వాణిజ్యం

* వాట్సాప్‌ పేమెంట్స్‌ పేరిట ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థని ప్రారంభించిన ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానున్నట్లు సమాచారం. తమ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను ప్రోత్సహించేలా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత వాట్సాప్‌ బీటా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు సమచారం.

* ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌ శుక్రవారం రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పకాలం మినహా దాదాపు రోజంతా 60 వేల ఎగువనే ట్రేడింగ్‌ నమోదయ్యింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయి గరిష్ఠాల్లో పయనించింది. ఉదయం 60,158.76 పాయింట్ల వద్ద జోష్‌ మీద ప్రారంభమై సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 60,333 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 163 పాయింట్లు లాభపడి 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం దాదాపు ఇదే దూకుడును ప్రదర్శించింది. 18,000 పాయింట్ల మైలురాయిని చేరుకుంటుందని భావించినప్పటికీ.. గరిష్ఠాల వద్ద నిరోధం ఎదురుకావడంతో పైకి ఎగబాకలేకపోయింది. ఉదయం 17,897.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 17,947.65 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.75 వద్ద ముగిసింది.

* ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్‌కు తెర తీసింది. ఏటా ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట నిర్వహించే సేల్‌ తేదీలను తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే మరో ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వచ్చే నెల 7వ తేదీ నుంచి ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

* ఆతిథ్య సేవల సంస్థ ఓయో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా 1.2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8000 కోట్లు) వరకు సమీకరించడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ ముసాయిదా పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పబ్లిక్‌ ఇష్యూ నిర్వహించేందుకు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లను ఓయో నియమించుకుంది. అయితే దీనిపై ఓయో స్పందించలేదు. ఈ ఏడాది జులైలో జొమాటో ఐపీఓ విజయవంతమైన తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ఓయో సిద్ధమైంది. గత వారం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చేందుకు ఓయో మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌ వాటాదార్లు ఆమోదం తెలిపారు.

* రూ.2 కోట్ల వరకు గృహ రుణాలు తీసుకునే గృహ కొనుగోలుదార్లకు శుభవార్త. ఇప్పటి వరకు రూ.50 లక్షల్లోపు గృహ రుణాలకు మాత్రమే అందుబాటులో ఉన్న అతి తక్కువ గృహ రుణ రేటు 6.66 శాతాన్నే రూ.2 కోట్ల రుణాల వరకూ వర్తింపజేయనున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది. ఈ రుణ రేటును గత జులై నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్, ఈ నెల 22 నుంచి నవంబరు 30 వరకు మంజూరు చేసే గృహ రుణాలకు కూడా వర్తింపజేయనున్నట్లు తెలిపింది. సిబిల్‌ స్కోరు 700 అంత కంటే ఎక్కువ ఉన్న ఖాతాదార్లకు వారి వృత్తితో నిమిత్తం లేకుండా రుణాలు జారీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ వై.విశ్వనాథ గౌడ్‌ వెల్లడించారు.