అనైతిక వ్యాపార పద్ధతులు పాటిస్తోందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన తమపై గూగుల్ బెదిరింపులకు పాల్పడుతోందని ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఆరోపించింది. దర్యాప్తునకు సంబంధించిన నివేదికలోని రహస్య సమాచారాన్ని లీక్ చేశామని.. ఈ విషయంలో సీసీఐని కోర్టుకీడుస్తామంటూ బెదిరిస్తున్నారన్నారు. ఈ మేరకు కాలిఫోర్నియా నుంచి గూగుల్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి నుంచి ఫోన్ వచ్చిందని దిల్లీ హైకోర్టుకు సీసీఐ తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని మీడియా బయటకు వెల్లడిస్తే మీడియాను సైతం కోర్టుకు లాగుతామని బెదిరించారన్నారు.
దర్యాప్తుని పక్కదారి పట్టించేందుకు గూగుల్ ఇలా చేస్తోందని సీసీఐ ఆరోపించింది. పరోక్షంగా దర్యాప్తు అడ్డు తగిలేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మరో 10 రోజుల్లో దర్యాప్తునకు సంబంధించిన అన్ని నివేదికల్ని గూగుల్‌కు పంపుతామని తెలిపింది. ఆ తర్వాత వారిని వివరణ కోరతామన్నారు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. కానీ, దర్యాప్తు ప్రక్రియను మధ్యలోనే వారు అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఇది చట్టానికి విరుద్ధమన్నారు. గూగుల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. దర్యాప్తునకు సంబంధించిన రహస్య నివేదికను గూగుల్‌కు ఇవ్వడానికి ముందే సీసీఐ మీడియాకు లీక్ చేసిందని ఆరోపించారు. నివేదికలోని పూర్తి వివరాల్ని రాయిటర్స్ ప్రచురించిందన్నారు. ప్రతిరోజు ఏదో విషయంలో సమాచారం బయటకు వస్తూనే ఉందన్నారు. లీకుల విషయంపై కోర్టును ఆశ్రయించిన తర్వాత సీసీఐ తమతో మాట్లాడిందన్నారు. లీక్‌లను తీవ్రంగా పరిగణిస్తున్నామని దీనిపై దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారన్నారు.
నిబంధనల ప్రకారం దర్యాప్తును రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని గూగుల్ కోర్టుకు తెలిపింది. లేదంటే తమపై వస్తున్న ఆరోపణల నుంచి తమని తాము కాపాడుకోవడం కష్టతరమవుతుందంది. దీనిపై స్పందించిన సీసీఐ.. గూగుల్ కోరిన ప్రతిచోటా గోప్యత మెయింటైన్ చేశామని పేర్కొంది. ఒకరకంగా తాము సంస్థకు సాయం చేశామని తెలిపింది. అయినా, తమపై ఆరోపణలు గుప్పించడం సరికాదని వాదించింది.
దేశంలోని స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ వ్యవస్థ విపణిలో అనైతిక వ్యాపార పద్ధతులు పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై సమగ్ర దర్యాప్తునకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. గూగుల్‌పై వచ్చిన ఫిర్యాదును మదింపు చేసిన తర్వాత.. భారత్‌లోని స్మార్ట్ టీవీ డివైజ్ ఆపరేటింగ్ వ్యవస్థల లైసెన్సుల్లో సంస్థ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నట్లు సీసీఐ నిర్థారణకు వచ్చింది. టాడా కింద గూగుల్ యాప్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తోందని, స్మార్ట్ టీవీ తయారీదార్లుపై అనైతికంగా షరతులు విధిస్తున్నట్లు సీసీఐ 24 పేజీల ఆదేశాల్లో పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్ట్ ప్రాజెక్ట్ (ఏఓఎస్‌పీ)ను మూడో పార్టీకి ఓపెన్ సోర్స్ లైసెన్స్ కింద ఎవరికైనా ఇస్తూనే, గూగుల్‌కు మేధోపరమైన హక్కులున్న ప్లేస్టోర్, యూట్యూబ్ వంటి వాటిని టీవీ తయారీ సంస్థలకు ఇవ్వడం లేదని, ఆండ్రాయిడ్ లోగో వినియోగానికీ హక్కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఇవి ఇవ్వాలంటే, టాడా కింద ఒప్పందం చేసుకోవాలని టీవీ తయారీ కంపెనీలకు షరతు విధిస్తోందని తెలిపింది. పోటీ చట్టంలోని సెక్షన్ 4(2)(ఏ)కు ఇది విరుద్ధమని తెలిపింది.