టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మళ్లీ అదృశ్యమయ్యారు. గత రెండు రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎవరికీ అందుబాటులో లేరు.
కుటుంబ సభ్యులకు ఆయన ఎక్కడున్నారన్న వివరాలు చెప్పలేదు. ఆయన వినియోగించే వ్యక్తిగత వాహనాలను సైతం ఇంటిదగ్గరే వదిలిపెట్టారు. గతంలోనూ ఆయన ఇలాగే కనిపించకుండా పోతే పోలీసులే ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చారు. తాజాగా మరోసారి ఆయన కనిపించకుండా పోయారు.
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వేల కోట్ల రూపాయలను అక్రమంగా అర్జించారని, అక్రమాస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని బయట్టబయలు చేయడానికి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, ఆయన సతీమణి నాగమణి ప్రయత్నాలు చేశారు. హైకోర్టులోనూ పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. కానీ, వీరిని పట్టపగలే నడిరోడ్డుపై హతమార్చారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి పుట్ట మధు అనే ఆరోపణలున్నాయి. వీటిని ఆయన ఖండించారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇప్పటికీ పుట్ట మధు నిందితుడిగా ఉన్నారు. ఈ హత్యపై స్పందించిన హైకోర్టు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసింది.